సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్: ప్రతిభకు పట్టం కడదాం.. | Sakshi Excellence Awards 2017 | Sakshi
Sakshi News home page

సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్: ప్రతిభకు పట్టం కడదాం..

Published Sun, Jan 21 2018 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi Excellence Awards 2017

సాక్షి మీడియా గ్రూప్‌ ఛైర్‌ పర్సన్‌ శ్రీమతి భారతి రెడ్డి, చీఫ్‌ గెస్ట్‌ ప్రముఖ జర్నలిస్ట్‌ బర్కాదత్‌ మరియు తదితర ప్రముఖులతో ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌–2016’ పురస్కార గ్రహీతలు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన నాయక్‌ వెంకటరమణకి సలామ్‌ చేసింది...,భారత కీర్తి పతాకని విశ్వవీధుల్లో ఎగరేసిన పీవీ సింధుని ఆకాశానికెత్తింది..., సమోసాలమ్ముకునే నిరుపేద కడుపున పుట్టి దేశపు అత్యున్నత ఐఐటీల్లోకి దూసుకెళ్లిన బిడ్డ అభ్యాస్‌ని ఆశీర్వదించింది...., సర్కారు బడుల్లో చదువుకు వన్నెలద్దిన ‘వందేమాతరం’ సేవలకు వందనాలంది...., దిక్కులేని దీనులకు అన్నీ తానై ఆదుకున్న ‘సహృదయ’ యాకుబ్‌ బీని అభినందించింది...., నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించింది... ఇలా త్యాగాన్ని, నైపుణ్యాన్ని, ప్రతిభని, సేవని, దయని, కళని... అవెక్కడున్నా వెలికి తీసింది ‘సాక్షి’! వారందరినీ అభిమానించి, అభినందించి, అవార్డులతో అలరించి సముచిత రీతిన సత్కరించింది.

కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ కృషి, మరిన్ని సంస్థల సేవా నిరతిని ఇలా ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. ఈ మంచి వీరితోనే ఆగిపోకూడదని, మరింత విస్తరించి సమకాలికులతో పాటు భావితరాలకు స్ఫూర్తి కావాలని తలపోసినందునే, ఏటేటా ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డ్స్' ద్వారా వారిని సత్కరించి, ప్రోత్సహిస్తోంది. స్ఫూర్తిని తెలుగునాట పరివ్యాప్తం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులు, నైపుణ్యపు దిట్టలు, నిబద్దత కలిగిన సేవా సంస్థలకు ఇలా అవార్డులిచ్చే ప్రక్రియను సాక్షి మీడియా సంస్థ చేపట్టి మూడేళ్లవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న పలువురు 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ అవార్డులకు ఎంపికై ఎందరికో స్ఫూర్తిని రగిలించారు. లేలేత చిగుళ్లుగా ఎదుగుతున్న యువకిశోరాల నుంచి జీవన సాఫల్య పురస్కారం పొందిన మహనీయుల వరకు ఎందరెందరో ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. 2017కు గాను వేర్వేరు అవార్డులకు ఎంపిక ప్రక్రియ ఇటీవలే మొదలైంది. 10 ఫిబ్రవరి, 2018, సాయంత్రం 6 గం.ల వరకు గడువు ఉండటంతో ఇప్పుడిప్పుడే ఎంట్రీలు అందుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రత్యేకత ఏమంటే... ఎవరికి వారు ఎంట్రీలు పంపుకునే పద్ధతి లేదు. విశేష ప్రతిభావంతుల్ని, అసాధారణ నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని, విశిష్ఠ సేవలందిస్తున్న సంస్థల్ని గుర్తెరిగిన ఇతరులెవరైనా వారి తరపున ఈ ఎంట్రీలు పంపవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ముఖ్యులు న్యాయ నిర్ణేతలుగా ఉండే జ్యూరీలు తుది ఎంపిక జరుపుతాయి.

ప్రతిభ ఎక్కడున్నా పట్టం
విద్య, వైద్య, వ్యవసాయ, వాణిజ్య, సామాజిక సేవ, క్రీడా, సినిమా తదితర రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ఈ ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు’ల కోసం గుర్తిస్తారు. కొన్ని విభాగాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకూ అవార్డులున్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ అవార్డుల్నీ అందిస్తున్నారు. ఇవే కాక, సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభ చూపిన వారిని ప్రజాదరణ ఆధారంగా ఎంపిక చేసి అవార్డులిస్తారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులు, దర్శకుడు, సంగీతం, నేపథ్యగానం వంటి విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. దివంగత సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి, ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్, ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణలు గత మూడేళ్లుగా జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ‘తెలుగు శిఖరం’ ప్రత్యేక  అవార్డును దర్శకరత్న దాసరినారాయణరావుకు అందించారు.

వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసి సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డులందుకున్న వారిలో పీవీ సింధు, డా.సతీశ్‌రెడ్డి, డా.చరణ్‌ జీ రెడ్డి,  శ్రీకాంత్‌ బోళ్ల, డా.ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్, జ్యోతిరెడ్డి తదితరులున్నారు. క్రీడాకారులు ద్రోణవల్లి హారిక, సైనా నెహ్వాల్, నైనా జైస్వాల్, సిరాజ్, సాకేత్‌ తదితరులున్నారు. ఇక వందేమాతరం ఫౌండేషన్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్, ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌లతో పాటు భారత్‌ వికలాంగుల సేవా సమితి వంటి సంస్థలూ అవార్డు గ్రహీతల్లో ఉన్నాయి. అవార్డు పొందిన సినీ ప్రముఖుల్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, రామజోగయ్య శాస్త్రి, దేవీశ్రీప్రసాద్, కారుణ్య వంటి వారున్నారు. వరుసగా మూడేళ్లు జరిగిన అవార్డు ప్రదానోత్సవాలకు మీడియా ప్రముఖులైన శేఖర్‌గుప్తా, రాజ్‌దీప్‌ సర్దేశాయ్, బర్కాదత్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభకు పట్టం కట్టడం, నైపుణ్యాల్ని గుర్తించడం, సేవ–ప్రత్యేక కృషిని అభినందించడం, లక్ష్య సాధనను ప్రశంసించడం ఎవరైనా చేయదగ్గ మంచి పనే! ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉండే ఇటువంటి వారిని గుర్తించి, సదరు అర్హుల పేర్లను ఈ అవార్డుకు ప్రతిపాదిస్తూ ఎంట్రీలు పంపుతారని సాక్షి అభిలషిస్తోంది. నామినేషన్ల ఎంట్రీ దరఖాస్తుల కోసం...www.sakshiexcellenceawards.comలాగిన్‌ కాగలరు. 

వివరాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–2332 2330 నంబరుపై సంప్రదించవచ్చు. ఈ–మెయిల్‌: sakshiexcellenceawards@sakshi.com.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement