మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా! | CM KCR Visit Film Director Viswanath House | Sakshi
Sakshi News home page

మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!

Published Mon, Aug 12 2019 1:33 AM | Last Updated on Mon, Aug 12 2019 4:49 AM

CM KCR Visit Film Director Viswanath House - Sakshi

ఆదివారం హైదరాబాద్‌లో కె. విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి

సాక్షి, హైదరాబాద్‌ : ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందిం చే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్‌ దర్శకుడైతే, నిర్మాణపరమైన విషయాలు తాను చూసుకుంటా నన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌తోపాటు ఆయన భార్య జయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్, కోడలు గౌరి, దర్శ కుడు ఎన్‌.శంకర్‌ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. విశ్వనాథ్‌ దంపతులను సీఎం పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యు లు కూడా సీఎంను సత్కరించారు.  కేసీ ఆర్, విశ్వనాథ్‌ మధ్య సినిమాలు, సాహిత్యం, భాష తదితర అంశాలపై గంటకుపైగా  చర్చ జరిగింది. 

కె. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 

శంకరాభరణం 25 సార్లు చూశా.. 
‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓసారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడంలేదు. మీరు మళ్లీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’అని కళాతపస్విని సీఎం కోరారు.

గొంతు మార్చి మాట్లాడారని అనుకున్నా.. 
‘మీరు అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైంది. మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి నాతో ఫోన్లో మాట్లాడి ఇంటికి వస్తున్నానని చెబితే.. ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరు గా చూడటం ఇదే తొలిసారి. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు ఎంజీఆర్‌ మాట్లాడారు. మళ్లీ మీ అంతటివారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది’అని విశ్వనాథ్‌ సీఎంతో చెప్పారు. 

ఆపరేషన్‌ అంటే భయం 
విశ్వనాథ్‌ తన ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్‌కు వివరిస్తూ.. ‘ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్‌ చేస్తామంటున్నారు. కానీ నాకు ఆపరేషన్‌ అంటే భయం. అసలు హాస్పిటల్‌ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. ఇక ఆపరేషన్‌ ఏమి చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా’అని కేసీఆర్‌కు తెలిపారు. 

తెలుగు మహాసభలు చక్కగా నిర్వహించారు
తెలుగు భాష, సాహిత్యంపై కేసీఆర్‌కు చాలా పట్టు ఉందని, ప్రపంచ తెలుగు మహాసభలను చక్కగా నిర్వహించారని విశ్వనాథ్‌ కితాబిచ్చారు. ‘తెలుగు మాట్లాడడమే కాదు.. మంచి కళాభిమానిగా గుర్తింపు పొందారు. అసలు మీకు సాహిత్యాభిలాష ఎలా పుట్టింది’అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇందుకు సీఎం బదులిస్తూ.. తన గురువుల సాంగత్యం గురించి విశ్వనాథ్‌కు వివరించారు. 

కేసీఆర్‌కు అజ్ఞాత అభిమానిని 
సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగానే తన ఇంటికి వచ్చారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని విశ్వనాథ్‌ స్పష్టంచేశారు. కేసీఆర్‌ కలిసి వెళ్లిన తర్వాత విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. తనను ఓ అభిమానిగా ఆయన కలిశారని చెప్పారు. కేసీఆర్‌కు తాను అజ్ఞా త అభిమానినని చెప్పడాన్ని గర్వం గా భావిస్తున్నానన్నారు. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా కేసీఆర్‌ తన ఇంటికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య సాహిత్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కేసీఆర్‌లో ఇన్ని కోణాలు ఉన్నాయని తాను అనుకోలేదన్నారు. తన ఆరోగ్యం బాగుందని, ఇకపై తాను సినిమాలు తీయబోనని విశ్వనాథ్‌ స్పష్టం చేశారు.

మీ తపన విజయవంతమవుతుంది
విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కూడా కేసీఆర్‌కు తన అభిప్రాయాలు చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టారు. రైతుల కష్టాలు తీరతాయి. కాళేశ్వరం నీళ్లు వస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఎంతో ఆనందం చూశాను. నిజంగా చాలా గొప్ప ప్రాజెక్టు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే మీ తపన విజయవంతమవుతుంది’అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలమైన నీళ్లున్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులకు మేలు కలుగుతుందని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదే పనిలో ఉన్నాయని కేసీఆర్‌ ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ కలుగజేసుకుని.. చాలా కష్టపడి ప్రాజెక్టులు కడుతున్నా మీకు విమర్శలు తప్పడంలేదు కదా.. ఎలా భరిస్తున్నారని సీఎంను ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నీ అలవాటైపోయాయని, ప్రజల కోసం వాటిని పెద్దగా పట్టించుకోకుండానే పనిచేసుకుని వెళ్లిపోతున్నానని ఆయన బదులిచ్చారు. ప్రజల కోసం చేసే పనికి దైవకృప ఉంటుందని, అది మీకు కూడా ఉంటుందని ఈ సందర్భంగా విశ్వనాథ్‌ సీఎం కేసీఆర్‌ను దీవించారు. హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుందని కేసీఆర్‌ ఆయనకు తెలిపారు. అనంతరం విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ గ్రూప్‌ ఫోటో దిగారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement