శంకరాభరణం ఓ ఆభరణం
‘‘ఈ రోజుల్లో సినిమాలు సమాజంపై మంచి ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు రావాలి. భారతీయ సినిమా స్థాయిని శంకరాభరణం పెంచింది. ‘శంకరాభరణం’ చిత్రపరిశ్రమలో అత్యద్భుత చిత్రం. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి సినిమాలు వచ్చాయి. వాటి గొప్పదనం వాటికి ఉంటుంది. అయితే ‘శంకరాభరణం’ శంకరాభరణమే. సినీప్రపంచానికి ఆభరణం లాంటి సినిమా. విశ్యనాథ్‌గారు ఓ ఆభరణమే’’ అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు తెలుగు దర్శకుల సంఘం ఆయన్ను సన్మానించింది. సన్మాన పత్రాన్ని నటుడు తనికెళ్ళ భరణి చదివి, వినిపించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదగా కె. విశ్వనాథ్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇంకా జాతీయ అవార్డు గ్రహీతలు ‘శతమానం భవతి’ నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాతలు యష్ రంగినేని తదితరులను సన్మానించారు.