శంకరాభరణంలో పాడనన్నాను
సినిమా అనే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం ఎంత ఖ్యాతి పొందిందో అంత ప్రాచుర్యం ఆ చిత్రానికి పని చేసిన వారికి లభించింది. ఈ చిత్రంలోని పాటలు ఎవర్‌గ్రీన్. అలాంటి పాటల్ని పాడనన్నారట గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అలాంటిది 35 ఏళ్ల తరువాత తమిళ భాషలోకి అనువాదమైన శంకరాభరణం చిత్రానికి ఆయనే పాడటం విశేషం. ఈ అనుభవం గురించి బాలు ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. శంకరాభరణం తెరపైకి వచ్చి 35 ఏళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి ఎన్నిసార్లో, ఎన్ని ప్రాంతాల్లో వ్యాఖ్యానించానో, ఎన్నిసార్లు ఎన్ని కచేరీల్లో ఆ చిత్ర పాటలు ఆలపించానో చెప్పలేను.
నా సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక గొప్ప అధ్యాయం. ఆ చిత్రం ప్రారంభ సమయంలో నేను రోజుకు నాలుగైదు పాటల రికార్డింగ్ అంటూ బిజీగా ఉన్నాను. అలాంటి సమయంలో కేవీ మహదేవన్ మా ఇంటికొచ్చి నాన్నకు శంకరాభరణం కథ వినిపించారు. అప్పుడు నాన్న ఈ చిత్రంలో పాటలు పాడిన తరువాతే ఇతర చిత్రాల పాటలు పాడమని చెప్పారు. అంతే కాదు శంకరాభరణం చిత్రానికి సరిగా పాడకపోతే చెంప పగలగొట్టి పాడించండి. ఇలాంటి మంచి అవకాశం తనకు మళ్లీ వస్తుందా? అంటూ కే.వీ. మహదేవన్‌తో అన్నారు. ఆ తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ మరోసారి కథ గురించి వివరించారు. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. అలాంటి చిత్రానికి నేను పాడగలనా అని.
అందుకు కారణం నాకు సంప్రదాయ సంగీతం తెలియకపోవడమే. నేనా సంగీతాన్ని నేర్చుకోలేదు. అందుకే శంకరాభరణం చిత్రానికి నేను పాడలేనన్నాను. అయినా సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ వదలలేదు. ఆయన కంటే కూడా ఆయన శిష్యుడు పుగళేంది మీరే పాడాలంటూ ఒత్తిడి చేశారు. అవసరం అయితే నేర్పించి అయినా పాడిస్తానంటూ ప్రోత్సహించారాయన. పుగళేందినే ట్రాక్ పాడి ఆ క్యాసెట్ నాకిచ్చారు. దాన్ని సమయం దొరికినప్పుడల్లా వింటూ కంఠస్థంగా వచ్చిన తరువాతనే రికార్డింగ్‌కు సిద్ధం అయ్యాను. పాట రికార్డింగ్ సమయంలో ఎస్.జానకి, వాణీజయరాం ఇచ్చిన ప్రోత్సాహం మరవలేను. చిన్నాకుట్టి మృదంగం, రాఘవన్ వీణ, సుదర్శన్ ఫ్లూట్ వాయించారు.
తమిళ అనువాదం అవసరమా?
అలాంటి చిత్రానికి ఇన్నేళ్ల తరువాత అనువాదం అవసరమా అనే ప్రశ్న రావచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, మరింత మెరుగులు దిద్దుకుని మళీ వస్తున్న శంకరాభరణం చిత్రానికి తప్పకుండా ఆదరణ లభిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలున్నాయి. చిత్రంలో శంకర శాస్త్రిగా నటించిన జె.వి.సోమయాజుల్ని దర్శకుడు కె.విశ్వనాథ్‌కు పరిచయం చేసింది నేనే. శంకరాభరణం చిత్రాన్ని ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, శివజీగణేశన్‌తో కలిసి చూడటం మరపురాని అనుభవం. నాకు తొలి సారిగా 1990లో జాతీయ అవార్డును అందించిన చిత్రం శంకరాభరణం.
నాకే కాదు, గాయని వాణీజయరాం, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిందీ చిత్రం. బాలు మహేంద్ర చాయాగ్రహణం కూడా ప్రశంసలందుకుంది. సినిమా ప్రేక్షకుల్ని, సాధారణ ప్రజల్ని సులభంగా పాడుకునేలా చేసిన ఘనత కె.వి.మహాదేవన్‌దే. అలాంటి శంకరాభరణం పాటల్ని నేటికీ ఏ కచ్చేరిలోనయినా పాడకుండా ఉండలేను. ఆ పాటల్ని ఇప్పుడు తమిళంలో పాడే అవకాశం నాకిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. శంకరాభరణం తమిళంలోను విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని బాలు అన్నారు. ఈ చిత్రం తమిళంలో అక్టోబర్ రెండో తేదీన విడుదలకానుంది.