శంకరాభరణంతోనే నాకు జీవితం
శంకరాభరణం చిత్రమే తనకు జీవితాన్ని ప్రసాదించిందంటున్నారు తులసి. శంకరాభరణం ఎందరో కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. వారిలో నాటి బాలతార, ఒకనాటి కథానాయిక, నేటి సీనియర్ నటి తులసి ఒకరు. బాలతార అంటే మూడుమాసాల వయసులోనే నటించి ఆ తరువాత హీరోయిన్ అయిన ఏకైక నటి బహుశ తులసినే కావచ్చు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం హిందీ భాషల్లో నటించి అలరించిన అతి కొద్దిమంది తారల్లో ఒకరుగా పేరు గాంచిన తులసి, సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తెరపై ప్రత్యక్షయిన ఈ బహుభాషా నటితో మినీ ఇంటర్వ్యూ.
సినీ రంగ ప్రవేశం గురించి క్లుప్తంగా?
పుట్టిన మూడు నెలలకే సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. భార్య అనే చిత్రంలో ఒక పాటలో నటించేశాను. అందుకు కారణం మహానటి సావిత్రినే. ఆమె నాన్నకు మంచి స్నేహితురాలు. భార్య చిత్రంలో పసి బిడ్డ అవసరం ఏర్పడడంతో నాన్నను ఒప్పించి నన్ను చిత్రరంగానికి పునాది వేశారు. ఆ తరువాత ఏడాదిన్నర వయసులో జీవన తరంగాలు చిత్రంలో నటించాను. అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి చిత్రంలో రెండు పాటల్లో నటించాను. అయితే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన చిత్రం శంకరాభరణం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఆ చిత్రంలో శంకరం పాత్ర నన్ను ప్రపంచానికే పరిచయం చేసిందని చెప్పాలి. ఆ తరువాత చెల్లెలిగా కథానాయికగా పలు భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించాను. ఒక్క తెలుగులోనే 76 చిత్రాలకు పైగా చేశాను. చాలా అవార్డులు వరించాయి.
ఉన్నత స్థాయిలోనే నటనకు గుడ్‌బై చెప్పారు? కారణం?
జవాబు: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో పలు రకాల పాత్రలు చేశానన్న సంతృప్తి పొందడంతో నటనకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాను.
దాంపత్యజీవనం గురించి?
జవాబు: సుమారు 20 ఏళ్ల క్రితం ప్రముఖ కన్నడ దర్శక, నిర్మాత శివమణిని పెళ్లి చేసుకున్నాను. మాకొక బాబు. పేరు సాయితరుణ్. ప్రస్తుతం ప్లస్-2 చదువుతున్నాడు. చదువులో ఫస్ట్. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అప్పుడే లఘు చిత్రాలకు రూపకల్పన చేస్తున్నాడు.
భవిష్యత్తులో మీ అబ్బాయిని హీరో చేస్తారా?
నా కైతే హీరోను చేయాలని ఉంది. అయితే తనకు దర్శకత్వంపై ఆసక్తి. తుది నిర్ణయం తనదే. అయితే ఇప్పటికే హీరోగా పరిచయం చేస్తామంటూ చాలామంది అడుగుతున్నారు.
సరే మీరు మళ్లీ నటించడానికి సిద్ధం అవడానికి కారణం?
భర్త ఆలనా పాలనా, కొడుకు సంరక్షణ బాధ్యతలతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న నన్ను తమిళ నటుడు మురళి తండ్రి ప్రోత్సాహంతో కన్నడంలో రీ ఎంట్రీ అయ్యాను. ఎక్స్‌క్యూజ్‌మి చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను. తెలుగులో ఈవీవీ సత్యనారాయణ మాట కాదనలేక నువ్వంటే నా కిష్టం చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను.
మీరు మళ్లీ నటిస్తానంటే మీ భర్త అంగీకరించారా?
అయ్యో! అసలు ఆయన ప్రోత్సాహమే ఎక్కువ. అంత మంచి మనిషాయన.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
తెలుగులో మహేష్‌బాబు హీరోగా నటించనున్న చిత్రంలో హీరోయిన్ శ్రుతిహాసన్‌కు తల్లిగా నటించనున్నాను. తమిళంలో విశాల్ హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా సాహసం చిత్రంలోను నటిస్తున్నాను.
ఇప్పటికీ ఫలాన పాత్రలో నటించాలనే కోరిక ఏమైనా ఉందా?
చాలా చిత్రాల్లో చాలా రకాల పాత్రలు చేశాను. ప్రస్తుతం చేస్తున్నవి కూడా అమ్మ పాత్రలే. అయినా మంచి అమ్మగా స్టైలిష్ పాత్రను చేయాలనుంది.
అన్ని చిత్రాల్లోనూ అమ్మగానే నటిస్తున్నారు. అత్తగా పెత్తనం చేసే పాత్రలు చేయరా?
పాత్ర బాగుంటే అలాంటివి కూడా చేయడానికి వెనుకాడను.