చివరి చూపులకు నోచుకోలేకపోయా!
ప్రముఖ సౌండ్ ఇంజినీర్ స్వామినాథన్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్వామినాథన్ మరణవార్త తెలిసి క్రుంగిపోయానని, విదేశాల్లో ఉండటంవల్ల చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానని ఎస్పీబీ ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామినాథన్ గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘‘చెన్నయ్‌లోని వాహినీ స్టూడియోస్‌లో కృష్ణయ్యర్, కోటేశ్వర్రావుల దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ఆరంభించారు స్వామినాథన్. ఆ తర్వాత చీఫ్ రికార్డిస్ట్ అయ్యారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ కోసం తొలిసారి నేను పాడినప్పుడు రికార్డ్ చేసింది ఆయనే. 1966 డిసెంబర్ 15న ఈ రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత నేను పాడిన ఎన్నో పాటలు రికార్డ్ చేశారు. ‘శంకరాభరణం’ చిత్రానికైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేశారు.
1986లో నా విన్నపం మేరకు కోదండపాణి ఆడియో ల్యాబ్‌కు చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో రిటైర్ అయ్యేంత వరకు ఆ బాధ్యత నిర్వర్తించారు. నాకు తెలిసి, ఏ రికార్డిస్ట్ కూడా ఆయన చేసినన్ని సినిమాలకు పని చేసి ఉండరు. ఆ రికార్డ్ స్వామినాథన్‌కే సొంతం అవుతుంది. ఆయన కన్నుమూసిన సమయంలో నేను ఇండియాలో లేకపోవడం నాకు శాపంలా భావిస్తున్నా. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా సార్. మీరు రిటైరైనప్పుడే సంగీతం మిమ్మల్ని మిస్సయ్యింది’’ అంటూ బాలు తన మనసులోని మాటలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.