
విశ్వనాథే నాకన్నీ నేర్పించారు: కృష్ణ
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ప్రముఖ నటుడు కృష్ణ అభినందనలు తెలిపారు. ఆయన శనివారం విశ్వనాథ్ నివాసానికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ థ్రిల్లర్, యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విశ్వనాథ్‌తో తాను ఎక్కువ సినిమాలు చేయలేకపోయినట్లు తెలిపారు.
చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు నటన వచ్చేది కాదని, ఆరు నెలలు పాటు శ్రమించి విశ్వనాథ్ తనకు అన్నీ నేర్పించారని అన్నారు. (దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘ తేనె మనసులు’ చిత్రానికి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. ఆ సమయంలో ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చేయ్యడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనెమనసులు' కృష్ణని హీరో చేసి నిలబెట్టింది)
మరోవైపు కృష్ణ స్వయంగా తన ఇంటికి రావడంపై విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘కృష్ణ మా ఇంటికి రావడం కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది’ అని అన్నారు.