ఇకపై ఏటా... సినిమా డే, అవార్డులు | Film Chamber takes key decisions on Telugu Cinema birthday | Sakshi
Sakshi News home page

ఇకపై ఏటా... సినిమా డే, అవార్డులు

Published Fri, Feb 7 2025 3:13 AM | Last Updated on Fri, Feb 7 2025 3:13 AM

Film Chamber takes key decisions on Telugu Cinema birthday

అనుపమ్‌ రెడ్డి, వీర శంకర్, రామసత్యనారాయణ, భరత్‌ భూషణ్, దామోదర ప్రసాద్, రెంటాల జయదేవ, మురళీమోహన్, బాపిరాజు, పరుచూరి గోపాలకృష్ణ, మాదాల రవి

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌

పది రీళ్ళ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6న ఇకపై ప్రతి ఏడాది ‘తెలుగు సినిమా దినోత్సవం’ జరపాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌(Telugu Film Chamber) ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) నిర్ణయించింది. ‘భక్త ప్రహ్లాద’ రిలీజై 93 వసంతాలు నిండిన వేళ హైదరాబాద్‌లోని ఛాంబర్‌ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ‘తెలుగు సినిమా డే’ నిర్వహించింది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఫిల్మ్‌ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో సహా పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌ల ముఖ్యులూపాల్గొన్నారు. తెలుగు ప్రభుత్వాలు ఇచ్చే సినీ అవార్డులతోపాటు ఇకపై ఏటా ‘టీఎఫ్‌సీసీ’ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

జాతీయ అవార్డులందుకున్న వారినీ, ఇండియన్‌ పనోరమాకు ఎంపికైన చిత్రాల వారినీ ‘సినిమా డే’ నాడు సత్కరించాలని నిర్ణయించింది. అలాగే, ఏటా ఫిబ్రవరి 6నే అన్ని శాఖల సంఘాలూ తెలుగు సినిమా జెండా ఎరేయాలని పిలుపునిచ్చింది. జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరికి అప్పగించింది. అలాగే ఎంతో పరిశోధన చేసి, ‘భక్త ప్రహ్లాద’ అసలు రిలీజ్‌ తేదీ ఫిబ్రవరి 6 అని నిరూపించిన సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత రెంటాల జయదేవను సినీ పరిశ్రమ పక్షాన అభినందించి, సన్మానించారు. 

సౌతిండియన్‌ సినిమా చరిత్రపై ఆయన పరిశోధనా గ్రంథం ‘మన సినిమా... ఫస్ట్‌ రీల్‌’ను పరిశ్రమ పక్షాన ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్‌ అందుకున్నారు. పరుచూరి మాట్లాడుతూ–‘‘1931 అక్టోబర్‌ 31న ‘కాళిదాస్‌’ రిలీజైంది. 3 లఘు చిత్రాలను కలిపి, ఒకే ప్రదర్శనగా వేసిన ఆ సినిమాను తమిళులు తమ సినిమాగా చెప్పుకుంటున్నా, అందులోని 4 రీళ్ళ ‘కాళిదాస్‌’ పూర్తి తెలుగు డైలాగ్స్‌ చిత్రమని జయదేవ తన పరిశోధనలో అన్ని సాక్ష్యాలతో నిరూపించారు. పుస్తకంలో ప్రచురించారు. అందుకని ఫిబ్రవరి 6తోపాటు అక్టోబర్‌ 31న కూడా మర్చిపోకుండా పెద్దల్ని స్మరించుకొని, వేడుక చేసుకోవాలి’’ అన్నారు. 

సన్మాన గ్రహీత రెంటాల జయదేవ మాట్లాడుతూ–‘‘1932 ఫిబ్రవరి 6న ‘భక్త ప్రహ్లాద’ విడుదలైందని 2011లోనే సాక్ష్యాధారాలు సేకరించి, అసలు చరిత్రను బయటపెట్టాను. అప్పట్లో దానికి ప్రభుత్వ నంది అవార్డు దక్కినా, ఇవాళ పరిశ్రమ నన్ను సత్కరించడం మర్చిపోలేను. దీంతోపాటు తెలుగు త్యాగరాయ కీర్తనలతో ‘కాళిదాస్‌’ తెలుగు సినిమా అని మనం హక్కుల కోసం క్లెయిమ్‌ చేసుకోవాలి. ఇలా మరుగునపడిన ఎన్నో అంశాల్ని వెలికి తీసి, మన సినిమా చరిత్రను నిక్షిప్తం చేసి, భావితరాలకు అందించేందుకు ఛాంబర్‌ ఒక ట్రస్టు కింద నిధిని ఏర్పాటు చేయాలి’’ అన్నారు.

ఈ వేడుకల్లో ఛాంబర్‌ కార్యదర్శి – నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్‌. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నటుడు మురళీ మోహన్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి, నిర్మాతలు ఆచంట గోపీనాథ్, టి. రామ సత్యనారాయణ, నటుడు మాదాల రవి తదితరులుపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement