చెవి చూసిన విశ్వం... | special story on viswanath | Sakshi
Sakshi News home page

చెవి చూసిన విశ్వం...

Published Thu, Jul 2 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

చెవి చూసిన  విశ్వం...

చెవి చూసిన విశ్వం...

విశ్వనాథ్ గారికి రెండు కళ్లు.
దాంట్లో ఒకటి చెవి.
మరొకటి మాట.
ఆయనకు సంగీతం తెలియదు.
ఆయన సంగీతం తెలియనివారు లేరు.
ఆయన ఒక్క పుస్తకం కూడా తిరగేయలేదు.
తెరపై ఆయన రాసిన కథలను తిరిగి తిరిగి చదవనివారు లేరు.
ఆయన చెవి విన్న సంగీతం... గుండె పలికిన మాటలు...
మనం ‘చెవి’చూసిన సినిమా... దానికి మీరే సాక్షి.

 
 సంగీత సాగరసంగమం
 ‘శంకరాభరణం’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఆర్ద్రతంటే ఏమిటి’ అని బేబీ తులసి అడుగుతుంది. ‘భాషకందని భావంరా!’ అంటాడు శంకరశాస్త్రి పాత్రధారి జె.వి. సోమయాజులు. సరిగ్గా సంగీతం, సాహిత్యాల అనుభూతి కూడా సరిగ్గా అంతే! దాన్ని మాటల్లో చెప్పలేం.చిన్నప్పటి నుంచి నాకు మంచి సంగీతమన్నా, సాహిత్యమన్నా, నృత్యమన్నా ఇష్టం. నేను సంగీతం నేర్చుకోలేదు. మా సిస్టర్స్ ఇద్దరూ మాత్రం చాలా బాగా పాడతారు. వాళ్ళ గానం ఇంట్లో వింటూ ఉండేవాణ్ణి. అలా బాత్‌రూమ్ సింగర్‌నయ్యా.

వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సంగీతం, పాట అంటూ ఏమీ లేవు కానీ, చెవికి హాయిగా, మెత్తగా ఉండే మంచి సంగీతం ఏదైనా వింటూ ఉంటా. అన్నమయ్య కీర్తన ‘ముద్దుగారే యశోద...’ దగ్గర నుంచి మెహదీ హసన్ గజల్స్ దాకా ఏదైనా వింటా. హిందీ పాటలు కూడా వింటూ ఉంటా. డబ డబ శబ్దాలు, అరుపులు, కూతలుంటే మాత్రం వినలేను. ఇవాళ్టికీ భీమ్‌సేన్ జోషీ కచ్చేరీ లాంటి మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే... వెళ్ళి వింటా.

సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కోక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే - అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందనీ ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు. సినీ రంగంలో నేను అడుగుపెట్టింది మొదట ఆడియోగ్రఫీ విభాగంలో! పాటలు, మాటల శబ్దగ్రహణం చేసేవాణ్ణి. ఆ తరువాత దశలో దర్శకత్వం వైపు వచ్చా. అప్పటి ‘శబ్దగ్రహణ’ పరిజ్ఞానం దర్శకుడినై, పాటలు చేస్తున్నప్పుడు ఉపయోగపడింది. ఆ మాటకొస్తే మామూలు వ్యక్తి చెవులకు కూడా వినడానికి ఏది బాగుందో, లేదో చెప్పే జ్ఞానం ఉంటుంది.

పాటల రికార్డింగ్ విషయంలో నేను సినీ రంగానికి వచ్చిన తొలి రోజులకూ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. తొలి రోజుల్లో సినిమా ఆఫీసుల్లోనే సంగీత చర్చలు, రిహార్సల్స్. అంతా సిద్ధం అనుకున్నాక, అప్పుడు థియేటర్‌కు వెళ్ళి, రికార్డింగ్. ఇక, రెండో దశకు వచ్చేసరికి వేదిక మొత్తం రికార్డింగ్ థియేటర్‌కు మారింది. కానీ, మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పాట రికార్డింగే అయిపోయేది. ఇప్పటి మూడో దశలో సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, సింగర్‌‌స దూరంగా ఎక్కడెక్కడో ఉంటూ, పాటలు తయారుచేస్తున్నారు. తేడాలున్నా మిక్సింగ్‌లో మార్చేసుకొనే, వసతులు వచ్చేశాయి. ఇది మూడో దశ.

ఇప్పటి విధానంలో కొన్ని సౌకర్యాలున్నా... ఒక పాట మొదటి నుంచి చివరి వరకు ఎలా సాగుతోంది, చివరకు ఏ రూపం తీసుకుంటోందన్నది దర్శకుడు మొదలు సంగీత దర్శకుడి దాకా ఎవరికీ తెలియడం లేదు. ఒక్కమాటలో - అతుకులు, అతుకులుగా, ఒక కొలాజ్ ఆర్ట్ లాగా పాటలు వస్తున్నాయి. అయితే, ఇంత గందరగోళంలోనూ కొన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి.నా సినిమాల్లో నాకు బాగా నచ్చిన పాటలంటే... చెప్పలేను. ప్రతి పాటా నా సమక్షంలో కంపోజ్ అయినదే. రకరకాలు అనుకొని, అనేక వడపోతల తరువాత, బాగుందనుకున్నదే సినిమాలో పెడతాం. కాబట్టి, నచ్చని పాట సినిమాలో ఉండే అవకాశమే లేదు. కాకపోతే, పాట జనం పాడుకోవడానికి బాగుంటుందో, లేదో అని నేను అనుమానపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. ‘సిరిసిరిమువ్వ’లో ‘ఝుమ్మంది నాదం...’ అందుకు ఓ ఉదాహరణ. ఆ స్వరాలు పాడుకోవడానికి అనువుగా ఉంటాయా అని నేను ‘మామ’ కె.వి. మహదేవన్‌తో సందేహం వ్యక్తం చేశా. ఆయన మాత్రం ‘ఇదు నల్లా ఇరుక్కుమ్’ (ఇది బాగుంటుంది) అన్నారు. అరుదైన రేవతి రాగంలో ఆ పాట చేశారట. మామ మాటకి తలొగ్గా. అది పెద్ద హిట్.

ఒక్కమాటలో... సంగీత దర్శకులందరూ నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. మా బంధం తాతా మనుమళ్ళ లాంటిది. మనుమడిగా నేను మారాం చేసినా తాత బుజ్జగిస్తూ, ప్రేమిస్తాడే తప్ప, కోపగించడు. ఇదీ అంతే! పాట ఫలానాలా ఉండాలని చెప్పలేం కానీ, ఏదోలా ఉందని చెప్పగలం. మనసులో భావం చూచాయగా చెప్పగానే రాజేశ్వరరావు, మహదేవన్, రమేశ్‌నాయుడు, ఇళయరాజా నన్ను మన్నించి, కొత్త బాణీ ఇచ్చేవారు. ఎంతో విద్వత్తున్న సంగీత దర్శకుల వద్దకు వెళ్ళి, భిక్ష వేయించుకున్నా. ఇవాళ్టికీ మా పాటలు ఆపాత మధురాలుగా ఉండడానికి కారణం అదే!
 
నా సినిమాలు, సంగీతభరితమైన నా పాటలు చూసి, నాకెంతో సంగీత జ్ఞానం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ, రాగాల విషయంలో నేను సున్నా. రాగాలు, వాటి స్వరాల లాంటివేమీ తెలియకపోయినా, మంచి సంగీతం వింటే గుర్తించి, ఆనందించే మనసు నాకు దేవుడిచ్చాడు. చిన్నప్పటి నుంచి ఉన్న సంగీత పరిచయం వల్ల కంపోజింగ్ జరుగుతున్నప్పుడు బాణీ ఇంత చల్లగా ఉండాలనీ, పాట ఈ వాటేజ్‌లో ఉండాలనీ గ్రహిస్తూ ఉంటాను. నేనూ కూడా ఆ సమయంలో ఏదో ఒకటి కూనిరాగం తీస్తూనే ఉంటా. నా మాటలు, కూనిరాగాలు రచయితలకూ, సంగీత దర్శకులకూ ఏదో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండాలని చేస్తుంటా.
 
సాహితీ స్వర్ణకమలం
నా సినిమాలు, పాటలు చూసి నేనేదో పురాణాలు, శాస్త్రాలు ఆపోశన పట్టేశాననుకుంటారు. కానీ, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ - ఏదైనా సరే పుస్తకాలు చదవడం నాకెప్పుడూ అలవాటు లేదు. పుస్తకం పట్టుకున్నా రెండు పేజీలు తిరగేసేసరికి, నిద్రలోకి జారుకుంటా. పురాణాలు, శాస్త్రాలు కూడా చదివినవాణ్ణి కాదు. అందుకే, పౌరాణిక చిత్రాల జోలికి పోలేదు. అన్నీ సాంఘికాలే తీశా. సాంఘికమైతే మనం రాసుకొనే కల్పిత కథ కాబట్టి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు.

  మా సినిమాల్లోని పాటలకు రచయిత, సంగీత దర్శకుడు ఎవరైనప్పటికీ, వాటి టెక్స్‌చర్, మరోమాటలో చెప్పాలంటే వాటన్నిటి నేత ఒకేలా ఉంటుంది. సాఫీగా సాగిపోతుంటాయి. అందుకే, పాట వినగానే, అది ‘కె. విశ్వనాథ్ సినిమాలోని పాట’ అని తెలుస్తుంది కానీ, ఎవరు రాశారో, ఎవరు మ్యూజిక్ చేశారో చెప్పలేరు. కష్టం!

 ఒక సంఘటన చెబుతా. జైలర్‌గా శోభన్‌బాబు నటించిన ‘ప్రేమబంధం’ సినిమాలో ఒక పాట ఉంటుంది. భార్యను అరెస్ట్ చేసి జైలర్ భర్త తీసుకువెళుతున్న ఒక చిత్రమైన సన్నివేశం అది. ఆ సందర్భంలో పాట పెట్టాలనుకున్నా. ‘చేరేదెటకో తెలిసీ... చేరువ కాలేమని తెలిసీ... చెరి సగమైనామెందుకో... తెలిసీ... తెలిసీ...’ అని ఆ పాట నడుస్తుంది. ఆ రచన చేసింది సి. నారాయణరెడ్డి అనీ, వేటూరి అనీ అప్పట్లో కొంతమంది మధ్య చర్చ జరిగింది. నిజానికి, ఆ సందర్భానికి తగ్గట్లు పాట కోసం ఆ మాటలు నేను అల్లినవి.

చిన్నప్పుడు నా మనసుకు తట్టిన భావాలను కవితల రూపంలో రాసేవాణ్ణి. అయితే, అవన్నీ అసంపూర్తిగా, అచ్చు కాకుండా అలా ఉండిపోయాయి. అంతరాంతరాళాల్లోని ఈ ప్రభావం వల్లనో ఏమో కానీ, సినిమా కథలో ఒక సీన్ రాసేటప్పుడే ఒక పల్లవి లాగా నా మనసుకు ఏదో తడుతుంది. పాత్రల తాలూకు స్వభావాల సంఘర్షణ నుంచి వచ్చిన ‘అబద్ధపు సాహిత్యాన్ని’ రాసుకొని, ఒక ఆప్షన్‌గా పెడతాను.

ఆ ‘అబద్ధపు సాహిత్య’మే పల్లవులుగా స్థిరపడి, పాటలుగా వచ్చినవి చాలా ఉన్నాయి. పాట రాసే ముందే - కృష్ణశాస్త్రి గారైతే ‘నువ్వేం రాశావు?’ అని నన్ను అడిగేవారు. సినారె గారు ‘మీరేదో అనుకోని ఉంటారే! చెప్పండి!’ అనేవారు. ‘జీవనజ్యోతి’లోని ‘ముద్దులమ్మా బాబు నిద్దరోతున్నాడు...’, ‘స్వాతిముత్యం’లోని ‘వటపత్రసాయికి...’ లాంటి పల్లవులలా రాసినవే. అయితే వాటికి కర్త నేనని ఎప్పుడూ చెప్పలేదు. చెప్పుకోవాలనీ అనుకోలేదు. స్క్రిప్ట్‌లో నేను రాసినది చెప్పాక - నేను, ఆ గీత రచయిత - ఒక లైన్ నేను, ఒక లైన్ ఆయన అనుకుంటూ పోతుంటాం. ఆ క్రమంలో పాట వచ్చేస్తుంది. సందర్భోచితంగా ఉంటుంది. అదీ నా సినీగీతాల ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం.
  నేను పనిచేసిన సంగీత దర్శకులు, రచయితలందరూ నాకు సన్నిహితులే. కాకపోతే, చాలాకాలం పనిచేయడం వల్ల మహదేవన్‌తో నా ప్రస్థానం ఎక్కువ కాలం జరిగింది. దాంతో, ఆయనతో ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తుంది. అలాగే, గీత రచయిత వేటూరితో కూడా! వేటూరికి కూడా మేమంటే అపారమైన అభిమానం. నేను ఊళ్ళో లేకపోతే, ఇంట్లోవాళ్ళకు తోడుగా వేటూరి మా ఇంటికి వచ్చి, మడత మంచం వేసుకొని పడుకొనేవారు. అలాగే, సీతారామశాస్త్రి కావచ్చు, ఇతరులు కావచ్చు. అందరూ సన్నిహితులే. ప్రతిభ ఉంటే ప్రోత్సహించేవాళ్ళం.

అయితే, మా సినిమాల్లోనే వాళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు ప్రకాశించడానికి కారణం లేకపోలేదు. వాళ్ళకు ఎలాంటి నిర్బంధాలూ పెట్టేవాళ్ళం కాదు. ‘ఈ సన్నివేశానికీ, సందర్భానికీ తగ్గట్లు విజృంభించి రాయండి. మీ కవిత్వానికి ఎలాంటి అడ్డుగోడలూ లేవు’ అని ప్రోత్సహించేవాళ్ళం. దాంతో, వారి కవితాశక్తి ప్రవాహంలా బయటకు వచ్చేది. సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’లో పాటలో ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన...’ అని రాశారు. మామూలుగా అయితే సినిమా పాటల్లో ఎవరు అలా రాయిస్తారు? ఏ నిర్మాత ఒప్పుకుంటాడు? కానీ, డెరైక్టర్‌గా నేను ఏం చేసినా తమ మంచి కోసమే చేస్తారని నిర్మాతలకు తెలుసు. అందుకే, వాళ్ళెప్పుడూ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. అలా ప్రతిభావంతులైన కవులందరికీ నా సినిమాల ద్వారా మంచి వేదిక దొరికింది. ఫలితంగా, మా నుంచి అంత మంచి సాహిత్యం, పాటలు వచ్చాయి.    - రెంటాల జయదేవ
 
సందర్భానికీ, బాణీకి తగ్గట్లు రచయిత కన్నా ముందే నేను రాసిపెట్టుకొనే పల్లవులను ముద్దుగా ‘అబద్ధపు సాహిత్యం’ అంటూ ఉంటా. దీనికి మూలాలు చిన్నతనంలోనే పడ్డాయి. చిన్నప్పుడు నేను పద్యాలు రాయాలని ప్రయత్నించా. మా కజిన్ ఒకతను ‘యమత రాజ భానస లగం’ అని తెలుగు ఛందస్సు గుర్తుపెట్టుకోవాలంటూ చెప్పేవాడు. కానీ, నాకు అది ఒంటబట్టలేదు. కానీ, ఇంట్లో ఆడవాళ్ళు పాడే వ్రతం పాటలు, రేడియోలో వచ్చే తత్త్వాలు - ఇలా అనేకం చెవినపడుతుండేవి. మా నాన్న గారి ‘వాహినీ పిక్చర్స్’ సినిమాల పాటలూ వినపడేవి. అప్పట్లో అవన్నీ నాకు పాటల రచన మీద, వాటిలోని భావసంపద మీద దృష్టి పెట్టేలా చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement