శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను విశ్వ దర్శనం పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
మంగళవారం కె. విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, జనార్ధన మహర్షి, వివేక్ కూచిబొట్ల, తనికెళ్లభరణి, సింగర్ మాళవిక తదితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే విశ్వదర్శనం. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు.
దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ‘మా అమ్మగారు విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆమె చిన్నప్పటి నుంచీ ఆయన తీసిన సినిమాల్లోని కథలను చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’ అనే చిత్రంలో ఆయన్ను డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ విశ్వదర్శనం సినిమా ద్వారా వచ్చింది. వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నా’ మన్నారు.
నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘అందరు దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్ గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్ధనమహర్షి ఒకరు. వారి ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment