జనార్దన మహర్షి, తనికెళ్ల భరణి, విశ్వనాథ్, వివేక్ కూచిభొట్ల, మాళవిక
‘‘నాకు నేను చాలా గొప్పవాడ్ని కావచ్చు కానీ నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్థన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ప్రముఖ రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్లభరణి, గాయని మాళవిక తదితులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘అందరి దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్‌గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్థన మహర్షి ఒకరు. ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది’’ అన్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆయన తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెబుతుంటే వింటూ పెరిగాను.
నాకు చిన్నప్పటినుండి విశ్వనాథ్‌గారు డైరెక్టర్ కాదు, హీరో. నాకు గురువు, దైవం అయిన తనికెళ్ల భరణి గారి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్‌గా పని చేసి తర్వాత 100 సినిమాలకు పైగా మాటల రచయితగా పనిచేశాను. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’లో విశ్వనాథ్‌గారిని డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ ‘విశ్వదర్శనం’ సినిమా ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాలవల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు. ‘‘విశ్వనాథ్ గారి పక్కన కూర్చుని మాట్లాడటమే అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘విశ్వనాథ్‌గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కథను నా గొంతుతో డబ్బింగ్ చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మాళవిక.
Comments
Please login to add a commentAdd a comment