కులాంతర వివాహం వైపు నడిచిన సప్తపది
నాటి సినిమా
బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, వక్షం నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారని వర్ణ వ్యవస్థ చెబుతుంది. ఎవరు ఎక్కడి నుంచి జన్మించినా వీరందరికీ హృదయం ఒక్కచోటనే ఉంటుంది. గుండెలకు సమీపంగానే ఉంటుంది. దాని స్పందనలకు కులం లేదు. దాని సంవేదనలకు వర్ణం లేదు. స్త్రీ... పురుషుడు... ఉన్నవి ఈ రెండే వర్ణాలు. వీటి మధ్య ఆకర్షణే ప్రకృతి. దీనిని ఎదిరించడం వికృతి. కులాలు, వర్ణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడితే మంచిదే. తిరోగమనానికి హేతువుగా మారితే మాత్రం మనం మారాల్సి ఉంది... మార్చాల్సింది చాలా ఉంది. ఆ మాటను చెప్పడానికి దాదాపు 36 ఏళ్ల క్రితం కె.విశ్వనాథ్ తీసిన సినిమాయే ‘సప్తపది’.
కృష్ణానది ఒడ్డున అందమైన ఊరు. ఆ ఊరి నడిబొడ్డున అమ్మవారి ఆలయం. దాని ప్రధాన అర్చకుడు యాజులు (సోమయాజులు). అతడి కొడుకు అవధాని (జె.వి.రమణమూర్తి). తోడుగా మనవడు (రవికాంత్). యాజులు కుమార్తె ఒక నాట్యకారుణ్ణి ప్రేమించి వివాహం చేసుకున్నది కనుక ఆమెను మానసికంగా బహిష్కరించి ఉంటాడు యాజులు. కాని ఆమెకు జన్మించిన హేమ (సబిత) పెరిగి పెద్దదై నృత్యకారిణిగా మారి ఊరికి వస్తే ఆమెను మనవరాలిగా స్వీకరిస్తాడు. అంతే కాదు, తన మనవడికి ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయిస్తాడు. ఇది హేమ మనసుకు విఘాతంగా మారుతుంది.
ఎందుకంటే అప్పటికే ఆమె మనసు హరిబాబు (గిరిష్) వశమై ఉంటుంది. అతడు ఆమెనూ ఆమె నాట్యాన్నీ ఆరాధించిన భావుకుడు. వేణువుతో ఆమె నాట్యానికి బాసటగా నిలువగల కళాకారుడు. కాని ఈ అలంకారాలన్నీ అతడితో వివాహానికి ఏమాత్రం పనికి రావు. ఎందుకంటే అతడు దళితుడు. ఒక బ్రాహ్మణుల అమ్మాయి హరిజనుడితో వివాహం చేసుకోవడం అసంభవం. వర్ణవ్యవస్థకు విరుద్ధం. ఈ సంగతి తెలుసు కనుకనే హరిబాబు ఆమెను మనసులోనే వేలుపు చేసుకుని దూరంగా ఉండిపోతాడు. ఆమె పెళ్లి బావతో జరిగిపోతుంది.
మనసు చెక్కలయినా మాంగల్యానికి విలువ ఇచ్చి భర్తను స్వీకరించి వచ్చిన హేమ ఆ భర్తకు శోభనం గదిలో అమ్మవారిలా కనిపిస్తుంది. అతడు హతాశుడై ఆమెకు పూజాదికాలు నిర్వహించి వెనుదిరుగుతాడు. ఎప్పుడు అతడు గదిలోకి వచ్చినా భార్య అతనికి అమ్మవారి రూపులోనే కనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు? అటు ప్రియునికి దూరమై ఇటు భర్తకు చేరువ కాలేక హేమ నలిగిపోతుంది. భర్త ఆ పరిస్థితి గమనించి కారణం తెలుసుకుంటాడు. ఆమె మనసులో మరొకరు ఉండటం వల్లే ఆమె తనకు అమ్మవారిలా ఉందని గ్రహించి ఎవరిౖ¯ð తే ఆమె కోరుకుంటున్నదో అతడికే అప్పజెప్పడానికి నిశ్చయించుకుంటాడు.
అతడి నిర్ణయానికి ఇంటి పెద్ద అయిన యాజులు అంగీకారం కావాల్సి ఉంటుంది. సమాజం ఏమనుకుంటుందోనని ముందు ఆందోళన చెందినా కులం, వర్ణం అనేవి ఒక మనిషి సంస్కారాన్ని బట్టి ఏర్పడేవే తప్ప జన్మను బట్టి కాదని గ్రహించి మనవరాలిని దళితుడితో పంపడానికి నిశ్చయించుకుంటాడు. ఊరు, బ్రాహ్మణ వర్గం దీనికి అడ్డుగా నిలిస్తే వారితో వాదించి గెలుస్తాడు. చివరకు తనే తోడుగా కులం, వర్ణం అనే అంతరాల చీకట్లు నిండిన ఈ రేవు నుంచి వికాసం, అభ్యుదయం వంటి వెలుతురులు నిండిన ఆ రేవు వైపుకు కదిలిపోతాడు. సినిమా ముగుస్తుంది.
1981లో ఈ సినిమా రావడం, తీయడం, దానిని ప్రేక్షకుల చేత మెప్పించడం సామాన్య విషయం కాదు. ఇందులో దర్శకుడు రెండు విషయాలను ధ్వంసం చేశాడు. ఒకటి మనసులు కలవని పెళ్లిని, రెండు ప్రేమకు అడ్డుగా నిలిచే కులాన్ని. ప్రేమించిన అమ్మాయిని దళితుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది మామూలు వస్తువే అయి ఉండేది. కాని ఇక్కడ మరొకరి భార్య అయిన అమ్మాయికి ఆ పెళ్లిని రద్దు చేసి మరో పెళ్లి చేయడం చాలా పెద్ద విషయంగా చెప్పక తప్పదు. ‘కులాంతర వివాహాల వల్లే ఈ దేశంలో కులం అంతరిస్తుంది’ అని చెప్పాడు అంబేద్కర్. ఇది శూద్ర కులాల మధ్య సంభవించడం విశేషం కాదు. ఉన్నత కులాలకు, నిమ్నకులాలకు మధ్య ఎన్ని కులాంతర వివాహాలు జరిగితే అంత మంచిది అని ఆయన పేర్కొన్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది అంబేద్కర్ భావజాలం వైపు నడిచిన సినిమాగా చెప్పుకోవాలి.
సొంతకూతురు సొంత కులంలోని నాట్యాచారుడిని వివాహం చేసుకుంటేనే అదో అప్రదిష్టగా భావించిన యాజులు కాలక్రమంలో తన ఇంటి ఆడపిల్ల ఒక దళితుడిని వివాహం చేసుకోవడానికి సమ్మతించడం వెనుక ఉన్న పరివర్తన, ఎదుగుదల ప్రేక్షకుణ్ణి ఆలోచనల్లో పడేస్తుంది. క్లయిమాక్స్‌లో పడవ సాగిపోతూ ఉండగా ఒక బ్రాహ్మణ పిల్లవాడు ప్రశంసగా చప్పట్లు కొడతాడు. భావితరాలు ఈ ఎదుగుదలను కొనసాగించాలనే సంకేతం అందులో ఉంది.
అంతా ఔట్‌డోర్‌లో అమరావతి ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున తీసిన సినిమా నాడే కాదు నేడు కూడా ఎంతో కొత్తగా తాజాగా ఉంటుంది. ‘మేము రాజులు... మీరు యాజులు... మీరు మా మాట వినాలి’ అని ఊరి పెద్దగా నటించిన అల్లు రామలింగయ్య ఆకట్టుకుంటాడు. చేసింది ఒక్క సినిమాయే అయినా ప్రేక్షకులకు హీరోయిన్ సబిత శాశ్వతంగా గుర్తుండిపోయింది.
ఇక సాంకేతికంగా చూసినప్పుడు ఈ సినిమాకు అన్నీ ఎలా కుదరాలో అలా కుదిరాయి. కె.వి.మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం ‘శంకరాభరణం’ తర్వాత మళ్లీ మేజిక్ చేశాయి. ఇందులోని ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి’... ‘నెమలికి నేర్పిన నడకలివీ’ పాటలు నేటికీ నృత్యం నేర్చుకునే ఆడపిల్లల ఆరంగేట్రంకు ఉపయోగ పడుతున్నాయి. ‘రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ డ్యూయెట్ హృద్యంగా ఉంటుంది. ఇక కులాల మధ్య ఉన్న బోలుతనాన్ని జానపద శైలిలో పెట్టి వేటూరి రాసిన సులభ పదాలు హిట్. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన’... ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’... ఇవి పండిత పామరులను అలరించాయి. ‘పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు’... అని అనడం వేటూరికే సాధ్యం. జంధ్యాల సంభాషణలు సరేసరి. అన్నట్టు ఇందులో హీరో హరిష్‌కి కె.విశ్వనాథే డబ్బింగ్ చెప్పారు.
నిమ్నకులాలు ఉన్నత కులాలతో ఘర్షణ పడటం ఎప్పుడూ ఉండేదే. కాని అసలైన ఫలితం ఉన్నత కులాలు తమలో తాము అంతర్గత సంఘర్షణ పడినప్పుడే దక్కుతుంది. మార్పు కోసం శూద్రకులాలు ఒక అడుగు వేస్తే పెద్ద కులాలు ఏడడుగులు వేయాల్సిన అవసరాన్ని చెప్పిన సినిమా ‘సప్తపది’.