
నాకు నటన రాదు – పవన్ కల్యాణ్
‘‘సినిమాల్లో రాకముందు విశ్వనాథ్‌గారిని కలిశా. వచ్చిన తర్వాత కలిసే సందర్భం రాలేదు. విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, ఆయన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు పవన్ కల్యాణ్. బుధవారం ఉదయం హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హైదరాబాద్ లోని విశ్వనాథ్ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. పవన్ మాట్లాడుతూ – ‘‘మన సంస్కృతి, కళల పట్ల నాకు అవగాహన ఉన్నప్పటికీ స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో వెస్ట్రన్ మ్యూజిక్ పట్ల ఎక్కువ అవగాహన ఉండేది. మన సంప్రదాయం, కర్ణాటక సంగీతం వంటివన్నీ తెలిసేవి కావు. కానీ, చిన్న వయసులో ‘శంకరాభరణం’ చూసి ఎడిక్ట్ అయ్యాను. విశ్వనాథ్‌గారి గురించి మాట్లాడేంత అనుభవం, స్థాయి నాకు లేదు. అన్నయ్య (చిరంజీవి)తో అప్పుడప్పుడూ ‘స్వయంకృషి’ షూటింగ్‌కి వెళ్లేవాణ్ణి. ‘శంకరాభరణం’ తర్వాత ‘శుభలేఖ’, ‘సాగర సంగమం, సప్తపది’ ఇలా ఆయన అన్ని సినిమాలూ ఇష్టమే. ముఖ్యంగా ఆయన కథలను నడిపిన విధానం, దర్శకత్వం నాకిష్టం’’ అన్నారు.
విశ్వనాథ్ దర్శకత్వంలో నటించాలనుకున్నారా? అని పవన్‌ను ప్రశ్నించగా, ‘‘నాకు నటనే రాదు కాబట్టి ఆయన దర్శకత్వంలో నటించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘కొన్ని అవార్డులు కొందరికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌గారికి వచ్చిన తర్వాత వీటిపై నమ్మకం పెరిగింది. ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత, అనుభవం మాకు లేవు. విశ్వనాథ్‌గారు తీసిన సినిమాల్లోంచి 12 సినిమాలను ఒక డిస్క్ సెట్‌గా చేసి, లిమిటెడ్ ఎడిషన్‌గా కొన్ని కాపీలు ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్నీ, అభిమానాన్నీ, గౌరవాన్నీ చాటుకోవా లనుకుంటున్నాం. ఈ ఐడియా ఇచ్చింది కల్యాణ్‌గారే. ఆయా సినిమాల నిర్మాతలు, వీడియో హక్కులున్న వ్యక్తులతో మాట్లాడి ఈ ఏడాదే డిస్క్ సెట్ విడుదల చేయాలని మా ఆలోచన’’ అన్నారు.
విశ్వనాథ్‌గారు క్లాసిక్స్ తీశారు: బన్నీ
బుధవారం సాయంత్రం అల్లు అర్జున్ కూడా కె. విశ్వనాథ్‌ని కలిశారు. ‘‘విశ్వనాథ్‌గారు తీసినవన్నీ క్లాసిక్స్. ఆయన టచ్ చేసిన పాయింట్స్‌ను హిస్టరీలో ఎవరూ టచ్ చేయలేదు’’ అని బన్నీ అన్నారు.