
జె.ఎల్. శ్రీనివాస్
‘‘నా పల్లె గొప్పది. నా పల్లె పాట ఇంకా గొప్పది. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. అందరూ పట్టణాలకొస్తే పల్లెల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? అని ప్రశ్నించే కథ, కథనాలతో మా సినిమా రూపొందనుంది’’ అని జె.ఎల్. శ్రీనివాస్ అన్నారు.
‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన జె.ఎల్. శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించనున్నారు. సుగుణమ్మ రామిరెడ్డి సమర్పణలో లక్ష్మి శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఝాన్సీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జె.ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పల్లె సంస్కృతి గొప్పదనం చాటి చెప్పే చిత్రమిది. కోనసీమ, అరకుతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు.