Sankarabharanam
-
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా.. సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయననోట అలవోకగా జాలువారుతాయి. ఘంటసాల తరువాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు పొందిన ఏకైక గాయకుడు. హీరోల వాయిస్ తగినట్లు పాడడం ఆయన స్పెషల్. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. ఆయన మరణం టాలీవుడ్‌కే కాకుండా యావత్ భారత సినీ చిత్రపరిశ్రమకు లోటని చెప్పక తప్పదు. (ఎస్పీ బాలు కన్నుమూత) ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలుయే పెద్ద దిక్కయ్యారు. తన గాత్రంతో పాత్రలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడివారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. ముఖ్యంగా భక్తి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటావినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో అవార్డులు ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం(1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషన్ వరించింది. 1999లొ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. బాలు గురించి మరికొన్ని విషయాలు ► ఓ ఇంటర్వ్యూలో బాలు ఇళయరాజాను బెస్ట్ కంపోజర్‌గా పేర్కొన్నారు. కానీ అదే ఇళయరాజా తన పాటలు ఎవరు పాడినా దానికి ఇంత రాయల్టీ ఇవ్వాలని బాలు అబ్బాయి నిర్వహిస్తున్న సంస్థకు తాఖీదులు పంపారు. మిత్రుడికి లీగల్ నోటీస్ ఇవ్వడమేంటని ఆయన చాలా బాధపడ్డారు. ► బాలుకు అత్యంత ఇష్టమైన గాయకుడు మహమ్మద్ రఫీ. ► శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానికి గానూ మొదటి రెమ్యూనరేషన్ 300 రూపాయలు తీసుకున్నారు. ► ఒక్క శంకరాభరణం సినిమాకు పాడే విషయంలో మాత్రమే ప్రత్యేకంగా ప్రాక్టీసు చేశారు. ► గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 29 సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సంస్కార నిరూపణే శంకరాభరణం
నాటి సినిమా గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. తన కుటుంబాలలో స్త్రీలు ఇంతకాలం చేసినట్టుగా మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసే. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసి. ఆ అమ్మాయికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి. ఎలాంటి ఆర్తి అది? ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కాని ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. శంకర శాస్త్రి– తులసి. ఇద్దరూ బహిష్కృతులు. పాములు. ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము. విషపురుగు. కాని అది శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం. శంకరశాస్త్రి ఉపాసకుడు. నాదోపాసకుడు. అగ్నిని అరచేత ధరించి సత్యం పలుకగలిగిన సరస్వతి పలుకు ఉన్నవాడు. ఆయన పాడితే పాములు కూడా పడగ విప్పి వింటాయి. పక్షులు రెక్కలు ముడుచుకుని కూచుంటాయి. చెట్లు తలలు ఊపుతూ వంత పలుకుతాయి. అటువంటి శంకరశాస్త్రి, భార్యా వియోగుడైన శంకర శాస్త్రి, ఒక్కగానొక్క కూతురిని పోషించుకుంటూ ఉన్న శంకరశాస్త్రి అనుకోని పరిస్థితిలో తులసిని చూస్తాడు. ఆమె కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. కన్న తల్లే ఆమెను అమ్మేయాలనుకుంటుందని తెలిసి ఆదుకుంటాడు. కాని దానివల్ల తానే నష్టపోతాడు. సంఘం అనుమానంగా చూస్తుంది. సమాజం నోరు నొక్కుకుంటుంది. వెంట నిలిచే స్నేహితులు తప్ప ఎవరూ మిగలరు. ఇది తులసి తట్టుకోలేకపోతుంది. ఆయన కోసమే ఆయనను దూరంగా వదిలిపోతుంది. ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచ్చేరి అంటే విరబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్తోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు. ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది. తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు. ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు క్రిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది. 1979లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందబాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది. శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరరాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి. ఏ సంగీతం అయితే ఏమిటి? ఏ మతం అయితే ఏమిటి? ఏ సమూహం అయితే ఏమిటి? అది పాటిస్తున్న విలువలు, కొనసాగిస్తున్న సంప్రదాయం, అది నిలబెడుతున్న నాగరికత సమాజ హితంలో ఉంటే ఏ సమాజం కూడా దానిని వదలుకోదు. నిలబెట్టుకుంటుంది. వెంట నడిచి కాపాడుకుంటుంది. మాసిన తెల్లరంగు గోడల మీద తిరిగి తెల్లరంగు వేయడాన్ని ఎవరు వద్దంటారు. మాసిన గొప్ప సంగీతాన్ని తిరిగి నిలబెడతానని శంకరాభరణం అంటే అందుకే వెల్కమ్ చెప్పారు. శంకరాభరణం తీసినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు, దర్శకుడు విశ్వనాథ్‌కు మాత్రమే శభాష్ అనకూడదు. సినిమా విడుదలయ్యాక పసిగట్టి పెరుగన్నం పాయసం తినిపించిన ప్రేక్షకులను కూడా శభాష్ అనాలి. అప్పుడే అందరూ గెలిచినట్టు. ఓంకార నాదాను సంధానమౌ గానమే... శంకరాభరణమూ. -
శంకరాభరణం ఓ ఆభరణం
‘‘ఈ రోజుల్లో సినిమాలు సమాజంపై మంచి ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు రావాలి. భారతీయ సినిమా స్థాయిని శంకరాభరణం పెంచింది. ‘శంకరాభరణం’ చిత్రపరిశ్రమలో అత్యద్భుత చిత్రం. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి సినిమాలు వచ్చాయి. వాటి గొప్పదనం వాటికి ఉంటుంది. అయితే ‘శంకరాభరణం’ శంకరాభరణమే. సినీప్రపంచానికి ఆభరణం లాంటి సినిమా. విశ్యనాథ్గారు ఓ ఆభరణమే’’ అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు తెలుగు దర్శకుల సంఘం ఆయన్ను సన్మానించింది. సన్మాన పత్రాన్ని నటుడు తనికెళ్ళ భరణి చదివి, వినిపించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదగా కె. విశ్వనాథ్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇంకా జాతీయ అవార్డు గ్రహీతలు ‘శతమానం భవతి’ నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాతలు యష్ రంగినేని తదితరులను సన్మానించారు. -
‘శంకరాభరణం ’ నా పేరులో భాగమైంది
అన్నవరం : కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమా తనకు ఎంతో పేరు తెచ్చిందని, ఆ సినిమా పేరు తన పేరులో భాగమైందని ప్రముఖ నటి శంకరాభరణం రాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలసి రత్నగిరిపై సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా వలనే తాను చాలా గుర్తింపు పొందానన్నారు. సత్యదేవుని సన్నిధికి వచ్చినా, అన్నవరం మీదుగా ప్రయాణించినా తనకు ఆ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయన్నారు. తాను ఆ సినిమా తరువాత సుమారు 200 సినిమాలలో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బాటు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్టు శంకరాభరణం రాజ్యలక్ష్మి తెలి పారు. ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు స్వాగ తం పలి కారు. అనంతరం పండితులు వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. -
నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే!
- నిఖిల్ ‘‘ ‘శంకరాభరణం’ చిత్రంలో ఎంటర్టైనింగ్ పార్ట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు ఉదయ్ పన్నెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’’ అని కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘ప్రథ మార్థంలో సప్తగిరి, సెకండాఫ్‌లో పృథ్విరాజ్‌ల కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అన్నారు.‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా రీచ్ అవ్వాలని ‘శంకరాభరణం’ చేశాను. అది నెరవేరింది. 600 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తే అసలు చూస్తారా అని నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ షో నుంచి థియేటర్స్ హౌస్‌ఫుల్. నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే’’ అని నిఖిల్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులు నిలబెట్టిన సినిమా ఇది. అందుకే మేం మీ ముందు ధైర్యంగా నిలబడి ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. వెంకటేశ్ అనే అంధ విద్యార్థి మాట్లాడుతూ - ‘‘నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లా. స్టార్టింగ్ టు ఎండింగ్ కడుపుబ్బా న వ్వుతూనే ఉన్నాం. చాలా కాలం తర్వాత బాగా నవ్వానన్న ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, నైజాం పంపిణీదారు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
టైటిలాభరణం
కొత్త సినిమా గురూ! ‘శంకరాభరణం’ కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్, శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది. తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’. టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు. అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే ముప్పులో పడతాడు హీరో తండ్రి. పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు. ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్ ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు. ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా) హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో కిడ్నా పర్కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌సఫరవుతుంటారు. ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా. కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి. వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు. అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది కమెడియన్లున్నారు. కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం. ‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్ నందనవనమ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో తెరపై చూసి చెప్పడం కష్టమే. కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం. సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ, హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది. ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే, స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం, బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు. - రెంటాల జయదేవ * హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు. * బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్ ప్రధానంగా మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి. -
ప్రస్తుతానికి నా గర్ల్‌ఫ్రెండ్ ఆయనే!
న్యూ జనరేషన్ హీరోల్లో నిఖిల్‌ది సెపరేట్ స్టయిల్. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ఇంకోసారి టచ్ చేయడు. ఎప్పటికప్పుడు తనకంటూ ఓ పంథా ఏర్పరచుకున్న నిఖిల్ ఈ శుక్రవారం ‘శంకరాభరణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో చెప్పిన ముచ్చట్లు... * ఓ రోజు సడన్‌గా కోన వెంకట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. కథ వినడానికి రమ్మన్నారు. విని ఇంప్రెస్ అయిపోయా. ఫుల్ నెరేషన్ కావాలని అడిగినా ఆయన ఫీల్ కాలేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి, నాకు వినిపించారు. * ‘శంకరాభరణం’ టైటిల్ పెడుతున్నామని చెప్పగానే నేను షాకైపోయా. రిస్కు అవుతుందేమోనని చెప్పా. ఆ టైటిల్ తో మనం బూతు సినిమా సినిమా తీస్తే తప్పుగానీ మంచి కంటెంట్ అందిస్తే ఏం ఫరవాలేదని కోన గారు నాకు భరోసా ఇచ్చారు. * ఈ టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అయ్యిందని నా అభిప్రాయం. * గతంలో నేను నటించిన ‘డిస్కో’ సినిమా చూస్తూ ఓ కుర్రాడు మధ్యలో హాలులో నుంచి వెళ్లిపోతూ, ‘భయ్యా... ఇక ఈ సినిమా చూడలేను’ అని కామెంట్ చేశాడు. నేను చాలా బాధపడ్డాను. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని డిసైడై, ట్రెండ్ మార్చాను. అప్పటి నుంచి కొత్త తరహా కథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. అలా ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘శంకరాభరణం’ నాకు దక్కాయి. * సినిమా తర్వాత సినిమా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది ఖరీదైన వ్యవహారం. క్వాలిటీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే ప్రమోషన్‌కు కూడా సమయం కేటాయించాలి. * ‘టైగర్’ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా చేయనున్నా. అలాగే చందు మొండేటి ద ర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చేస్తాను. దానికి ఇప్పటికే కథ రెడీ చేసేశాం. ‘కార్తికేయ’కు ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. * నేనింతవరకూ ప్రేమలో పడలేదు. చాలా ఏళ్లుగా ఐ యామ్ సింగిల్. ఇంటర్, ఇంజనీ రింగ్ ఎడ్యుకేషన్ టైమ్‌లో క్రషెస్ ఎవరికైనా కామన్ కదా. ఇప్పుడైతే నాకంత టైమ్ దొరకడం లేదు. సినిమాలతోనే గడిచిపోతోంది. ఇప్పుడు కోన గారే నా గర్ల్‌ఫ్రెండ్. * మా ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకో రెండు సినిమాలు హిట్టయితే పెళ్లి చేసుకుంటానని వాయిదా వేసుకుంటూ వస్తున్నా. అయితే పెద్దలు కుదిర్చిన అమ్మాయినే చేసుకుంటా. * ఆ మధ్య న్యూయార్క్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. అది టైమ్‌పాస్ కోసమే. అంతేగానీ ఏదో డెరైక్షన్ చేసేద్దామని మాత్రం కాదు. నా దృష్టి ఎప్పుడూ యాక్టింగ్ మీదే. -
నాగ చైతన్యకు నా థ్యాంక్స్...
హైదరాబాద్: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న శంకరాభరణం చిత్రంలోని ఒక సాంగ్ మేకింగ్ వీడియోను టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లాంచ్ చేశాడట. ఈ విషయాన్ని కోన వెంకట్ , హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. 'శంకరాభరణం సినిమాలోని సాంగ్ మేకింగ్ వీడియో నాగ చైతన్య లాంచ్ చేశారు, చైతన్య కు నా థ్యాంక్స్' అంటూ ఈ చిత్ర సమర్పకుడు కోన వెంకట్ ట్వీట్ చేశారు. నిఖిల్, నందిత, అంజలి ప్రధాన పాత్రలుగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'శంకరాభరణం'. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. కథలోని హీరో ఎన్ఆర్ఐ. తనకు సంబంధించిన భూమిని విడిపించుకోవాలనే ఉద్దేశంతో అతడు సొంత ఊరికి వస్తాడు. అక్కడ హీరోకు అనేక ఆటంకాలు , కుట్రలు ఎదురౌతాయి. అయితే వాటినన్నింటినీ ఛేదించి తన భూమిని ఎలా విడిపించుకున్నడన్నదే కథ. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా భాగం బిహర్ లో జరిగింది. 2010లో విడుదలైన 'ఫస్ గయ రే ఒబామా' అనే హిందీ సినిమాకు మూలమనీ, దీనికి సంబంధించిన సౌత్ రైట్స్ మొత్తం తాము తీసుకున్నట్టు కో న వెంకట్ తెలిపారు. నోబెల్ ఆండ్రే ప్రొడక్షన్స్ సహకారంతో కేరళలో మొత్తం 30 సెంటర్లలో శంకరాభరణం విడుదల చేయనున్నట్లు కోన వెంకట్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్.. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు కూడా అందించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. Thank u @chay_akkineni for launching the theme song of SHANKARABHARANAM https://t.co/WW08mIi2rX pic.twitter.com/LsVDSxCvHI — kona venkat (@konavenkat99) November 19, 2015 Thank you so much @chay_akkineni for releasing the Theme of ShankaraBharanam.. Here it is, hope you like it :-) - https://t.co/TdY7nr4X4K — Nikhil Siddhartha (@actor_Nikhil) November 19, 2015 -
స్పెల్ బౌండ్ అయ్యా!
- నిఖిల్ ‘‘నా కెరీర్లో ‘ఢీ’ చిత్రం ఒక మైల్ స్టోన్. ఆ సినిమా విడుదలై పదేళ్లయ్యింది. ఆ చిత్రం తర్వాత ‘శంకరాభరణం’ మరో కొత్త అధ్యాయానికి తెర తీసే చిత్రం అవుతుంది. హిందీ చిత్రాల స్థాయిలో తెలుగు చిత్రాలు ఉంటాయా? అనేవారికి ‘శంకరాభరణం’ మంచి సమాధానం అవుతుంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ఈ చిత్రానికి కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ - ‘‘హిందీ చిత్రం ‘ఫస్ గయా రే ఒబామా’ చూసి, ఒక ఐడియా తీసుకుని దాని చుట్టూ కథ అల్లాను. ఈ చిత్రనేపథ్యం, స్క్రీన్‌ప్లే, టోటల్‌గా స్క్రిప్టే ఓ సవాల్ . గౌతమ్ పాత్రను నిఖిల్ అద్భుతంగా చేశాడు’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వె ర్సస్ సూర్య’ తర్వాత నేనో డిఫరెంట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్న టైంలో కోన వెంకట్‌గారి నుంచి ఫోన్ వచ్చింది. బాలకృష్ణగారు, రామ్‌చరణ్ లాంటి పెద్ద హీరోలతో వర్క్ చేసే స్థాయి ఆయనది. ఆయన ‘శంకరాభరణం’ కథ చెప్పినప్పుడు స్పెల్ బౌండ్ అయ్యా’’ అని చెప్పారు. ‘‘పాటలకు మంచి స్పందన లభించింది. ఆదివారం వైజాగ్‌లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరపనున్నాం’’ అని చిత్ర సంగీతదర్శకుడు ప్రవీణ్ లక్కరాజు అన్నారు. ఉదయ్ నందనవనమ్, నందిత, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు. -
బిహార్‌లో మలుపులు!
అతనో ఎన్నారై. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. అందుకే అతనికి ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేట్ అయినా పెట్టి మరీ దక్కించుకుంటాడు. కష్టాలంటే తెలీవు. ఇలాంటి కుర్రాడు ఓ పని మీద బిహార్‌లో అడుగుపెడతాడు. అప్పటి నుంచి అతనికి కష్టాలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఈ కుర్రాడి జీవితం ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘క్రైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. డిసెంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి. -
ఈ సినిమా అందరికీ ఓ సమాధానం!
‘‘నేను ఇటీవలే ‘సరైనోడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేశాను. ‘వీడు మాములోడు కాదు’ అనే టైటిల్‌ను పెట్టి కోన వెంకట్‌ను హీరోగా పెట్టి తీద్దామనుకుంటున్నా. కోన వెంకట్ కు ఏదైనా చేయగల సత్తా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపించేలా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా పతాకంపై నిఖిల్, నందిత జంటగా అంజలి ముఖ్యపాత్రలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించి, తొలి సీడీని కథానాయిక సమంతకు అందించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ- ‘‘కోన వెంకట్ నా శ్రేయోభిలాషి. ఏది చేసినా కొత్తగా ట్రై చేస్తాడు. ‘శంకరా భరణం’ టైటిల్ పెట్టి, తుపాకీలు, బీహార్ బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘కోన వెంకట్‌గారు ఇక్కడ నేను కెరీర్ స్టార్ చేసినప్పట్నుంచీ తెలుసు. సాంగ్స్‌లో మంచి కిక్ ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని సమంత అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘ఈ రోజు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందు పవన్‌కల్యాణ్‌గారి నుంచి మొదలుపెట్టాలి. తర్వాత సమంత గారికి చెప్పాలి. ‘శంకరాభరణం’ తర్వాత అంజలికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. నందిత తన పాత్రలో జీవించింది. ఈ సినిమా బాగా రావడానికి కారణం కెమేరామ్యాన్ సాయిశ్రీరామ్. చాలామంది ఇది కాపీ సినిమా అంటున్నారు. ‘ఫస్ గయే రే ఒబామా’ అనే హిందీ సినిమా దక్షిణాది రైట్స్ తీసుకుని, ఆ కథాంశం స్ఫూర్తితో ఓ లైన్ తీసుకుని ఈ ఫిల్మ్ చేశాం. అక్కడి రాజకీయ నాయకులకు కిడ్నాపింగ్ సైడ్ బిజినెస్. వాళ్ల పేర్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇక్కడి ప్రేక్షకులకి కొత్తగా ఉంటుంది. బాలీవుడ్ తరహా సినిమాలు ఇక్కడ రావడం లేదనే వారందరికీ ఈ సినిమానే సమాధానం’’ అని చెప్పారు. దర్శకులు కె.విశ్వనాథ్, శ్రీవాస్, బాబీ, మారుతి, నిఖిల్, నందిత, రావురమేశ్, దీక్షాపంత్, తమన్ పాల్గొన్నారు. -
‘శంకరాభరణం’ టీజర్‌ను విడుదల చేసిన పవన్‌కల్యాణ్
-
వెంకన్న దయవల్లే నా సినిమాలు హిట్
తిరుమల : 'హ్యాపీడేస్'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా.. స్వామిరారాతో బాగా ఫేమస్ అయిన యువహీరో నిఖిల్ తనకు వేంకటేశ్వరస్వామి అంటే సెంటిమెంట్ అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తిరునాథుడంటే చాలా భక్తి ఉందని.. తాను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా తిరుమల శ్రీవారిని మొక్కుకుంటానని చెప్పుకొచ్చాడు. తిరుమలకు కుటుంబ సభ్యులతో వచ్చిన అతడు శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం 'సాక్షి'తో మాట్లాడుతూ 'ఆ దేవుడి దయ వల్లే నా సినిమాలు స్వామిరారా, కార్తీకేయ విజయం సాధించాయి. ప్రస్తుతం శంకరాభరణం సినిమా షూటింగ్లో ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధించేందుకు స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చాను. గత ఏడాది దీపావళికి కార్తీకేయ విడుదలై విజయం సాధించింది. ఈ దీపావళికి శంకరాభరణం విడుదల కానుండటంతో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. స్వామివారు నాకు సక్సెస్ ఇవ్వడంతో తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నాను. నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్ చేస్తాను. ఆ అభిమానుల ఆదరణకు అభినందనలు' అని చెప్పాడు. -
శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవం
ఎనభై మూడేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ‘శంకరాభరణం’ ఒక ప్రత్యేక చరిత్ర. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పద్మా సుబ్రహ్మణ్యం లాంటి సుప్రసిద్ధ సంగీత, నృత్య విద్వన్మణుల మొదలు రాజ్‌కపూర్ లాంటి సినీ దిగ్గజాల దాకా అందరినీ ఆకట్టుకున్న ఆ కళాఖండం విడుదలై (1980 ఫిబ్రవరి 4) ఇది 36వ సంవత్సరం. ఈ వెండితెర కావ్యంలోని సంగీత, సాహిత్య అంతరార్థాలు నిజంగానే కావ్యగౌరవాన్ని సంతరించు కొంటున్న ప్రత్యేక సందర్భం ఇప్పుడు ఎదురవుతోంది. ఒక సినిమాపై ఒక సరస్వతీపుత్రుడు మొట్టమెదటిసారిగా ప్రవచన రూపంలో విశ్లేషణ చేయనున్నారు. కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆగస్టు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని శ్రీసత్య సాయి నిగమాగమంలో సాయంత్రం 6 గంటలకు ఈ విశ్లేషణ ప్రవచనం సాగనుంది. ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) సామ గాన సౌరభం - శంకరాభరణం’ శీర్షికన జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను ‘శంకరాభరణం’ దర్శకులు కె. విశ్వనాథ్, కార్యక్రమ నిర్వాహకులైన శ్రీనివాస్, శ్రీధర్‌లు మంగళవారం వివరించారు. మంగళంపల్లికి గురుపూజ ‘‘సుందరకాండ, రామాయణ, భారతాల లాగా గురుశిష్య సంబంధమైన ‘శంకరాభరణం’ గురించి ఒక సప్తాహం చేయగలనని పదేళ్ళ క్రితమే చాగంటి గారు నాతో అన్నారు. ఆ ప్రశంస నాకు ‘భారత రత్న’, ‘పద్మవిభూ షణ్’లను మించినది. అప్పటి ఆ మాటను ఆయనిప్పుడు నిజం చేస్తున్నారు. ఈ ప్రవచన రూప విశ్లేషణతో ఒక సినిమాకు అచ్చమైన కావ్యగౌరవం ప్రసాదిస్తున్నారు’’ అని విశ్వనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమం చివరి రోజున చాగంటి గారు తన గురువులైన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్‌ను సత్కరిస్తే, గాయకులు డి.వి. మోహనకృష్ణ తన గురువైన మంగళంపల్లి బాలమురళీకృష్ణను సభక్తికంగా గౌరవించనున్నారు. త్రిపుష్కరోత్సవ ప్రత్యేక గీతం... నృత్యం... ఈ సందర్భంగా ‘శంకరాభరణం త్రిపుష్కరోత్సవ గీతం’ పేరిట రచయిత రాంభట్ల నృసింహశర్మ ప్రత్యేకంగా పాట రాయడం విశేషం. సినీ గాయకుడు ఎన్.వి. పార్థసారథి సంగీతం అందించి, శ్రీమతి తేజస్వినితో కలసి పాడారు. కాకినాడకు చెందిన నర్తకి వీణ ఆ గీతానికి నృత్యం చేయ నున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇప్పటికే ప్రపంచమంతటా అందరూ గౌరవించడం ‘శంకరాభరణం’కు దక్కిన అమ్మ ఆశీర్వాదం లాంటిదైతే, ఇప్పుడీ చాగంటి వారి ప్రవచనం పండితుల ఆశీర్వాదం లాంటిదని విశ్వనాథ్ అన్నారు. మొదటి ఆశీర్వాదం ఈ సినిమాకు ఎప్పుడో దక్కినా, ఇప్పుడీ రెండో ఆశీర్వాదం అంతకు మించినదని అభిప్రాయ పడ్డారు. ‘సాగరసంగమం’, ‘స్వర్ణ కమలం’ లాంటి ఇతర సినీ కావ్యాలపై కూడా సమగ్రమైన విశ్లేషణ జరిగితే, మరింత మందికి వాటిలోని అంతరార్థాలు తెలియవచ్చని ఆయన వ్యాఖ్యా నించారు. -
సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ!
నటి తులసి గుర్తున్నారా? ‘శంకరాభరణం’ నాటి బేబీ తులసి ఆ తరువాత కథానాయికగా కూడా కొంతకాలం ఆకట్టుకున్నారు. కొంతకాలం గ్యాప్ తరువాత ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో నటిస్తున్నారు. ‘‘చాలా రోజుల తరువాత సినిమాకు కీలకమైన ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నా’’ అని తులసి చెప్పారు. ఈ తరం యువ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నందుకు సహజంగానే ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే, సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో చిరకాల అనుబంధమున్న తులసికి ఆ సంగతులు కూడా గుర్తే. మహేశ్‌బాబు చిన్నప్పుడు అతని పుట్టినరోజు వేడుకలకు హాజరైన సంగతులు ఇప్పుడు స్టార్ హీరో అయిన ఆయనకు ‘శ్రీమంతుడు’ సెట్స్‌లో జ్ఞాపకం చేశారట! ఆ సంగతులు చెప్పగానే మహేశ్ హాయిగా నవ్వేశారట! ‘‘వాళ్ళ నాన్న గారిలాగే మహేశ్ కూడా హడావిడి, ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా ఉంటాడు. అంత స్టారైనా కొద్దిగా కూడా గర్వం లేదు’’ అని తులసి చెప్పుకొచ్చారు. మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంటే బాగా ఇష్టమంటున్న ఆమె, మహేశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’ (దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల)లో కూడా ఒక ముఖ్యపాత్ర ధరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులు తెరపై చూపే కుటుంబ బంధాలు, గ్రామీణ వాతావరణం బాగుంటాయని ఆమె అన్నారు. ఆ దర్శకులు కూడా తమ స్క్రిప్టుల్లో తులసికి పాత్ర ఉండేలా చూడడం మరో విశేషం. మొత్తానికి, ఈ ‘శంకరాభరణం’ ఫేమ్ అమ్మగా నటించిన ‘జులాయి’, ‘డార్లింగ్’ల లాగే రానున్న ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’కి కూడా సక్సెస్ సెంటిమెంట్ వర్కౌటయ్యేలా ఉంది. -
చెవి చూసిన విశ్వం...
విశ్వనాథ్ గారికి రెండు కళ్లు. దాంట్లో ఒకటి చెవి. మరొకటి మాట. ఆయనకు సంగీతం తెలియదు. ఆయన సంగీతం తెలియనివారు లేరు. ఆయన ఒక్క పుస్తకం కూడా తిరగేయలేదు. తెరపై ఆయన రాసిన కథలను తిరిగి తిరిగి చదవనివారు లేరు. ఆయన చెవి విన్న సంగీతం... గుండె పలికిన మాటలు... మనం ‘చెవి’చూసిన సినిమా... దానికి మీరే సాక్షి. సంగీత సాగరసంగమం ‘శంకరాభరణం’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఆర్ద్రతంటే ఏమిటి’ అని బేబీ తులసి అడుగుతుంది. ‘భాషకందని భావంరా!’ అంటాడు శంకరశాస్త్రి పాత్రధారి జె.వి. సోమయాజులు. సరిగ్గా సంగీతం, సాహిత్యాల అనుభూతి కూడా సరిగ్గా అంతే! దాన్ని మాటల్లో చెప్పలేం.చిన్నప్పటి నుంచి నాకు మంచి సంగీతమన్నా, సాహిత్యమన్నా, నృత్యమన్నా ఇష్టం. నేను సంగీతం నేర్చుకోలేదు. మా సిస్టర్స్ ఇద్దరూ మాత్రం చాలా బాగా పాడతారు. వాళ్ళ గానం ఇంట్లో వింటూ ఉండేవాణ్ణి. అలా బాత్రూమ్ సింగర్నయ్యా. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సంగీతం, పాట అంటూ ఏమీ లేవు కానీ, చెవికి హాయిగా, మెత్తగా ఉండే మంచి సంగీతం ఏదైనా వింటూ ఉంటా. అన్నమయ్య కీర్తన ‘ముద్దుగారే యశోద...’ దగ్గర నుంచి మెహదీ హసన్ గజల్స్ దాకా ఏదైనా వింటా. హిందీ పాటలు కూడా వింటూ ఉంటా. డబ డబ శబ్దాలు, అరుపులు, కూతలుంటే మాత్రం వినలేను. ఇవాళ్టికీ భీమ్సేన్ జోషీ కచ్చేరీ లాంటి మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే... వెళ్ళి వింటా. సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కోక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే - అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందనీ ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు. సినీ రంగంలో నేను అడుగుపెట్టింది మొదట ఆడియోగ్రఫీ విభాగంలో! పాటలు, మాటల శబ్దగ్రహణం చేసేవాణ్ణి. ఆ తరువాత దశలో దర్శకత్వం వైపు వచ్చా. అప్పటి ‘శబ్దగ్రహణ’ పరిజ్ఞానం దర్శకుడినై, పాటలు చేస్తున్నప్పుడు ఉపయోగపడింది. ఆ మాటకొస్తే మామూలు వ్యక్తి చెవులకు కూడా వినడానికి ఏది బాగుందో, లేదో చెప్పే జ్ఞానం ఉంటుంది. పాటల రికార్డింగ్ విషయంలో నేను సినీ రంగానికి వచ్చిన తొలి రోజులకూ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. తొలి రోజుల్లో సినిమా ఆఫీసుల్లోనే సంగీత చర్చలు, రిహార్సల్స్. అంతా సిద్ధం అనుకున్నాక, అప్పుడు థియేటర్‌కు వెళ్ళి, రికార్డింగ్. ఇక, రెండో దశకు వచ్చేసరికి వేదిక మొత్తం రికార్డింగ్ థియేటర్‌కు మారింది. కానీ, మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాట రికార్డింగే అయిపోయేది. ఇప్పటి మూడో దశలో సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, సింగర్‌స దూరంగా ఎక్కడెక్కడో ఉంటూ, పాటలు తయారుచేస్తున్నారు. తేడాలున్నా మిక్సింగ్‌లో మార్చేసుకొనే, వసతులు వచ్చేశాయి. ఇది మూడో దశ. ఇప్పటి విధానంలో కొన్ని సౌకర్యాలున్నా... ఒక పాట మొదటి నుంచి చివరి వరకు ఎలా సాగుతోంది, చివరకు ఏ రూపం తీసుకుంటోందన్నది దర్శకుడు మొదలు సంగీత దర్శకుడి దాకా ఎవరికీ తెలియడం లేదు. ఒక్కమాటలో - అతుకులు, అతుకులుగా, ఒక కొలాజ్ ఆర్ట్ లాగా పాటలు వస్తున్నాయి. అయితే, ఇంత గందరగోళంలోనూ కొన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి.నా సినిమాల్లో నాకు బాగా నచ్చిన పాటలంటే... చెప్పలేను. ప్రతి పాటా నా సమక్షంలో కంపోజ్ అయినదే. రకరకాలు అనుకొని, అనేక వడపోతల తరువాత, బాగుందనుకున్నదే సినిమాలో పెడతాం. కాబట్టి, నచ్చని పాట సినిమాలో ఉండే అవకాశమే లేదు. కాకపోతే, పాట జనం పాడుకోవడానికి బాగుంటుందో, లేదో అని నేను అనుమానపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. ‘సిరిసిరిమువ్వ’లో ‘ఝుమ్మంది నాదం...’ అందుకు ఓ ఉదాహరణ. ఆ స్వరాలు పాడుకోవడానికి అనువుగా ఉంటాయా అని నేను ‘మామ’ కె.వి. మహదేవన్‌తో సందేహం వ్యక్తం చేశా. ఆయన మాత్రం ‘ఇదు నల్లా ఇరుక్కుమ్’ (ఇది బాగుంటుంది) అన్నారు. అరుదైన రేవతి రాగంలో ఆ పాట చేశారట. మామ మాటకి తలొగ్గా. అది పెద్ద హిట్. ఒక్కమాటలో... సంగీత దర్శకులందరూ నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. మా బంధం తాతా మనుమళ్ళ లాంటిది. మనుమడిగా నేను మారాం చేసినా తాత బుజ్జగిస్తూ, ప్రేమిస్తాడే తప్ప, కోపగించడు. ఇదీ అంతే! పాట ఫలానాలా ఉండాలని చెప్పలేం కానీ, ఏదోలా ఉందని చెప్పగలం. మనసులో భావం చూచాయగా చెప్పగానే రాజేశ్వరరావు, మహదేవన్, రమేశ్‌నాయుడు, ఇళయరాజా నన్ను మన్నించి, కొత్త బాణీ ఇచ్చేవారు. ఎంతో విద్వత్తున్న సంగీత దర్శకుల వద్దకు వెళ్ళి, భిక్ష వేయించుకున్నా. ఇవాళ్టికీ మా పాటలు ఆపాత మధురాలుగా ఉండడానికి కారణం అదే! నా సినిమాలు, సంగీతభరితమైన నా పాటలు చూసి, నాకెంతో సంగీత జ్ఞానం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ, రాగాల విషయంలో నేను సున్నా. రాగాలు, వాటి స్వరాల లాంటివేమీ తెలియకపోయినా, మంచి సంగీతం వింటే గుర్తించి, ఆనందించే మనసు నాకు దేవుడిచ్చాడు. చిన్నప్పటి నుంచి ఉన్న సంగీత పరిచయం వల్ల కంపోజింగ్ జరుగుతున్నప్పుడు బాణీ ఇంత చల్లగా ఉండాలనీ, పాట ఈ వాటేజ్‌లో ఉండాలనీ గ్రహిస్తూ ఉంటాను. నేనూ కూడా ఆ సమయంలో ఏదో ఒకటి కూనిరాగం తీస్తూనే ఉంటా. నా మాటలు, కూనిరాగాలు రచయితలకూ, సంగీత దర్శకులకూ ఏదో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలని చేస్తుంటా. సాహితీ స్వర్ణకమలం నా సినిమాలు, పాటలు చూసి నేనేదో పురాణాలు, శాస్త్రాలు ఆపోశన పట్టేశాననుకుంటారు. కానీ, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ - ఏదైనా సరే పుస్తకాలు చదవడం నాకెప్పుడూ అలవాటు లేదు. పుస్తకం పట్టుకున్నా రెండు పేజీలు తిరగేసేసరికి, నిద్రలోకి జారుకుంటా. పురాణాలు, శాస్త్రాలు కూడా చదివినవాణ్ణి కాదు. అందుకే, పౌరాణిక చిత్రాల జోలికి పోలేదు. అన్నీ సాంఘికాలే తీశా. సాంఘికమైతే మనం రాసుకొనే కల్పిత కథ కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు. మా సినిమాల్లోని పాటలకు రచయిత, సంగీత దర్శకుడు ఎవరైనప్పటికీ, వాటి టెక్స్చర్, మరోమాటలో చెప్పాలంటే వాటన్నిటి నేత ఒకేలా ఉంటుంది. సాఫీగా సాగిపోతుంటాయి. అందుకే, పాట వినగానే, అది ‘కె. విశ్వనాథ్ సినిమాలోని పాట’ అని తెలుస్తుంది కానీ, ఎవరు రాశారో, ఎవరు మ్యూజిక్ చేశారో చెప్పలేరు. కష్టం! ఒక సంఘటన చెబుతా. జైలర్‌గా శోభన్‌బాబు నటించిన ‘ప్రేమబంధం’ సినిమాలో ఒక పాట ఉంటుంది. భార్యను అరెస్ట్ చేసి జైలర్ భర్త తీసుకువెళుతున్న ఒక చిత్రమైన సన్నివేశం అది. ఆ సందర్భంలో పాట పెట్టాలనుకున్నా. ‘చేరేదెటకో తెలిసీ... చేరువ కాలేమని తెలిసీ... చెరి సగమైనామెందుకో... తెలిసీ... తెలిసీ...’ అని ఆ పాట నడుస్తుంది. ఆ రచన చేసింది సి. నారాయణరెడ్డి అనీ, వేటూరి అనీ అప్పట్లో కొంతమంది మధ్య చర్చ జరిగింది. నిజానికి, ఆ సందర్భానికి తగ్గట్లు పాట కోసం ఆ మాటలు నేను అల్లినవి. చిన్నప్పుడు నా మనసుకు తట్టిన భావాలను కవితల రూపంలో రాసేవాణ్ణి. అయితే, అవన్నీ అసంపూర్తిగా, అచ్చు కాకుండా అలా ఉండిపోయాయి. అంతరాంతరాళాల్లోని ఈ ప్రభావం వల్లనో ఏమో కానీ, సినిమా కథలో ఒక సీన్ రాసేటప్పుడే ఒక పల్లవి లాగా నా మనసుకు ఏదో తడుతుంది. పాత్రల తాలూకు స్వభావాల సంఘర్షణ నుంచి వచ్చిన ‘అబద్ధపు సాహిత్యాన్ని’ రాసుకొని, ఒక ఆప్షన్‌గా పెడతాను. ఆ ‘అబద్ధపు సాహిత్య’మే పల్లవులుగా స్థిరపడి, పాటలుగా వచ్చినవి చాలా ఉన్నాయి. పాట రాసే ముందే - కృష్ణశాస్త్రి గారైతే ‘నువ్వేం రాశావు?’ అని నన్ను అడిగేవారు. సినారె గారు ‘మీరేదో అనుకోని ఉంటారే! చెప్పండి!’ అనేవారు. ‘జీవనజ్యోతి’లోని ‘ముద్దులమ్మా బాబు నిద్దరోతున్నాడు...’, ‘స్వాతిముత్యం’లోని ‘వటపత్రసాయికి...’ లాంటి పల్లవులలా రాసినవే. అయితే వాటికి కర్త నేనని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పుకోవాలనీ అనుకోలేదు. స్క్రిప్ట్‌లో నేను రాసినది చెప్పాక - నేను, ఆ గీత రచయిత - ఒక లైన్ నేను, ఒక లైన్ ఆయన అనుకుంటూ పోతుంటాం. ఆ క్రమంలో పాట వచ్చేస్తుంది. సందర్భోచితంగా ఉంటుంది. అదీ నా సినీగీతాల ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం. నేను పనిచేసిన సంగీత దర్శకులు, రచయితలందరూ నాకు సన్నిహితులే. కాకపోతే, చాలాకాలం పనిచేయడం వల్ల మహదేవన్‌తో నా ప్రస్థానం ఎక్కువ కాలం జరిగింది. దాంతో, ఆయనతో ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తుంది. అలాగే, గీత రచయిత వేటూరితో కూడా! వేటూరికి కూడా మేమంటే అపారమైన అభిమానం. నేను ఊళ్ళో లేకపోతే, ఇంట్లోవాళ్ళకు తోడుగా వేటూరి మా ఇంటికి వచ్చి, మడత మంచం వేసుకొని పడుకొనేవారు. అలాగే, సీతారామశాస్త్రి కావచ్చు, ఇతరులు కావచ్చు. అందరూ సన్నిహితులే. ప్రతిభ ఉంటే ప్రోత్సహించేవాళ్ళం. అయితే, మా సినిమాల్లోనే వాళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు ప్రకాశించడానికి కారణం లేకపోలేదు. వాళ్ళకు ఎలాంటి నిర్బంధాలూ పెట్టేవాళ్ళం కాదు. ‘ఈ సన్నివేశానికీ, సందర్భానికీ తగ్గట్లు విజృంభించి రాయండి. మీ కవిత్వానికి ఎలాంటి అడ్డుగోడలూ లేవు’ అని ప్రోత్సహించేవాళ్ళం. దాంతో, వారి కవితాశక్తి ప్రవాహంలా బయటకు వచ్చేది. సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’లో పాటలో ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన...’ అని రాశారు. మామూలుగా అయితే సినిమా పాటల్లో ఎవరు అలా రాయిస్తారు? ఏ నిర్మాత ఒప్పుకుంటాడు? కానీ, డెరైక్టర్‌గా నేను ఏం చేసినా తమ మంచి కోసమే చేస్తారని నిర్మాతలకు తెలుసు. అందుకే, వాళ్ళెప్పుడూ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. అలా ప్రతిభావంతులైన కవులందరికీ నా సినిమాల ద్వారా మంచి వేదిక దొరికింది. ఫలితంగా, మా నుంచి అంత మంచి సాహిత్యం, పాటలు వచ్చాయి. - రెంటాల జయదేవ సందర్భానికీ, బాణీకి తగ్గట్లు రచయిత కన్నా ముందే నేను రాసిపెట్టుకొనే పల్లవులను ముద్దుగా ‘అబద్ధపు సాహిత్యం’ అంటూ ఉంటా. దీనికి మూలాలు చిన్నతనంలోనే పడ్డాయి. చిన్నప్పుడు నేను పద్యాలు రాయాలని ప్రయత్నించా. మా కజిన్ ఒకతను ‘యమత రాజ భానస లగం’ అని తెలుగు ఛందస్సు గుర్తుపెట్టుకోవాలంటూ చెప్పేవాడు. కానీ, నాకు అది ఒంటబట్టలేదు. కానీ, ఇంట్లో ఆడవాళ్ళు పాడే వ్రతం పాటలు, రేడియోలో వచ్చే తత్త్వాలు - ఇలా అనేకం చెవినపడుతుండేవి. మా నాన్న గారి ‘వాహినీ పిక్చర్స్’ సినిమాల పాటలూ వినపడేవి. అప్పట్లో అవన్నీ నాకు పాటల రచన మీద, వాటిలోని భావసంపద మీద దృష్టి పెట్టేలా చేశాయి. -
ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’
ఏ తరానికైనా నచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. అలాంటి క్లాసిక్ పేరుతో ఇప్పుడు ఓ సినిమా మొదలైంది. ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎం.వి.వి. సినిమా పతాకంపై రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ తాజా ‘శంకరాభరణం’ని నిర్మిస్తున్నారు. నిఖిల్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనమ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఉగాదినాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘నాటి ‘శంకరాభరణం’కీ, ఈ ‘శంకరాభరణం’కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్. -
తమిళంలో శంకరాభరణం
తమిళసినిమా: భారతీయ అద్భుత సినీ కళా ఖండాల్లో శంకరాభరణం ఒకటని ఘంటాపథంగా చెప్పేయవచ్చు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక్ సంగీతాన్ని అతి సామాన్యుడి వద్దకు చేసిన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే చిత్రం ఇది. అలాంటి అద్భుత దృశ్య కావ్యానికి దర్శకుడు కె.విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ సృష్టికర్తలు. సంగీతంతో సామాజిక అంశాలను ముడిపెట్టి ఆచారాలన్నవి ఆచరణలో పెడితే చాలు మనుష్యులందరూ ఒక్కటే అంటూ జాతి, మతం లాంటి అంటరానితనానికి పాతరేసిన గొప్ప సందేశాత్మక సంగీత భరిత చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంతోనే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంలో ఉన్న నిజమైన గాయకుడు లోకానికి పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. 1980లో తెరపైకి వచ్చి చరిత్ర సృష్టించిన శంకరాభరణం దివంగత నటుడు సోమయాజులకు నటి మంజుభార్గవి, రాజాలక్ష్మికి ఇంటి పేరుగా మారిందంటే ఈ చిత్ర చరిత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రమోహన్, అల్లురామలింగయ్య లాంటి ప్రతిభావంతుల నటన శంకరాభరణంకు అదనపు అలంకారం. అప్పట్లో జాతీయ రాష్ట్ర నంది అవార్డులతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విశేష కీర్తిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు చిత్రం తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోను విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే శంకరాభరణం 35 ఏళ్ల తరువాత తమిళ మాటలతో మరోసారి తమిళనాట శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం, తెలుగులో పాడిన పాటల్ని తమిళంలోనూ ఆలపించడం విశేషం. ఈ తరం కూడా చూడాల్సిన గొప్ప చిత్రం శంకరాభరణం. -
శంకరాభరణంతోనే నాకు జీవితం
శంకరాభరణం చిత్రమే తనకు జీవితాన్ని ప్రసాదించిందంటున్నారు తులసి. శంకరాభరణం ఎందరో కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. వారిలో నాటి బాలతార, ఒకనాటి కథానాయిక, నేటి సీనియర్ నటి తులసి ఒకరు. బాలతార అంటే మూడుమాసాల వయసులోనే నటించి ఆ తరువాత హీరోయిన్ అయిన ఏకైక నటి బహుశ తులసినే కావచ్చు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం హిందీ భాషల్లో నటించి అలరించిన అతి కొద్దిమంది తారల్లో ఒకరుగా పేరు గాంచిన తులసి, సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తెరపై ప్రత్యక్షయిన ఈ బహుభాషా నటితో మినీ ఇంటర్వ్యూ. సినీ రంగ ప్రవేశం గురించి క్లుప్తంగా? పుట్టిన మూడు నెలలకే సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. భార్య అనే చిత్రంలో ఒక పాటలో నటించేశాను. అందుకు కారణం మహానటి సావిత్రినే. ఆమె నాన్నకు మంచి స్నేహితురాలు. భార్య చిత్రంలో పసి బిడ్డ అవసరం ఏర్పడడంతో నాన్నను ఒప్పించి నన్ను చిత్రరంగానికి పునాది వేశారు. ఆ తరువాత ఏడాదిన్నర వయసులో జీవన తరంగాలు చిత్రంలో నటించాను. అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి చిత్రంలో రెండు పాటల్లో నటించాను. అయితే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన చిత్రం శంకరాభరణం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఆ చిత్రంలో శంకరం పాత్ర నన్ను ప్రపంచానికే పరిచయం చేసిందని చెప్పాలి. ఆ తరువాత చెల్లెలిగా కథానాయికగా పలు భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించాను. ఒక్క తెలుగులోనే 76 చిత్రాలకు పైగా చేశాను. చాలా అవార్డులు వరించాయి. ఉన్నత స్థాయిలోనే నటనకు గుడ్‌బై చెప్పారు? కారణం? జవాబు: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో పలు రకాల పాత్రలు చేశానన్న సంతృప్తి పొందడంతో నటనకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాను. దాంపత్యజీవనం గురించి? జవాబు: సుమారు 20 ఏళ్ల క్రితం ప్రముఖ కన్నడ దర్శక, నిర్మాత శివమణిని పెళ్లి చేసుకున్నాను. మాకొక బాబు. పేరు సాయితరుణ్. ప్రస్తుతం ప్లస్-2 చదువుతున్నాడు. చదువులో ఫస్ట్. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అప్పుడే లఘు చిత్రాలకు రూపకల్పన చేస్తున్నాడు. భవిష్యత్తులో మీ అబ్బాయిని హీరో చేస్తారా? నా కైతే హీరోను చేయాలని ఉంది. అయితే తనకు దర్శకత్వంపై ఆసక్తి. తుది నిర్ణయం తనదే. అయితే ఇప్పటికే హీరోగా పరిచయం చేస్తామంటూ చాలామంది అడుగుతున్నారు. సరే మీరు మళ్లీ నటించడానికి సిద్ధం అవడానికి కారణం? భర్త ఆలనా పాలనా, కొడుకు సంరక్షణ బాధ్యతలతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న నన్ను తమిళ నటుడు మురళి తండ్రి ప్రోత్సాహంతో కన్నడంలో రీ ఎంట్రీ అయ్యాను. ఎక్స్‌క్యూజ్‌మి చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను. తెలుగులో ఈవీవీ సత్యనారాయణ మాట కాదనలేక నువ్వంటే నా కిష్టం చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను. మీరు మళ్లీ నటిస్తానంటే మీ భర్త అంగీకరించారా? అయ్యో! అసలు ఆయన ప్రోత్సాహమే ఎక్కువ. అంత మంచి మనిషాయన. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? తెలుగులో మహేష్‌బాబు హీరోగా నటించనున్న చిత్రంలో హీరోయిన్ శ్రుతిహాసన్‌కు తల్లిగా నటించనున్నాను. తమిళంలో విశాల్ హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా సాహసం చిత్రంలోను నటిస్తున్నాను. ఇప్పటికీ ఫలాన పాత్రలో నటించాలనే కోరిక ఏమైనా ఉందా? చాలా చిత్రాల్లో చాలా రకాల పాత్రలు చేశాను. ప్రస్తుతం చేస్తున్నవి కూడా అమ్మ పాత్రలే. అయినా మంచి అమ్మగా స్టైలిష్ పాత్రను చేయాలనుంది. అన్ని చిత్రాల్లోనూ అమ్మగానే నటిస్తున్నారు. అత్తగా పెత్తనం చేసే పాత్రలు చేయరా? పాత్ర బాగుంటే అలాంటివి కూడా చేయడానికి వెనుకాడను. -
శంకరాభరణం టైటిల్‌తో...
‘శంకరాభరణం’... తెలుగు తెరపై ఓ క్లాసిక్.జేవీ సోమయాజులు, మంజు భార్గవి, బేబీ తులసి ముఖ్యతారలుగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయినా ప్రేక్షకుల మనోఫలకాలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే... ‘శంకరాభరణం’ టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రూపొందనుంది. రచయిత కోన వెంకట్ ఈ టైటిల్‌తో స్క్రిప్టు సిద్ధం చేశారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇటీవలే అంజలి కథానాయికగా ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి. -
శంకరాభరణంలో పాడనన్నాను
సినిమా అనే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం ఎంత ఖ్యాతి పొందిందో అంత ప్రాచుర్యం ఆ చిత్రానికి పని చేసిన వారికి లభించింది. ఈ చిత్రంలోని పాటలు ఎవర్గ్రీన్. అలాంటి పాటల్ని పాడనన్నారట గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అలాంటిది 35 ఏళ్ల తరువాత తమిళ భాషలోకి అనువాదమైన శంకరాభరణం చిత్రానికి ఆయనే పాడటం విశేషం. ఈ అనుభవం గురించి బాలు ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. శంకరాభరణం తెరపైకి వచ్చి 35 ఏళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి ఎన్నిసార్లో, ఎన్ని ప్రాంతాల్లో వ్యాఖ్యానించానో, ఎన్నిసార్లు ఎన్ని కచేరీల్లో ఆ చిత్ర పాటలు ఆలపించానో చెప్పలేను. నా సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక గొప్ప అధ్యాయం. ఆ చిత్రం ప్రారంభ సమయంలో నేను రోజుకు నాలుగైదు పాటల రికార్డింగ్ అంటూ బిజీగా ఉన్నాను. అలాంటి సమయంలో కేవీ మహదేవన్ మా ఇంటికొచ్చి నాన్నకు శంకరాభరణం కథ వినిపించారు. అప్పుడు నాన్న ఈ చిత్రంలో పాటలు పాడిన తరువాతే ఇతర చిత్రాల పాటలు పాడమని చెప్పారు. అంతే కాదు శంకరాభరణం చిత్రానికి సరిగా పాడకపోతే చెంప పగలగొట్టి పాడించండి. ఇలాంటి మంచి అవకాశం తనకు మళ్లీ వస్తుందా? అంటూ కే.వీ. మహదేవన్‌తో అన్నారు. ఆ తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ మరోసారి కథ గురించి వివరించారు. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. అలాంటి చిత్రానికి నేను పాడగలనా అని. అందుకు కారణం నాకు సంప్రదాయ సంగీతం తెలియకపోవడమే. నేనా సంగీతాన్ని నేర్చుకోలేదు. అందుకే శంకరాభరణం చిత్రానికి నేను పాడలేనన్నాను. అయినా సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ వదలలేదు. ఆయన కంటే కూడా ఆయన శిష్యుడు పుగళేంది మీరే పాడాలంటూ ఒత్తిడి చేశారు. అవసరం అయితే నేర్పించి అయినా పాడిస్తానంటూ ప్రోత్సహించారాయన. పుగళేందినే ట్రాక్ పాడి ఆ క్యాసెట్ నాకిచ్చారు. దాన్ని సమయం దొరికినప్పుడల్లా వింటూ కంఠస్థంగా వచ్చిన తరువాతనే రికార్డింగ్‌కు సిద్ధం అయ్యాను. పాట రికార్డింగ్ సమయంలో ఎస్.జానకి, వాణీజయరాం ఇచ్చిన ప్రోత్సాహం మరవలేను. చిన్నాకుట్టి మృదంగం, రాఘవన్ వీణ, సుదర్శన్ ఫ్లూట్ వాయించారు. తమిళ అనువాదం అవసరమా? అలాంటి చిత్రానికి ఇన్నేళ్ల తరువాత అనువాదం అవసరమా అనే ప్రశ్న రావచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, మరింత మెరుగులు దిద్దుకుని మళీ వస్తున్న శంకరాభరణం చిత్రానికి తప్పకుండా ఆదరణ లభిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలున్నాయి. చిత్రంలో శంకర శాస్త్రిగా నటించిన జె.వి.సోమయాజుల్ని దర్శకుడు కె.విశ్వనాథ్‌కు పరిచయం చేసింది నేనే. శంకరాభరణం చిత్రాన్ని ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, శివజీగణేశన్తో కలిసి చూడటం మరపురాని అనుభవం. నాకు తొలి సారిగా 1990లో జాతీయ అవార్డును అందించిన చిత్రం శంకరాభరణం. నాకే కాదు, గాయని వాణీజయరాం, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిందీ చిత్రం. బాలు మహేంద్ర చాయాగ్రహణం కూడా ప్రశంసలందుకుంది. సినిమా ప్రేక్షకుల్ని, సాధారణ ప్రజల్ని సులభంగా పాడుకునేలా చేసిన ఘనత కె.వి.మహాదేవన్దే. అలాంటి శంకరాభరణం పాటల్ని నేటికీ ఏ కచ్చేరిలోనయినా పాడకుండా ఉండలేను. ఆ పాటల్ని ఇప్పుడు తమిళంలో పాడే అవకాశం నాకిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. శంకరాభరణం తమిళంలోను విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని బాలు అన్నారు. ఈ చిత్రం తమిళంలో అక్టోబర్ రెండో తేదీన విడుదలకానుంది. -
సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం
తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ సినిమా 35 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదలవుతోంది. డిజిటలైజ్ చేసి మళ్లీ ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు. కలర్ కరెక్షన్ చేసి సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో నాలుగు జాతీయ అవార్డులు గెల్చుకుంది. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు. -
నా నలభై ఏడో ఏటచెంప ఛెళ్లుమనిపించారు!
అల్లు రామలింగయ్య... ఆ పేరు తలచుకోగానే... ఎన్నో పాత్రలు... మరెన్నో సినిమాలు కళ్ళ ముందు గిర్రున రీళ్ళు తిరుగుతాయి. ఆ నాటి ‘మాయాబజార్’ నుంచి ఆ మధ్య వచ్చిన ‘జై’ దాకా... అల్లు... తెలుగుతెరపై నవ్వుల విరిజల్లు. ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’... ఇలా ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఓ కొలికిపూస. మరి, నిజజీవితంలో ఆయన ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా మెలిగేవారు? వారికి ఆయన నేర్పిన పాఠాలేమిటి? నటుడిగా ఆయన ఫిలాసఫీ ఏమిటి? ఇవాళ అల్లు రామలింగయ్య పదో వర్ధంతి సందర్భంగా... తండ్రిగా, నటుడిగా, హోమియో డాక్టర్‌గా... అంతకుమించి మంచి మనిషిగా అల్లులోని అనేక కోణాలపై ఆయన కుమారుడు, ప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్ ఫోకస్ లైట్... మా నాన్న అల్లు రామలింగయ్య గారు మన కళ్ళెదుట భౌతికంగా లేరన్న మాటే కానీ, ఇవాళ్టికీ కనీసం అయిదారు సార్లయినా తలుచుకోనిదే, ఏదో ఒక సందర్భంలో ఆయనను గుర్తు తెచ్చుకోనిదే నాకు రోజు గడవదు. నిజానికి ఆయన భౌతికంగా లేని ఈ పదేళ్ళలో నేను ఆయనను మిస్ అయిన క్షణం లేదు. ప్రతి విషయంలో ఆయన నా వెంటే ఉన్నారని నా భావన. అందుకే, ‘గీతా ఆర్ట్స్’ పతాకంపై మేము నిర్మిస్తున్న సినిమాలన్నిటికీ ఇప్పటికీ ‘అల్లు రామలింగయ్య సమర్పించు’ అని టైటిల్స్‌లో వేస్తుంటా. జీవించడం నేర్పిన గురువు నాకు వ్యక్తిగతంగా ఎవరూ గురువులు లేరు. కానీ, గురుపూర్ణిమ వచ్చిందంటే నేను ఇద్దరినే తలుచుకుంటూ ఉంటా. ఆ ఇద్దరూ ఎవరంటే - ఒకరు మా నాన్న గారు. రెండో వ్యక్తి - మా కుటుంబానికి సన్నిహితులు, సలహాదారైన నిర్మాత డి.వి.ఎస్. రాజు గారు. నా వ్యక్తిగత, సినిమా జీవితం మీద నాన్న గారు వేసిన ప్రభావం అంతటిది. నా దస్తూరీ ఇవాళ్టికీ చాలా బాగుంటుంది. దానికి కారణం మా నాన్న గారే! నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలని తెలుగు, ఇంగ్లీషు కాపీ రైటింగ్ పుస్తకాలు తెచ్చి రోజూ నాలుగేసి పేజీల చొప్పున రాసి, చూపించమనేవారు. ఇలా ప్రతి చిన్న విషయంలో ఆయన గెడైన్‌స, ఇచ్చిన శిక్షణ నన్నివాళ ఇలా తీర్చిదిద్దాయి. తండ్రిగా ఆయనది ఓ ప్రత్యేక పద్ధతి. ఆడపిల్లల పెంపకంలో సగటు మధ్యతరగతివాడిగా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అదే సమయంలో పిల్లలకు జీవితం నేర్పాలనే ఉద్దేశంతో పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి నన్ను ఓ కొడుకులా కాకుండా, స్నేహితుడిలా చూశారు. పదహారేళ్ళ వయసు నుంచే నన్ను చివరకు ఆడిటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్ళేవారు. అలాగే, కుటుంబ రాబడి, ఖర్చు, ఆదా, ఎక్కడ ఎలా మదుపు చేయాలనే విషయాల్లోనూ నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. అప్పట్లో ‘అవేవీ తెలియక, ఇదేమిట్రా బాబూ.. మనకెందుకీ గొడవ’ అనుకొనేవాణ్ణి. కానీ, ఇవాళ మా కుటుంబంలో కానీ, చిరంజీవి గారి కుటుంబంలో కానీ ఎవరికీ పన్ను బకాయిలు, ట్యాక్స్ సమస్యలు ఏమీ లేకుండా ఉన్నాయంటే, ఆర్థిక అంశాలన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోగలుగుతున్నానంటే దానికి కారణం ఆ ట్రైనింగే! అలాగే, మా చెల్లెళ్ళ పెళ్ళి సంబంధాల దగ్గర నుంచి అన్ని విషయాలూ చిన్నవాడినైన నాతో ఆయన చర్చించేవారు. (నవ్వుతూ...) అలా చిన్నప్పుడే నాకు పెద్దరికం వచ్చేలా చేశారు. అందుకే, ఇవాళ్టికీ మా సిస్టర్స్‌కు నేను అన్నలా కాక, నాన్న గారి తరువాత నాన్న గారిలా కనబడుతుంటాను. చిన్నప్పటి నుంచి ఆయన నన్ను కూర్చోబెట్టి ఎన్నో చెప్పేవారు. వస్తుతః లోలోపల నేను కొంత దూకుడు! అలాంటి నేనివాళ ఎప్పుడూ తొందరపడి మాట్లాడను. ఎవరి మీదా నోరు పారేసుకోను. అది కూడా నాన్న గారి చలవే. ‘పెదవి దాటిన మాట - తనకు రాజు. కానీ, పెదవి దాటని మాటకు తానే రాజు’ అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నాన్న గారు చెప్పిన సామెత నా మీద ముద్ర వేసింది. అరుదైన హస్తవాసి మా నాన్నగారు వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు. వాళ్ళలో మూడో ఆయన మా నాన్న గారు. సినిమాల్లో వేషాల కోసం పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చినప్పుడు ఆయన కష్టాలు పడిన తొలి రోజులు నాకు గుర్తే. సంపాదన లేక, సరిపోక ఊళ్ళోని మా పెదనాన్న గారి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని, ఇల్లు గడిపిన సంగతులు నాకు తెలుసు. నటుడిగా పేరు, డబ్బు సంపాదించినా ఆ రోజుల్ని ఆయన మర్చిపోలేదు. కమ్యూనిస్టు భావాలున్న ఆయనలో మానవత్వం ఎక్కువ. సినిమాల్లోకి రాక ముందు హోమియోపతి వైద్యం ఆయన వృత్తి. ఆయన హస్తవాసి మంచిదని ఎంతోమందికి నమ్మకం. సినిమాల్లో స్థిరపడ్డాక అందరికీ ఉచితంగా మందులిస్తూ, హాబీగా కొనసాగించారు. ఎన్టీఆర్‌కి ఫ్రాక్చరైతే, ఏయన్నార్ గారి కాలులో చిన్న ఇబ్బంది వస్తే నాన్న గారు హోమియో వైద్యం చేశారు. ఎన్టీయార్ గారి భార్య బసవ తారకం గారికి నాన్న గారు నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్. (నవ్వుతూ...) నన్ను కూడా హోమియోపతి నేర్చుకోమనేవారు. కానీ, అది నాకు ఎక్కలేదు. ఆయన సేకరించి, చదువుకొన్న ఎన్నో హోమియోపతి పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. ఆయన గుర్తుగా వాటిని భద్రంగా దాచాం. ఆయన కోరిక తీరింది... మా ఇంట్లో మేము అయిదుగురం. మా అక్క నవభారతి. నేను, మా చెల్లెళ్ళు వసంతలక్ష్మి (డాక్టర్ వెంకటేశ్వరరావు గారి భార్య), సురేఖ (చిరంజీవి గారి భార్య), చనిపోయిన మా తమ్ముడు వెంకటేశ్. మా తమ్ముడిలో మంచి ఫీచర్లున్నాయని, వాణ్ణి సినీ నటుణ్ణి చేయాలని నాన్న గారికి ఉండేది. కానీ, అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో వాడు చనిపోయాడు. మా అబ్బాయి బన్నీ (అల్లు అర్జున్) స్టారవడంతో మా తమ్ముడు వెంకటేశ్‌కు రావాల్సినదంతా బన్నీకొచ్చిందనీ, నటుడిగా తన వారసత్వం కొనసాగాలన్న కోరిక తీరిందనీ సంతోషించారు. వృత్తికి అడ్డు కాని వ్యక్తిగత విషాదం మా తమ్ముడు చనిపోయినప్పుడు నాన్న గారు ఎంతో బాధపడ్డప్పటికీ, తన పర్సనల్ ఫిలాసఫీ ద్వారా దృఢంగా నిలబడ్డారు. వాడు చనిపోయిన నాలుగో రోజునో, అయిదో రోజునో ఆయనకు షూటింగ్ ఉంది. అది బాపు గారి సినిమా అనుకుంటా. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని వాళ్ళు అడిగారు. కానీ, అదేమీ వద్దని, మనసును రాయి చేసుకొని షూటింగ్‌కు వెళ్ళిపోయారు నాన్న గారు. అక్కడ సన్నివేశం కూడా విషాద సన్నివేశం. గ్లిజరిన్ ఇస్తామన్నారట. కానీ, నాన్న గారు అక్కర్లేదని, గ్లిజరిన్ లేకుండానే ఆ సన్నివేశంలో కన్నీళ్ళు పెట్టుకొని, ఆ సన్నివేశం పండించారు. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి, వృత్తి పట్ల నిబద్ధత చూపే ఆయన ‘దృఢ వ్యక్తిత్వాని’కి ఇదో ఉదాహరణ. తీపి జ్ఞాపకం... తరగని ఆస్తి... వ్యక్తిగా ఆయనలో నచ్చే అతి గొప్ప విషయం ఏమిటంటే, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉండడం, అందరికీ స్వేచ్ఛనివ్వడం. అయితే, పట్టరాని కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక తండ్రిగా నన్ను తిట్టేవారు, కొట్టేవారు కూడా! ఆయనతో నాకు ఓ చిత్రమైన తీపి జ్ఞాపకం ఉంది. ఆయన నన్ను ఆఖరు సారిగా కొట్టింది ఎప్పుడో తెలుసా? నా 47వ ఏట! ఒకరోజు నేను కారు నడుపుతుంటే, ఆయన పక్కన కూర్చొని ఉన్నారు. ఇంటి లోపలకు కారుతో అడుగు పెడుతున్నప్పుడు నేను అనుకోకుండా సడెన్ బ్రేక్ వేశాను. సీట్ బెల్టులు లేని ఆ రోజుల్లో ఆయన తల వెళ్ళి, ముందుకు కొట్టుకుంది. అంతే... ఒక్కసారిగా కోపం వచ్చి, ‘ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది’ అంటూ చెంప ఛెళ్ళుమనిపించారు. కొంపతీసి ఇది మా ఆవిడ కానీ చూసిందేమో అని టెన్షన్ పడ్డా. బాల్కనీ వైపు చూస్తే మా ఆవిడ కనపడలేదు. హమ్మయ్య చూడలేదనుకున్నా. తీరా, ఇంట్లోకి వెళ్ళాక ఎందుకు కొట్టారంటూ అడిగేసరికి గతుక్కుమన్నా. (నవ్వులు...) ఆ క్షణం కొద్దిగా ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు తలుచుకుంటే అది మా నాన్న గారు నాకిచ్చిన అత్యంత తీపి జ్ఞాపకం అనిపిస్తుంటుంది. నాకు ఎంత వయసు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నన్ను ఓ చిన్న పిల్లాడిగా, తండ్రి మీద గౌరవమున్న కొడుకుగానే చూసిన ఓ తండ్రి తాలూకు ప్రేమ, క్రమశిక్షణ అది. నటుడిగా నాన్న గారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. నాన్న గారికి ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు నేను ‘ప్రతిబంధ్’ షూటింగ్లో హైదరాబాద్‌లో ఉన్నా. విషయం తెలిసి, మద్రాసులో ఇంటికి ఫోన్ చేశా. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, ‘నాన్న గారూ! ఇన్నాళ్ళూ మీరు మాకిచ్చిన ఆస్తులైన ఇళ్ళు, పొలాలు, డబ్బు అమ్ముకోవచ్చు. కానీ, ఎప్పటికీ అమ్మలేని ఆస్తిగా ‘పద్మశ్రీ’ గౌరవాన్ని మాకు ఇచ్చారు’ అన్నాను. ఆ మాటకు ఆయన ఎంత ఆనందించారో! చెరిగిపోని నవ్వు... చెదిరిపోని నువ్వు... అప్పటికప్పుడు అక్కడికక్కడ ఛలోక్తులు విసరడం ఆయనకు అలవాటు. ఒకసారి ఆయన కాలికి చిన్న దెబ్బ తగిలి, బెణికింది. దానికి చిన్న బ్యాండేజ్ కట్టారు. ఆ రోజున నాతో పాటు మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ శ్రీనివాసరావు అది చూస్తూనే, ‘ఏమిటి సార్... ఆ కట్టు...’ అంటూ గావుకేక పెట్టాడు. అంతే. ‘ఏనుగు తొక్కిందిలే’ అన్నారు నాన్న గారు. (నవ్వులు) అదేమిటంటూ విస్తుపోవడం మా ఫ్రెండ్ వంతు అయింది. అప్పుడు మా నాన్న గారు, ‘నువ్వు అంతగా రియాక్ట్ అయినప్పుడు, ‘ఏదో కాలు కొద్దిగా బెణికిందిలే’ అని చెబితే డిజప్పాయింట్ అవుతావు. అందుకని, ఏనుగు తొక్కిందని చెప్పా’ అని నవ్వించారు. అలాగే, చనిపోవడానికి ఆరు నెలల ముందు హైదరాబాద్ కె.బి.ఆర్. పార్క్‌కు వెళ్ళారాయన. అక్కడ ఆయన కూర్చొని ఉంటే, తెలిసినవాళ్ళు ఎదురై పలకరించి, ‘వాకింగ్‌కు వచ్చారా’ అని అడిగారు. దానికి నాన్న గారు ‘అవునండీ! కానీ, నేను పెద్దోణ్ణి. నడవలేను కదా! అందుకే, కుర్రాణ్ణి పెట్టా. వాడు నడుస్తున్నాడు’ అని చటుక్కున బదులిచ్చారు (నవ్వులు...) సినిమాలు, నటన, ఇలాంటి ఛలోక్తులు చూసి చాలామంది ఆయన వట్టి హాస్యజీవి అనుకుంటారు. కానీ, జీవితంలో ఆయన చాలా సీరియస్ మనిషి. ఫిలసాఫికల్ థింకర్. ఆయనకు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస అంటే మహా ఇష్టం. వాళ్ళ పుస్తకాలెన్నో ఆయన చదివేవారు. అలాగే, వేస్తున్న వేషం తనకు లొంగే వరకు నటుడిగా ఆయన తృప్తిపడేవారు కాదు. వేస్తున్నది కమెడియన్ పాత్ర అయినా సరే, పూర్తి కథ, సన్నివేశం పూర్వాపరాలు తెలుసుకొని, పాత్రను అవగాహన చేసుకొనేవారు. అలా పాత్రను మనసుకు ఎక్కించుకొనేవరకు దర్శకులనూ, కో-డెరైక్టర్‌నీ వివరాలు అడుగుతూనే ఉండేవారు. ఒక్కసారి ఆ పాత్రను లొంగదీసుకున్న తరువాత అద్భుతంగా నటించేవారు. అందుకే, ఆయన నటన అంత సహజంగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ - ఇలా ఏ భాషలో చూసినా హాస్యం పండించగలిగినవారే పెద్ద హీరోలయ్యారు. ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందుకే, నా దృష్టిలో హీరోయిజమ్ అంటే హాస్యమే. అలాంటి హాస్యాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించి, తెరపై నవ్వులు విరబూయించిన నాన్న గారి లాంటి వారందరూ నా దృష్టిలో చిరకాలం గుర్తుండే హీరోలు. సంభాషణ: రెంటాల జయదేవ దర్శకులు కె.విశ్వనాథ్, బాపు అంటే నాన్న గారికి ఎంతో గౌరవం. దాసరి, రాఘవేంద్రరావులంటే మహా ఇష్టం. అలాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆయన తపించేవారు. ముఖ్యంగా, విశ్వనాథ్, బాపుల చిత్రాల్లో తాను తప్పకుండా ఉండాలనుకొనేవారు. తనకు పాత్ర ఉండదేమోనని తెగ బెంగపడేవారు. వాళ్ళ సినిమాలంటే, ఇక పారితోషికం, ఇతర విషయాలేవీ పట్టించుకొనేవారు కూడా కాదు. చివరి దాకా అదే పాటించారు. అలాంటి పాత్రలెన్నో పోషించబట్టే, కన్నుమూసి ఇప్పటికి పదేళ్ళయినా ఆయన చిరంజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో మిగిలారు. -
చివరి చూపులకు నోచుకోలేకపోయా!
ప్రముఖ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్వామినాథన్ మరణవార్త తెలిసి క్రుంగిపోయానని, విదేశాల్లో ఉండటంవల్ల చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానని ఎస్పీబీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘‘చెన్నయ్‌లోని వాహినీ స్టూడియోస్‌లో కృష్ణయ్యర్, కోటేశ్వర్రావుల దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ఆరంభించారు స్వామినాథన్. ఆ తర్వాత చీఫ్ రికార్డిస్ట్ అయ్యారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ కోసం తొలిసారి నేను పాడినప్పుడు రికార్డ్ చేసింది ఆయనే. 1966 డిసెంబర్ 15న ఈ రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత నేను పాడిన ఎన్నో పాటలు రికార్డ్ చేశారు. ‘శంకరాభరణం’ చిత్రానికైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేశారు. 1986లో నా విన్నపం మేరకు కోదండపాణి ఆడియో ల్యాబ్‌కు చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో రిటైర్ అయ్యేంత వరకు ఆ బాధ్యత నిర్వర్తించారు. నాకు తెలిసి, ఏ రికార్డిస్ట్ కూడా ఆయన చేసినన్ని సినిమాలకు పని చేసి ఉండరు. ఆ రికార్డ్ స్వామినాథన్‌కే సొంతం అవుతుంది. ఆయన కన్నుమూసిన సమయంలో నేను ఇండియాలో లేకపోవడం నాకు శాపంలా భావిస్తున్నా. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా సార్. మీరు రిటైరైనప్పుడే సంగీతం మిమ్మల్ని మిస్సయ్యింది’’ అంటూ బాలు తన మనసులోని మాటలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.