ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు | sakshi excellence awards celebrations | Sakshi
Sakshi News home page

ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు

Published Mon, Apr 25 2016 3:13 AM | Last Updated on Wed, Jul 25 2018 5:54 PM

ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు - Sakshi

ప్రసాదంలాంటిది సాక్షి అవార్డు

సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన వేడుకలో జీవిత సాఫల్య పురస్కార గ్రహీత కె.విశ్వనాథ్
కనులపండువగా అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన అతిరథులు
తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి.. బెస్ట్ లిరిసిస్ట్‌గా సిరివెన్నెల
తెలుగు ఎన్నారై ఆఫ్ ద ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి.. మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా మహేశ్‌బాబు


సాక్షి, హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులు, సంస్థలను ‘సాక్షి’ సమున్నతంగా గౌరవించింది. ప్రతిభకు పట్టం కడుతూ వరుసగా రెండో ఏడాది ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులను ప్రదానం చేసింది. ఆదివారం అతిరథ మహారథుల మధ్య హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం కన్నులపండువగా జరిగింది.

కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్‌ను జీవిత  సాఫల్య పురస్కారం వరించింది. సినీ దర్శకుడు  దాసరి నారాయణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఎన్నో అవార్డులు వచ్చాయి. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే..’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.

ఇక మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నటుడు మహేశ్‌బాబు(శ్రీమంతుడు), తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా బాల థెరిస్సా సింగరెడ్డి, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(ఫిమేల్) జ్యోతి సురేఖ, యంగ్ అచీవర్ స్పోర్ట్స్(మేల్) శ్రీకాంత్ , మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిలను అవార్డులు వరించాయి. అత్యంత వైభవంగా సాగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్, దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు, సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం అభినందనీయం: కె.విశ్వనాథ్
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ.. సాక్షి ఎంపికలో వైవిధ్యం ఉందని కొనియాడారు. సియాచిన్ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన ఓ సైనికుడి సేవలను గుర్తిస్తూ ఆయన భార్య, బిడ్డలకు ‘సాక్షి’ అవార్డు ఇవ్వడం తన హృదయాన్ని కదలించిందన్నారు. అలాంటి వీరులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి సాక్షి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాంటివారి మధ్య పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. విశ్వనాథ్‌కు సాక్షి చేస్తున్న ఈ సత్కారం సినీపరిశ్రమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.అవార్డులు వీరికే
మెడ్‌ప్లస్ మెడికల్ షాప్‌లను వేలల్లో విస్తరించిన వ్యాపారవేత్త డాక్టర్ మధుకర్ గంగడికి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(లార్జ్)’ దక్కింది. అంధుడైన చక్కని చిట్కాలతో డిస్పోజబుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో దూసుకెళుతున్న బొల్లా శ్రీకాంత్ (బొల్లాంట్ ఇండస్ట్రీస్)ను ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(స్మాల్/మీడియం) అవార్డు వరించింది. విద్యారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టుకు ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. లక్షల్లో కుటుంబ నియంత్రణ అపరేషన్‌లు చేసిన డాక్టర్ మదసి వెంకయ్యకు ఎక్సలెన్సీ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు దక్కింది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు యంగ్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు లభించింది.

సియాచిన్‌లో ప్రాణాలొదిన సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు ప్రకటించిన జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ఆయన భార్య నసీమున్ అందుకున్నారు. తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు గెల్చుకున్న బాల థెరిస్సా సింగరెడ్డి తరఫున శౌరిరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. సేంద్రియ సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా రైతు ఎం.వినోదకు ఎక్సలెన్సీ ఇన్ ఫామింగ్ అవార్డు దక్కింది. ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు ఎక్సలెన్సీ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్ అవార్డు, యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డు సోనీవుడ్‌ను వరించాయి. ఫోర్‌మ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డి.. ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, అవార్డుల జ్యూరీ చైర్‌పర్సన్ శాంతా సిన్హా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.పాపులర్ విభాగంలో వీరికే..
మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా ‘శ్రీమంతుడు’ నిలిచింది. దర్శకుడు కొరటాల శివ, రవిశంకర్, సినీ నటుడు మహేశ్‌బాబు... రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.
మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మహేశ్‌బాబు సినీ నటి జయప్రద, వైఎస్ భారతి చేతుల మీదుగా అందుకున్నారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (పండుగ చేస్కో), మోస్ట్ పాపులర్ డెరైక్టర్‌గా గుణశేఖర్(రుద్రమదేవి), మోస్ట్ పాపులర్ మ్యూజిక్  డెరైక్టర్‌గా దేశీ శ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి, కుమార్ 21ఎఫ్), పాపులర్ సింగర్‌గా సత్య యామిని, పాపులర్ సింగర్(మేల్)గా కారుణ్య అవార్డులు అందుకున్నారు.

జ్యూరీ స్పెషల్ అవార్డు-బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్‌గా కంచె సినిమా అవార్డు దక్కించుకుంది. మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దేవీ శ్రీ ప్రసాద్ తరఫున సుకుమార్ అందుకున్నారు. వీరికి రాజ్‌దీప్ సర్దేశాయ్, దాసరి నారాయణ, జయప్రద, ఆర్‌పీ పట్నాయక్, గుణశేఖర్, క్రిష్ తదితరులు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సెల్‌కాన్ కంపెనీ ఎండీ గురుస్వామి నాయుడు, సీఐఐ ప్రెసిడెంట్ వనిత దాట్ల, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి, కమ్యూనికేషన్ డెరైక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గొప్పగా గౌరవిస్తోంది: రాజ్‌దీప్
తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి అవార్డులు ఇచ్చి ఎంతో గొప్పగా గౌరవిస్తోందని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు. సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 
చాలా చాలా ఆనందం...
శ్రీమంతుడు సినిమా నా జీవితంలోనే బెస్ట్ టర్నింగ్ పాయింట్. సాక్షి మీడియా గ్రూప్ ద్వారా వరుసగా రెండోసారి మోస్ట్ పాపులర్ మేల్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోవడం నిజంగా చాలా చాలా ఆనందం కలిగిస్తోంది. - హీరో మహేశ్‌బాబు
 
ఈ అవార్డు తిరుపతి లడ్డూ లాంటిది...
న్యాయస్థానాల్లో నిజం చెప్పమని అడుగుతూ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. ఇక్కడ ఆ అవసరం లేకపోయినా, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను... ఇక్కడకు వచ్చి, ఇక్కడ అవార్డులు అందుకున్న కొందరి ప్రొఫైల్స్ చూశాక... నేను సాధించింది చాలా తక్కువ అని నేను చాలా చిన్నవాడ్ని అని భావిస్తున్నాను. మనకు లడ్డూలు ఎన్నో ఉంటాయి. అయితే తిరుపతి లడ్డూ ఆ దేవుడి ప్రసాదం. ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డు కూడా నాకు అలాంటిదే. - కళాతపస్వి కె.విశ్వనాథ్
 
ప్రభుత్వ అవార్డుల కన్నా మిన్న
 విభిన్న రంగాల నుంచి సేవ చేసిన వారిని ఎంపిక చేసి సాక్షి మీడియా అవార్డులు ఇచ్చి సత్కరించడం గొప్ప విషయం. మీడియా అవార్డులు ప్రభుత్వ అవార్డుల కన్నా గొప్పవి అంటాన్నేను. కళాతపస్వి దర్శకులు కె.విశ్వనాధ్‌కి లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డ్ అందించడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ఆయన సినిమాలు వేటికవే ఆణిముత్యాలు. ఆయన తీసిన సిరిమువ్వల సింహనాదం అనే ఒక్క సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అది చాలా గొప్ప సినిమా. బహుశా దాన్ని నేనే విడుదల చేస్తానేమో - సినీ దర్శకుడు దాసరి నారాయణరావు
 
సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుడు
సినీరంగం అంటే కొందరికి చిన్న చూపు. అయితే అలాంటివారు కూడా గౌరవం ప్రకటించక తప్పని గొప్ప సినిమాలను తీసిన దర్శకుడు కె.విశ్వనాధ్. అలాంటి కళాతపస్విని సాక్షి మీడియా సత్కరించడం ఎంతైనా సముచితం. ఆయన సినిమా ద్వారా పుట్టిన రచయితగా ఈ వేడుకలో పాలు పంచుకోవడం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. ఇదే కార్యక్రమంలో నాకు కూడా అత్యధిక ప్రజాదరణ పొందిన సినీ రచయిత పురస్కారం అందించినందుకు  సాక్షికి, కంచె సినిమాలో ఆ పాట రాసే అవకాశం ఇచ్చిన సినిమా రూపకర్తలకు కృతజ్ఞతలు.
- సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి
 
తెలుగు వారి ఆదరణకు చిహ్నం
సన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నేను సాధించింది చాలా తక్కువే అయినా... ఇలాంటి అరుదైన పురస్కారాలతో నన్ను అభిమానిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు ప్రేక్షకుల నన్ను ఆదరిస్తున్న తీరుకు మరో నిదర్శనం.-  సినీ తార రకుల్ ప్రీత్ సింగ్
 
ఉన్నత ప్రమాణాల సాక్షి...

మీడియా గ్రూప్‌గా ఉన్నత ప్రమాణాలు పాటించే సాక్షి నుంచి అవార్డు అందుకోవడం సంతృప్తిని అందించింది. - సినీ దర్శకుడు గుణశేఖర్
 
స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి
వ్యక్తిగతంగా మంచి సక్సెస్‌ని అందించిన సినిమా శ్రీమంతుడు. దానికే సాక్షి ద్వారా మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సాక్షి. - సినీ దర్శకుడు కొరటాల శివ
 
వెరీ హ్యాపీ

మంచి పాట పాడే అవకాశాన్ని అందించిన బాహుబలి సినిమా దర్శకులు, సంగీత దర్శకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు వచ్చినందుకు వెరీ హ్యాపీ. - గాయని సత్య యామిని
 
ఈ వేదిక ఎంతో గొప్పది..
అవార్డు వస్తే జనం వై అనకూడదు. వైనాట్ అనాలి. గమ్యం నుంచి అలాంటి సినిమాలే తీస్తూ వస్తున్నాను. ఇక్కడ అవార్డు అందుకుంటున్న వారిని చూశాక... ఈ వేదిక నాకు చాలా గొప్పదిగా అనిపిస్తోంది. ఇలాంటి వేదిక మీద నేను కూడా అవార్డు తీసుకోవడం చాలా ఆనందం కలిగించింది. - సినీ దర్శకుడు క్రిష్
 
అమ్మ పాట తెచ్చిన అవార్డు...
నాకు మనసుకు బాగా నచ్చిన పాట ద్వారా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. నాకు జన్మనిచ్చి, తద్వారా ఈ పాటకి జన్మనిచ్చిన అమ్మకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. - సినీ గాయకుడు కారుణ్య
 
ఆయన ఫొటో పక్కనే పెట్టుకుంటా...
నా భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. ఆయన లేకపోయినా, ఆయన త్యాగాన్ని గుర్తించి సాక్షి గ్రూప్ ఈ అవార్డు అందించడం ద్వారా నా భర్తను మరోసారి గౌరవించింది. ఇంటికి వెళ్లాక సాక్షి పురస్కారాన్ని నా భర్త ఫొటో పక్కనే పెట్టుకుంటా.  - నసీమున్, అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య
 
మీడియా చేసిన తొలి సత్కారమిది

క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. అయితే ప్రతిభావంతురాలైన విద్యార్ధినిగా, అదీ ఒక ప్రతిష్టాత్మక మీడియా గ్రూప్ నుంచి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోవడం చాలా తృప్తినిచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా ఇది నాకెంతో ప్రత్యేకం.  -నైనా జైస్వాల్
 

వైఫల్యాలపై పోరాడే శక్తిని ఇచ్చింది
జీవితంలో సామాజిక సేవ పరంగా ఎన్నో ఆశయాలున్నా, ఏమీ సాధించలేదని, నిస్పృహ చెందుతూ, అన్నింటా ఫెయిల్యూర్ అని బాధపడుతున్న నాకు సాక్షి అవార్డు కొత్త ఉత్సాహాన్ని అందించింది. సాక్షి దినపత్రిక అభిమాని అయిన నా భార్య ఈ పోటీకి దరఖాస్తు చేయమని ప్రోత్సహించింది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చిన ఈ గుర్తింపు స్ఫూర్తిగా ముందడుగు వేస్తాను.     - సోనీ వుడ్, సామాజికవేత్త
 
మీడియా సంస్థ నుంచి తొలి అవార్డు

ఇది ఒక మీడియా సంస్థ నుంచి నేను స్వీకరిస్తున్న తొలి అవార్డ్. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత మెడల్ సాధించాలనేదే  లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు ఇలాంటి పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయి.  - జ్యోతి సురేఖ, క్రీడాకారిణి
 
సేవా హృదయాల కోసం
డబ్బుండటం కాదు, సేవా హృదయం ఉండడం ముఖ్యం. అనంతపురంలో ప్రారంభించిన మా సేవాకార్యక్రమాలకు మరింత మంది ఊతంగా నిలవాలి. అందుకు ఇలాంటి పురస్కారాలు ఉపకరిస్తాయి. - మాచో ఫై, సామాజికవేత్త
 
మంచికి ప్రోత్సాహమిది
బాల థెరిసా కొన్నేళ్లుగా 6 వేల గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఆమె తరపున ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సమాజంలో మంచి అనేదే కొద్దిగా ఉంది. ఉన్న కొంచెం మంచిని ప్రోత్సహించడం మరీ కొరతగా ఉంది. అలాంటి ప్రోత్సాహం అందిస్తున్న సాక్షికి కృతజ్ఞతలు. -శౌరి రెడ్డి
 
శాస్త్రవేత్తలందరికీ...
అత్యాధునిక క్షిపణి సామర్థ్యం కలిగిన టాప్ 7 దేశాల్లో మన భారత్ ఒకటి. అందుకు హైదరాబాద్‌లోని తయారీ సంస్థలే ప్రధాన కారణం. నాకు లభించిన ఈ అవార్డ్‌ను ఈ రక్షణ రంగంలో పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్టుగా భావిస్తున్నా. - సతీశ్‌రెడ్డి, ప్రధాని రక్షణ సలహాదారు
 
లక్ష్యసాధనలో స్ఫూర్తి...
రాజకీయాల్లోకి నీతివంతులు, నేరచరిత్ర లేనివారు, మంచి వారు రావాలని, ప్రభుత్వ శాఖలు సమర్ధవంతంగా పనిచేయాలని మా సంస్థ కృషి చేస్తోంది. దీని కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. ఇంకా ఎన్నో చేయాలి. లక్ష్యసాధనలో మాకు ఈ అవార్డు స్ఫూర్తి.  -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
 
ఆనందంగా అనిపిస్తోంది
నాణ్యమైన ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనేది మా నినాదం. మన దేశ జనాభాలో ఇప్పటికీ 70శాతం గ్రామాల్లోనే ఉంది. వీరికి మంచి వైద్యం అందేందుకు కృషి చేస్తున్నాం. మా కృషిని సాక్షి గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మరింత పట్టుదలగా పనిచేస్తాం.- డాక్టర్ మాదాసి వెంకయ్య
 
మహిళా రైతులకు గుర్తింపు

వ్యవసాయం చేసే మహిళలకు ప్రోత్సాహం కావాలి. అందరి ఆరోగ్యానికి మేలు చేసేలా, ప్రకృతి సహజమైన, సేంద్రియ సాగుకు కట్టుబడి ఉన్న మాకు సాక్షి ఇచ్చిన ఈ అవార్డు ఎంతో శక్తిని అందించింది. -వినోద, ఆదర్శ రైతు
 
థ్యాంక్స్ టు సాక్షి
గత పదేళ్లుగా మెడికల్ స్టోర్స్ నిర్వహణలో ఉన్నాం. నకిలీ మందుల విజృంభణకు విరుగుడుగా, మంచి, నాణ్యమైన మందులు అందుబాటు ధరలలో అందిస్తున్నాం. ప్రస్తుతం 12 రాష్ట్రాలకు విస్తరించిన మా సంస్థను గుర్తించి అవార్డ్‌ని అందించినందుకు థ్యాంక్స్ టు సాక్షి  -గంగాడి మధుకర్, వ్యాపారవేత్త
 
వినూత్నంగా ఉండాలనుకున్నా
ఒక వయసు రాగానే ప్రభుత్వోగం, పెళి...్ల మన దేశంలో పేరెంట్స్ ఐడియాలజీ అలా ఉంటుంది. అయితే నాకంటూ ఒక ప్రత్యేకత సాధించాలనుకున్నాను. ఎంచుకున్న రంగంలో నాదైన ముద్ర వేయాలనుకున్నాను. నా సక్సెస్‌కు సాక్షి ఇచ్చిన గుర్తింపు ఆనందాన్నిచ్చింది.  -శ్రీకాంత్, అంధ వ్యాపారవేత్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement