Sirivennela Seetharama Sastry And K Vishwanath Interview In Telugu - Sakshi
Sakshi News home page

Sirivennela And K Vishwanath: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం

Published Wed, Dec 1 2021 11:15 AM | Last Updated on Wed, Dec 1 2021 3:09 PM

Interview With Sirivennela Sitaramasastry And K Vishwanath - Sakshi

కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి.
కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి.
సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా..
ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. 
పాటలు పామరులకు అందాయి. 
కథలు ప్రేక్షకులకు అందాయి.
పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి.

సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు?

విశ్వనాథ్‌: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్‌ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్‌ కార్డ్‌. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్‌ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్‌ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్‌ కార్డ్‌ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను.
సిరివెన్నెల: కన్విక్షన్‌ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్‌ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్‌ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. 
విశ్వనాథ్‌: కేవీ మహదేవన్‌ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్‌ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్‌ తీసేసి కొంచెం రిలాక్స్‌ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్‌నెస్‌. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్‌.. అనిపించింది. 

మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా?  

విశ్వనాథ్‌: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు.
‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి?
సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా.  మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్‌ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ  కెరీర్‌ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. 

విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? 

సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. 
విశ్వనాథ్‌: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. 
సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే.
వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..?
విశ్వనాథ్‌: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. 
సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం.

మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి?

సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్‌ రాసి మరో వెర్షన్‌ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను.
విశ్వనాథ్‌: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్‌ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను.

ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్‌ నివాళి.. 'ట్రెండింగ్‌ సెర్చ్‌' ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement