స్పెల్ బౌండ్ అయ్యా!
- నిఖిల్
‘‘నా కెరీర్‌లో ‘ఢీ’ చిత్రం ఒక మైల్ స్టోన్. ఆ సినిమా విడుదలై పదేళ్లయ్యింది. ఆ చిత్రం తర్వాత ‘శంకరాభరణం’ మరో కొత్త అధ్యాయానికి తెర తీసే చిత్రం అవుతుంది. హిందీ చిత్రాల స్థాయిలో తెలుగు చిత్రాలు ఉంటాయా? అనేవారికి ‘శంకరాభరణం’ మంచి సమాధానం అవుతుంది’’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ఈ చిత్రానికి కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు.
డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ - ‘‘హిందీ చిత్రం ‘ఫస్ గయా రే ఒబామా’ చూసి, ఒక ఐడియా తీసుకుని దాని చుట్టూ కథ అల్లాను. ఈ చిత్రనేపథ్యం, స్క్రీన్‌ప్లే, టోటల్‌గా స్క్రిప్టే ఓ సవాల్ . గౌతమ్ పాత్రను నిఖిల్ అద్భుతంగా చేశాడు’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వె ర్సస్ సూర్య’ తర్వాత నేనో డిఫరెంట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్న టైంలో కోన వెంకట్‌గారి నుంచి ఫోన్ వచ్చింది.
బాలకృష్ణగారు, రామ్‌చరణ్ లాంటి పెద్ద హీరోలతో వర్క్ చేసే స్థాయి ఆయనది. ఆయన ‘శంకరాభరణం’ కథ చెప్పినప్పుడు స్పెల్ బౌండ్ అయ్యా’’ అని చెప్పారు. ‘‘పాటలకు మంచి స్పందన లభించింది. ఆదివారం వైజాగ్‌లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరపనున్నాం’’ అని చిత్ర సంగీతదర్శకుడు ప్రవీణ్ లక్కరాజు అన్నారు. ఉదయ్ నందనవనమ్, నందిత, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.