సాక్షి, హైదరాబాద్: మాస్ హీరోగా ఉన్న తనను క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన కళాతపస్వి, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ఆయన ఇంటికి చేరుకుని గురువుగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి పాదాభిందనం చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.(చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు)
చిరంజీవి అంటే మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించగలరని, ఎలాంటి పాత్రకైనా వన్నె తీసుకురాగల ప్రతిభ ఆయన సొంతమని ఈ సినిమాలు నిరూపించాయికాగా దీపావళి పండుగను పురస్కరించుకుని గురువుగారిని కలిసిన చిరంజీవి, ఆపాత మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ గారిని కలవాలనిపించింది. అందుకే ఈ రోజు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు.
దీపావళి వేళ ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అన్నారు. ఇక ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అందరికి దీపావళి శుభాకాంక్షలు! పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను.వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment