
విశ్వనాథ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు ఆయనకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు..
టాలీవుడ్‌కు అమూల్యమైన చిత్ర కళాఖండాలను అందించిన దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. కమర్షియల్ చిత్రాలే కాకుండా తెలుగు సాహిత్య సంపదను ద్విగుణీకృతం చేసే 'శంకరాభరణం' వంటి సినిమాలను కూడా రూపొందించారాయన. ఫిబ్రవరి 19న విశ్వనాథ్ పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకుని అభిమానులు ఆయనకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాను తయారు చేసి, దాన్ని బర్త్‌డే కేక్ లోపల ఉంచారు. దాన్ని నేరుగా ఆయన ముందుకు తీసుకెళ్లి పెళ్లారు. తర్వాత విశ్వనాథ్ చేతితోనే కేకు మధ్యలో నుంచి ఆ సినిమా జాబితాను పైకి లాగేలా చేశారు. తన సినిమాలను మరోసారి కళ్లారా చూసుకున్న ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నా కోసం ఇంత కష్టపడ్డారా? అంటూ వారిపై ఆప్యాయతను కనబర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా విశ్వనాథ్ సర్గం, శుభ్ కామ్నా, సంగీత్, సనోజ్, ధన్వాన్ వంటి పలు బాలీవుడ్ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా 1995లో శుభ సంకల్పం సినిమాతో తొలిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.