
కె. విశ్వనాథ్ పేరుతో అవార్డులు
కళా తపస్వి కె. విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’లో చిన్న పిల్లాడి పాత్రలో నటించారు బాల నటి తులసి. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లోనూ, ఆ తర్వాత కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారామె. శంకరం పాత్రతో తనను తెరకు పరిచయం చేసిన గురువు విశ్వనాథ్ పట్ల ఆమెకు అపారమైన గౌరవాభిమానాలున్నాయి.
అందుకే విశ్వనాథ్ పేరుతో ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. తులసి మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏటా గురువు విశ్వనాథ్‌గారి పేరిట ‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు ఇవ్వనున్నా. ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, దక్షిణ, ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు.