జూన్ 4న దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా తెలుగు చిత్రసీమ ‘స్వర నీరాజన ం’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని 12 గంటల పాటు లైవ్‌లో చూపించారు. ఈ సందర్భంగా జూమ్‌లో పలువురు ప్రముఖులు ఎస్పీబీ గురించి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. నేను మళ్లీ సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు? అనిపించే లోటును సృష్టించిన మహావ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు’’ అన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘బాలుగారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం ‘నేనంటే నేనే’కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. 16 భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలు మన తెలుగువాడు అవడం మన అదృష్టం’’ అన్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘బాలు ఎంత గొప్పవాడు అంటే దేశమంతా ఆయన పాటలు విని సంతృప్తిపడినవారు ఉన్నారు’’ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ‘‘అన్నయ్య బాలుతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది.
బాలూగారు అని నేను ఆయన్ని పిలిస్తే, అన్నయ్యా అని పిలవమన్నారు. సంగీతం ఉన్నంతవరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు’’ అన్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలూగారి గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు ఆయన’’ అన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. నాన్నగారు పై నుంచి మనకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్, సాయికుమార్, జీవితారాజశేఖర్, ఆర్పీ పట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్. శంకర్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, జేకే భారవి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తీరం పాటలు బాలూకి అంకితం
‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు మా ‘తీరం’ చిత్రంలో ‘అసలేంటీ ప్రేమ..’ పాట పాడారు. ఆయన పాడిన చివరి పాట మా సినిమానే కావడంతో చిత్రంలోని మిగిలిన 8 పాటలను ఆయనకు అంకితం ఇస్తున్నాం. ఈ పాటలను బాలూగారి ఫ్యాన్స్ కోసం ఉచితంగా ‘ఫ్రీ టు ఎయిర్’గా రిలీజ్ చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత అనిల్ ఇనమడుగు. శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నటించిన చిత్రం ‘తీరం’. ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, చిత్రసంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె, పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘురాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment