డీటీహెచ్‌లో శంకరాభరణం డబ్బింగ్
చెన్నై : సంగీత, సాహిత్య కథా చిత్రాల్లో మణిపూస శంకరాభరణం. పండితుల నుంచి పామరుల వరకు ఆ బాల గోపాలా న్ని అలరించి ఆ పాత మధురం ఈ చిత్రం. తెలుగు జాతి గర్వించదగ్గ దర్శక దిగ్గజం, కళాతపస్వి కె.విశ్వనాథ్ అద్భుత సృష్టి శంకరాభరణం. 35 ఏళ్ల క్రితం తెర పై కొచ్చిన ఈ అద్భుత సంగీ త భరిత తెలుగు చిత్రం భారతదేశం అంతటా విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి ప్రపంచఖ్యాతి సాధిం చిన శంకరాభరణం తొలిసారిగా ఇన్నేళ్ల తరువాత తమిళంలోకి అనువాదం కావడంతో పాటు సినిమా స్కోప్, డీటీహెచ్, డిజిటల్ వంటి ఆధునిక హంగులతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఆధ్యాత్మిక సంగీత, సాహిత్యపు విలువలతో కూడిన శంకరాభరణం చిత్రంలో దివంగత ప్రఖ్యాత సంగీత దర్శకులు కేవీ మహదేవన్ సంగీత బాణీలు కట్టిన ప్రతి పాటా ఆణిముత్యమే, సజీవమే. జేవీ సోమయాజులు, చంద్రమోహన్, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, తులసి, అల్లురామలింగయ్య తదితరులు ముఖ్య ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ శబరిగిరివాసన్ మూవీస్ అధినేత పీఎస్ హరిహరన్ తమిళంలోకి అనువదిస్తున్నారు. తమిళ సంభాషణలను ఆర్ ఎస్ రామకృష్ణన్ అందించిన ఈ చిత్రానికి తమిళ ముదన్ తాయన్‌లుగా సాహిత్యాన్ని అందించారు. భారతీయ సినిమా శతాబ్ద వేడకులను జరుపుకున్న సందర్భంగా శంకరాభరణం వంటి గొప్ప కళాఖండం మళ్లీ సరికొత్త హంగులతో త్వరలో తెరపైకి రానుండడం ఆహ్వానించదగ్గ విషయం.