విశ్వనాథ్‌ దంపతుల సప్తపది | Sakshi Special Interview With Jayalaxmi And K Viswanath | Sakshi
Sakshi News home page

సప్తపది

Published Sun, Jan 5 2020 12:02 AM | Last Updated on Sun, Jan 5 2020 8:37 AM

Sakshi Special Interview With Jayalaxmi And K Viswanath

కొత్త జంటకు అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. విశ్వనాథ్‌ గారి ఇంటికి వెళ్లొచ్చాక.. ఇదిగో.. ఈ ఇంటర్వ్యూను నూతన వధూవరుల చేత చదివించినా సరిపోతుందని అనిపించింది! డెబ్బయ్‌ ఏళ్ల అన్యోన్య దాంపత్యం. కలహాలూ.. కంప్లయింట్లూ లేని అనురాగబంధం. భక్తితో ఆయన సినిమాలు తీశారు. శ్రద్ధతో ఆమె ఇంటిని నడిపించింది. అందుకే ఆ సినిమాలు.. సప్తపదులు. అందుకే ఈ దంపతులు.. ఆదర్శమూర్తులు.

జయలక్ష్మి గారితో పెళ్లికి ముందు మీరు ఎన్ని సంబంధాలు చూశారు?
విశ్వనాథ్‌: మాకు అప్పుడు సొంత ఆలోచనలు, ప్రేమలు తెలియవు. పెద్దవాళ్లే చూశారు. మేం చూసింది రెండే సంబంధాలు. ఫస్ట్‌ సంబంధం మా మామయ్య ద్వారా వచ్చింది. ఆయన పని చేసే యజమాని కూతురే తను. అది భలే సరదా అయిన విషయం. అప్పటికే నేను ఆడియోగ్రాఫర్‌గా మద్రాసులో పని చేస్తున్నాను. పిల్లని చూడ్డానికి తెనాలి వెళ్లాను. పెళ్లి చూపులయ్యాక వచ్చి ట్రైన్‌ ఎక్కాం. మా మామయ్య ట్రైన్‌ ఎక్కీ ఎక్కగానే పిల్ల నచ్చిందా? అని అడిగారు. ‘ఆ అమ్మాయి చెల్లి బాగుంది’ అన్నాను. ఇక చూడండీ! తిట్టాడు పట్టుకుని (నవ్వుతూ). ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోటీ రెండు కోట్ల రూపాయలు ఆస్తి వచ్చేది. అందుకే మా మామయ్య నన్ను తీసుకెళ్లారు. ఏదేతై ఏం ఆ సంబంధం తప్పిపోయింది. రెండో సంబంధం ఖాయం అయింది.

చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నారట... ఆ వయసులో పెళ్లి మీకు ఎలా అనిపించింది?
విశ్వనాథ్‌: అవును. ‘‘14 ఏళ్ల పిల్లకి, 19 ఏళ్ల పిల్లవాడికి వ్యక్తిత్వం అంటూ ఏర్పడదు. అదే పాతికేళ్లు అయితే ఇద్దరికీ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అప్పుడు క్లాష్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఇద్దరూ ఒకేరకమైన మనస్తత్వంతో ప్రయాణం మొదలుపెడతారు. అదే వ్యక్తిత్వం ఏర్పడ్డాక పెళ్లయితే... ఒకటీ క్లాష్‌ వచ్చే చాన్స్‌ ఉంది.. లేకపోతే కాంప్రమైజ్‌ అయి కలసి బతికే చాన్స్‌ అయినా ఉంటుంది. అదే ఇప్పుడనుకోండి  ప్రయాణం సాఫీగా సాగిపోతుంది’’ అని మా సీనియర్‌ అన్నారు. సరే అన్నాను.

ఆయన అన్నట్లుగా గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగుతోందా?
విశ్వనాథ్‌: గొడవలు ఏమీ లేవు. మా చిన్నప్పటి మాట దేవుడు ఎరుగు.. ఆ తర్వాతా ఎలాంటి గొడవలు లేవు.

అంటే.. ‘వ్యక్తిత్వం’ ఏర్పడ్డాక చేసుకునే పెళ్లిలో రిస్క్‌ ఉందంటారా? ఇప్పుడు చాలా పెళ్లిళ్లు ఫెయిల్‌ కావడానికి అదొక కారణం అంటారా?
విశ్వనాథ్‌: నా ఉద్దేశంలో అదొక కారణం. ఆ వ్యక్తిత్వమే వైపరీత్యంగా వచ్చిన వ్యక్తిత్వంగా తయారవుతోంది. పెళ్లి కాగానే ‘మీ తల్లిదండ్రులు మనతో కలిసి ఉండాలనుకుంటారేమో.. అదేం కుదరదు. వాళ్ల బతుకు వాళ్లదే. మన బతుకు మనదే’ అని అమ్మాయి చెప్పడం వంటివన్నీ వింటున్నాను. ఒకప్పుడు వీళ్ల బంధువులను వాళ్లు.. వాళ్ల బంధువులను వీళ్లు ప్రేమించేవాళ్లు.

విశ్వనాథ్‌గారు పెళ్లి చూపులకు వచ్చిన రోజును గుర్తు చేసుకోండి?
జయలక్ష్మి: ఇప్పటిలా అప్పట్లో మాట్లాడుకోవడాలు అవీ ఉండవు కదా. ఏం మాట్లాడలేదు. నాకు పధ్నాలుగు ఏళ్లు ఉన్నాయని మాత్రం గుర్తు.

చెన్నైలో ఎక్కడ ఉండేవాళ్లు?
జయలక్ష్మి: కోడమ్‌బాకమ్‌లోని వడపళనిలో ఉండేవాళ్లం. అది చిన్న పేటలా ఉండేది. స్టూడియోలు అన్నీ ఎక్కువ  శాతం అక్కడే ఉండేవి. అలానే చాలా మామిడి తోటలు ఉండేవి.

జయలక్ష్మిగారు అత్తింట్లోకి అడుగుపెట్టాక మీ అమ్మానాన్న మీతోనే ఉన్నారా?
విశ్వనాథ్‌: మా అమ్మానాన్నలకు నేనొక్కడే కొడుకుని. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మావాళ్లు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. మా కోడలి దగ్గర ఉంటేనే నాకు హాయిగా ఉంటుందని మా నాన్నగారు అనేవారు. నా పెళ్లయ్యాకే నా సిస్టర్స్‌ పెళ్లయింది. ఆ తర్వాత వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మా నాన్నవాళ్లు, సిస్టర్సే  కాదు.. మా మేనల్లుళ్లు, మా మేనకోడళ్ల పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉండి, చదువుకున్నారు. అందరికీ చక్కగా వండిపెట్టి బాగా చూసుకునేది.

ఇంటి బాధ్యతలు చూసుకునే విషయంలో మీకు ఏమైనా కష్టంగా ఉండేదా?
జయలక్ష్మి: అలాంటిదేం లేదు. మా అత్తగారు, మామగారు మా దగ్గరే ఉండేవారు. ఒక్కడే కొడుకు కదా. వాళ్లు ఉన్నన్నాళ్లు వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మా మామగారు డబ్బు కవర్‌ని వాళ్ల కొడుకుకి, భార్యకి ఇవ్వకుండా నా చేతికిచ్చేవారు. అందులో ఎంతుందో కూడా చూడకుండా జాగ్రత్తగా లోపల పెట్టేదాన్ని.

ఆడపడుచులతో మీరెలా ఉండేవారు?
జయలక్ష్మి: వాళ్లకు పెళ్లయినప్పుడు మేం మద్రాసులోనే ఉన్నాం. దాంతో వాళ్ల శ్రీమంతాలకు, కాన్పులకు ఇక్కడికి వచ్చి వెళుతుండేదాన్ని. ఏం చేసినా ఇష్టంగానే చేశాను. మేమంతా అంత బాగుంటాం.

ఇంటెడు చాకిరీ చేసిన ఆమె మీద జాలి?
విశ్వనాథ్‌: లేదు. సరైన కారణాలకే కష్టపడతోంది కాబట్టి జాలి అనిపించినా.. బయటకు చెప్పుకోదగ్గది కాదు. కష్టపడే ఏ స్త్రీని చూసినా నాకు బాధగానే ఉంటుంది. అందులోనూ అత్తామామలను చూసుకునే కోడలికి అయితే చాలా బాధ్యత ఉంటుంది. అత్తామామలను బాగా చూసుకోవడం, పిల్లలను చదివించడం అన్నీ తనే చూసుకునేది. నా తరఫున వచ్చే బంధువులు ఎవరికీ ఏ లోటూ రానివ్వలేదు. నేను మాత్రం నా వృత్తే పెద్ద బాధ్యత అనుకునేవాడిని. రాత్రీ పగలూ సినిమాలు తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అందుకని ఇంటి బాధ్యతలు పట్టించుకోలేదు. వాస్తవానికి పట్టించుకోవాల్సిన అవసరం తను కల్పించలేదు. అదొక గొప్ప విషయం.

అలా ఇంటి బాధ్యత తీసుకోనందుకు ఇప్పుడు ఏమైనా బాధగా ఉంటుందా?
విశ్వనాథ్‌: లేదు. అటునుంచి కంప్లైంట్‌ వస్తే కదా బాధ ఉంటుంది. ఆమె నన్ను ఏనాడూ ఏమీ అనలేదు. ఇంటికి ఇంత చేస్తున్నాను అనే ఫీలింగ్‌ని కూడా ఎప్పుడూ వ్యక్తపరచలేదు.

పని ఒత్తిడిని వ్యక్తపరచని ఆమె హ్యాపీగా ఉన్నారా? లేదా... అని తెలుసుకునేవారా? ఆమె తన ఆనందాన్నయినా వ్యక్తపరిచేవారా?
విశ్వనాథ్‌: నేను ఎప్పుడూ అడిగింది లేదు. ఆమె తన ఆనందాన్ని కూడా బయటకు చెప్పింది లేదు. తను దేవుడిని నమ్ముతుంది. ఇవాళ మనం ఇది చేస్తున్నాం అంటే అది మనం చేస్తున్నది కాదు.. దేవుడు చేయిస్తున్నది అంటుంది. నేనూ అదే నమ్ముతాను. నేను ‘శంకరాభరణం’ సినిమా తీశానంటే అది నా ప్రతిభ కాదు.. దేవుడు చేయించినదే అనుకుంటాను. ఆ ఒక్క సినిమా అనే కాదు.. ఏ సినిమా అయినా అది నేను ఉద్ధరించినది, ఎవరినో ఉద్ధరించడానికి చేశాననీ అనుకోను. దేవుడికి ప్రసాదం వండేటప్పుడు భక్తితో చేస్తాం. పనిని కూడా నేను అంతే శ్రద్ధగా చేస్తాను.  

ఖాళీగా ఉన్నప్పుడు పాత విషయాల గురించి ఆలోచిస్తుంటారా?
ఏమీ ఆలోచించను. తిండి గురించే ఆలోచిస్తాను (నవ్వుతూ).

అంటే.. మీరు భోజనప్రియులా?
ఆ భోజన ప్రియత్వం లేకపోతే మంచి సినిమాలు తీయలేం. భోజనం  వెరైటీగా, ఆస్వాదించేలా ఉండాలని ఎలా అయితే అనుకుంటామో అలానే తీసే సినిమాలు కూడా వెరైటీగా ఉండాలనుకుంటాం. సాధారణంగా వ్యక్తిగత జీవితం సినిమాల్లోనూ రిఫ్లెక్ట్‌ అవుతుంది. సపోజ్‌ నేను ఉమనైజర్‌ అయ్యుండి, మద్యం తాగే వ్యక్తిని అనుకోండి.. అది ఎంతో కొంత నేను తీసే సినిమాల్లో రిఫ్లెక్ట్‌ అవుతుందని నా ఉద్దేశం. మా ఇంటి వాతావరణం బాగుండేది. అందుకే పనిని బాగా చేయగలిగాను.

ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ ఉంటుందంటారు.. మీ విజయాలకు కారణం మీ శ్రీమతి?
‘బిహైండ్‌ ఎవ్రీ సక్సెస్‌ఫుల్‌ మ్యాన్‌ దేరీజ్‌ ఎ ఉమన్‌ ఆల్వేస్‌’ అంటారు. కాదు.. అసలు మనిషి మనుగడే స్త్రీ మీద ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఒక డాక్టర్‌ ఉన్నాడనుకోండి.. ఇంట్లో అతడిని నసపెట్టి పంపిస్తే ఇక ఆపరేషన్‌ ఏం సరిగ్గా చేయగలుగుతాడు. ఇంటి ప్రభావం అతనిమీద పడుతుంది. నేను స్త్రీ పక్షపాతిని. ఒక సామ్రాజ్యాన్ని ఏలినంత పని ఉంటుంది గృహిణికి. పొద్దున ఐదు గంటలకు నిద్రలేస్తే రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకూ పని చేస్తుంటారు.

మీ బెటరాఫ్‌కి వంట బాగా వచ్చా?
(నవ్వుతూ) బ్రహ్మాండంగా చేస్తుంది. మా నాన్నగారికి కూతుళ్ల వంటకన్నా కోడలి వంటే ఇష్టంగా ఉండేది.

14 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వంట నేర్చుకున్నారా?
జయలక్ష్మి: అమ్మవాళ్ల ఇంట్లో అసలు వండేదాన్ని కాదు. అయితే పెళ్లి నాటికి వంట ఎలా చేయాలో కొంచెం అవగాహన ఉంది. పెళ్లి చేసే ముందు అమ్మలు వంట నేర్చుకోమని చెబుతారు కదా. అలా అవగాహన వచ్చింది. మా అన్నయ్యగారికి నేనంటే చాలా ప్రేమ. మా అమ్మ నాకు పని చెబితే అన్నయ్య వచ్చి చేసేవాడు. ‘దానికి చెప్పిన పనులు నువ్వు చేస్తావేరా?’ అనేవారు. అత్తగారింట్లో మా అత్తగారు, మా ఆడపడుచులు అందరూ ఉండేవారు. మా అత్తగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మడి కట్టుకుని పెద్దవాళ్లే ఎక్కువగా వంట చేసేవారు.

ఇప్పుడు మేడమ్‌ వంట చేయడం మానేశారు కదా.. అదేమైనా వెలితిగా ఉంటుందా?
విశ్వనాథ్‌: లేదు. ఎందుకంటే మా కోడళ్లు కూడా అంత బాగా వంట చేస్తారు. మాదేమీ పెద్ద హై సొసైటీ కాదు కదా. మా కోడళ్లు మధ్యతరగతి నుంచి వచ్చినవాళ్లే. పుట్టింట్లో కొంత నేర్చుకుని అత్తింటికి వచ్చారు. అత్తకి అనుభవం ఉంది కాబట్టి కొన్ని సూచనలు చెబుతారు. దాంతో బ్రహ్మాండంగా వంట చేయడం అలవాటయింది.

‘మాది హై సొసైటీ కాదు’ అన్నారు. కళాతపస్వి విశ్వనాథ్‌గారు ‘మిడిల్‌ క్లాస్‌’ ఎలా అవుతారు?
విశ్వనాథ్‌: మేం ఎప్పుడూ మధ్యతరగతి వ్యక్తుల్లానే ఫీలవుతాం. నిజం చెప్పాల్సి వస్తే.. నేను డైరెక్టర్‌ అయిన పదేళ్లకు కారు కొన్నాను.

మేడమ్‌ కూడా అడగలేదా?
విశ్వనాథ్‌: వాళ్లకి కారు ఉంది.. మనకు లేదేంటి? వాళ్లకు కలర్‌ టీవీ ఉంది.. మనకు లేదేంటి? వాళ్లకు వాషింగ్‌ మిషన్‌ ఉంది.. మనకు లేదేంటి? ఇలాంటివన్నీ ఎప్పుడూ అడగలేదు.

నగలు అడిగేవారా?
విశ్వనాథ్‌: లేదు. పత్రికల్లో నచ్చిన నగ కనిపిస్తే.. అది చూపించేది. ఆ నగ బాగుందనేది కానీ కొనివ్వమని మాత్రం అడిగేది కాదు. నేను కూడా చూపించిన ప్రతి నగా కొనేవాణ్ణి కాదు. ఒకటీ రెండూ కొనిపెట్టేవాణ్ణి (నవ్వులు).

ఆ పదేళ్లల్లో సొంత కారు ఉండాలని మీకూ అనిపించలేదా?
జయలక్ష్మి: మన బడ్జెట్లు మనకు తెలిసినప్పుడు ఏమడుగుతాం? అయినా నాకు పెద్దగా ఆశలు లేవు. అవి కావాలి.. ఇవి కావాలని కూడా తెలియదు. మాది సామాన్యమైన కుటుంబం. ఉన్నవాటిలో మంచివి దాచుకోవడం.. అవసరానికి వాడుకోవడం.. అలా పెరిగాం. అది లేదనే గోల... ఇది ఉందనే గర్వం కూడా లేదు.

ఆర్థిక వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు?
విశ్వనాథ్‌: మా పెళ్లయ్యాక కూడా చాన్నాళ్లు మా నాన్నగారే ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు. పొదుపు విషయానికి వస్తే.. ఏది అవసరమో అది లోటు లేకుండా చేసుకుంటాం. అప్పట్లో నేను తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. ఎందుకంటే నేను తీసినవన్నీ దాదాపు రిస్కీ సబ్జెక్టులే. అలాంటి కథలతో నిర్మాత సినిమా తీయడమే గొప్ప అని నా ఫీలింగ్‌. ‘సిరివెన్నెల’, ‘మాంగల్యానికి మరో ముడి’ వంటి సినిమాలన్నీ రిస్కే. ఆ రిస్క్‌ తీసుకుంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్‌ ఎంత ఇస్తే అంత తీసుకునేవాణ్ణి తప్ప ఇంత కావాలని అడిగేవాణ్ణి కాదు. తీసుకునేదే తక్కువంటే.. అందులోనే కొంతమంది ఎగ్గొట్టేవారు.

ఆర్థిక బాధ్యతలు మామగారికి అప్పజెప్పినందుకు జయలక్ష్మిగారు ఏమీ అనలేదా?
విశ్వనాథ్‌: అబ్బే లేదు. మనీ విషయమే కాదు.. దేనికీ కంప్లైంట్‌ చేయలేదు. ఇప్పుడు మీరేమైనా చెబితే నేర్చుకుంటుందేమో (నవ్వుతూ).

మీ ఇద్దరి అబ్బాయిలను సినిమాలకు దూరంగా ఉంచారు. అది ఎవరి నిర్ణయం?
జయలక్ష్మి: ఆయన ఎన్నో సినిమాలు చేశారు. కొందరు డబ్బులు ఎగ్గొట్టారు. ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్లు ఉన్నప్పుడు మనం అడగలేం కూడా. అదే ఉద్యోగం అనుకోండి.. నెలకింత అని కరెక్ట్‌గా వచ్చేస్తుందనుకున్నాం. ఒకవేళ మా అబ్బాయిలకు ఆసక్తి ఉంటే ఆలోచించేవాళ్లమేమో.

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం ఎలా ఉంటోంది?
జయలక్ష్మి: బాగానే ఉంది. నేను ఎవరైనా మనిషి సహాయంతో నడుస్తాను.
విశ్వనాథ్‌: నేను మనుషుల సహాయంతో నడుస్తాను. (నవ్వుతూ).

ఫైనల్లీ... ‘సెవన్‌ ఇయర్స్‌ ఇచింగ్‌’ అంటారు.. అంటే పెళ్లయిన ఏడేళ్లకే ఒకరంటే ఒకరికి విసుగు వస్తుందంటారు. మీది ‘సప్తపది’.. 70 ఏళ్ల వైవాహిక జీవితం. ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ గురించి కొన్ని టిప్స్‌?
విశ్వనాథ్‌: సెవన్‌ ఇయర్స్‌ ఇచింగ్‌ అనేది యూనివర్సల్‌గా కరెక్ట్‌ కాదు. పిచ్చి ఆలోచనలు ఉన్నవాళ్లకు ఏడేళ్లు అక్కర్లేదు, మూడేళ్లకే విసుగు రావచ్చు. సినిమాల్లో పని చేసేటప్పుడు ఇంకా త్వరగా రావచ్చు. మేం ఇమాజినేషన్‌లో వర్క్‌ చేస్తాం. గ్లామర్‌ ఫీల్డ్‌ కూడా. ‘విల్‌ పవర్‌’ ముఖ్యం. బంధం పటిష్టంగా ఉండాలంటే మనం కరెక్ట్‌గా ఉండాలి. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ల బంధం ఎప్పటికీ బాగుంటుంది
జయలక్ష్మి: ఇద్దరి మధ్య ప్రేమ, అవగాహన ముఖ్యం.
– డి.జి. భవాని

ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో వారి చిన్నకోడలు గౌరీమోహిని అక్కడే ఉన్నారు. పెద్ద కోడలు లక్ష్మి, చిన్న కోడలు గౌరీమోహిని ఇద్దరూ మనస్పర్థలు లేకుండా ఉంటారని విశ్వనాథ్‌ దంపతులు అన్నారు. గౌరీ మోహిని ఏమంటారంటే..
ఈ ఇంటికి కోడలు అయినందుకు మీ ఫీలింగ్‌ ఏంటి?
గౌరీ మోహిని: ఆ క్రెడిట్‌ మా పెద్దనాన్నగారికి వెళ్తుంది. ఆయన ద్వారానే సంబంధం వచ్చింది. మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం.

మీ అత్తగారు తన అత్తామామలతో ఉన్నట్లే... ఇప్పుడు మీరు మీ అత్తమామలు, తోడికోడలితో ఉంటున్నారు కదా... ప్రైవసీ లేదు అనిపిస్తుందా?
ఆ ఫీలింగ్‌ ఏం లేదు. మా అమ్మవాళ్లది కూడా ఉమ్మడి కుటుంబమే.

అత్తను ప్రతిదీ అడిగి చేయాలా... అని ప్రస్తుత జనరేషన్‌కి అనిపిస్తుంటుంది కదా...
సంపాదిస్తున్నారు కాబట్టి అనిపించొచ్చేమో? అయితే సంపాదించినా సంపాదించకపోయినా పెద్దవాళ్ల సలహా అడిగి చేస్తే తప్పు కాదని నా అభిప్రాయం.

మీ అత్తగారు చెప్పేవాటిలో ది బెస్ట్‌ అనదగ్గది?
అత్తగారు ఎప్పుడూ ‘మనం నది ఒడ్డున ఉన్న చెట్టులా ఉండాలి’ అంటారు. నీళ్లు ఎంత వేగంగా వచ్చినా కూడా స్థిరంగా నిలబడి ఉండాలంటారు. మావయ్యగారు క్రియేటివ్‌ ఫ్లోలోకి వెళ్తే అందుకోలేం.

ఎప్పుడూ తీరిక లేకుండా సినిమాలతోగడిపేవారు. ఈయన ఫ్రీ అయితే నాతో టైమ్‌ స్పెండ్‌ చేస్తారు అనుకున్న సందర్భాలేమైనా?
జయలక్ష్మి:  అమ్మో ఫ్రీ అయిపోతే ఎలా?  సినిమాలు తీయడమే ఆయన ఉద్యోగం కదా. ఆ ఉద్యోగం నుంచి ఫ్రీ అయితే ఇల్లు గడిచేదెలా?

విశ్వనాథ్‌గారు పని చేసిన హీరోయిన్లందరూ గొప్ప గొప్ప హీరోయిన్లు.. అందగత్తెలు కూడా. ఆ విషయంలో ఏదైనా భయంగా ఉండేదా?
జయలక్ష్మి:  అసలు ఆ ఆలోచనా విధానమే లేదు. ఏ వ్యక్తికైనా ఆలోచనలు బాగుండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడు అనుమానాలు, భయాలు ఉండవు.

టైమ్‌పాస్‌ కోసం  ఏం చేస్తారు?
కె. విశ్వనాథ్‌: మా ఇంట్లో చాలా త్వరగా నిద్ర లేస్తాం. అందుకని పదకొండు గంటలకల్లా ఫ్రీ అయిపోతాం. ఇదిగో ఇలా హాలులో కూర్చుని టీవీ చూస్తాం. తను చాగంటి, గరికపాటి, తమిళంలో స్కంద కవచం.. వంటివన్నీ చూస్తుంది. పదకొండు గంటలకల్లా తన గదిలోకి వెళ్లిపోతుంది. హమ్మయ్య అనుకుంటాను. ఎందుకంటే నాకు వంటల కార్యక్రమాలు ఇష్టం. తను అలా గదిలోకి వెళ్లగానే నేను వంటల ప్రోగ్రామ్‌ పెట్టుకుంటా (నవ్వుతూ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement