సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ! | Success sentiment My Mother says Actress Tulasi | Sakshi
Sakshi News home page

సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ!

Published Wed, Jul 8 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ!

సక్సెస్ సెంటిమెంట్... ఈ అమ్మ!

 నటి తులసి గుర్తున్నారా? ‘శంకరాభరణం’ నాటి బేబీ తులసి ఆ తరువాత కథానాయికగా కూడా కొంతకాలం ఆకట్టుకున్నారు. కొంతకాలం గ్యాప్ తరువాత ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో నటిస్తున్నారు. ‘‘చాలా రోజుల తరువాత సినిమాకు కీలకమైన ఒక ముఖ్య పాత్ర ధరిస్తున్నా’’ అని తులసి చెప్పారు. ఈ తరం యువ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నందుకు సహజంగానే ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే, సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో చిరకాల అనుబంధమున్న తులసికి ఆ సంగతులు కూడా గుర్తే.

 మహేశ్‌బాబు చిన్నప్పుడు అతని పుట్టినరోజు వేడుకలకు హాజరైన సంగతులు ఇప్పుడు స్టార్ హీరో అయిన ఆయనకు ‘శ్రీమంతుడు’ సెట్స్‌లో జ్ఞాపకం చేశారట! ఆ సంగతులు చెప్పగానే మహేశ్ హాయిగా నవ్వేశారట! ‘‘వాళ్ళ నాన్న గారిలాగే మహేశ్ కూడా హడావిడి, ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా ఉంటాడు. అంత స్టారైనా కొద్దిగా కూడా గర్వం లేదు’’ అని తులసి చెప్పుకొచ్చారు. మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంటే బాగా ఇష్టమంటున్న ఆమె, మహేశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’ (దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల)లో కూడా ఒక ముఖ్యపాత్ర ధరిస్తున్నారు.

 త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులు తెరపై చూపే కుటుంబ బంధాలు, గ్రామీణ వాతావరణం బాగుంటాయని ఆమె అన్నారు. ఆ దర్శకులు కూడా తమ స్క్రిప్టుల్లో తులసికి పాత్ర ఉండేలా చూడడం మరో విశేషం. మొత్తానికి, ఈ ‘శంకరాభరణం’ ఫేమ్ అమ్మగా నటించిన ‘జులాయి’, ‘డార్లింగ్’ల లాగే రానున్న ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’కి కూడా సక్సెస్ సెంటిమెంట్ వర్కౌటయ్యేలా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement