
అమ్ముడుపోయే వస్తువుకే ఆదరణ
రాజమండ్రి :‘అమ్ముడు పోయే వస్తువుకే ఆదరణ. నేడు విడుదలవుతున్న సినిమాలు కొన్ని రూ.70 కోట్లు, రూ.వంద కోట్లు వసూలు చేస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు ప్రేక్షకుల అభిరుచి మేరకే సినిమాలు తయారవుతాయి’ అని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. శనివారం కొంతమూరులో సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ నిర్మించిన శ్రీవల్లభ గణపతి ఆలయాన్ని విశ్వనాథ్ సందర్శించారు.
గత ఐదు దశాబ్దాలుగా సినిమా రంగంలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు విశ్వనాథ్‌పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకథ రాసే ఉద్దేశం లేదని, ఇతరులు ఎవరైనా ఆ పనికి పూనుకుంటే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది సినిమాల్లోనే చెప్పానని వివరించారు.
శంకరాభరణం సినిమా విడుదలయ్యాక, సంగీత కళాశాలలో అడ్మిషన్లు పెరిగాయని, సాగరసంగమం తరువాత మగవారిలో నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగిందని, స్వర్ణకమలం తరువాత అడవారిలో నాట్యంపై ఆసక్తి పెరిందని వార్తలు వచ్చాయి.. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అనంతరం సామవేదం షణ్ముఖ శర్మ విశ్వనాథ్‌ను పూలమాలతో సత్కరించారు. శ్రీవల్లభగణపతి ట్రస్టు సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.