నన్ను కాపీ మాస్టర్ అంటారా: కమల్
తనను కాపీ మాస్టర్ అంటారా అంటూ కమల్ హాసన్ మండిపడ్డారు. ఎరిక్ లాఫోర్గ్ అనే ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ఆధారంగానే కమల్హాసన్ తన ఉత్తమవిలన్ పోస్టర్ను రూపొందించారంటూ వచ్చిన ఆరోపణల మీద ఆయన స్పందించారు. ''తెయ్యం కళ దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటిది. దానికి సంబంధించిన మేకప్ను ఓ మంచి కళాకారుడు చేశాడు.ఆయన ఈ కళకు సంబంధించి మూడో తరం కళాకారుడు. లైటింగ్ మాత్రం కొంత ఒకేలా ఉండొచ్చు. అంతమాత్రాన దాన్ని కాపీ అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా ఉంటుందంటే, ఇద్దరు ప్రేమికులు ఒకరి ఎదమీద ఒకరు తలవాల్చుకుని ఉంటే, వారు ఏక్ దూజే కే లియే సినిమా పోస్టర్ను కాపీ కొట్టారన్నట్లు చెప్పినట్లుంటుంది'' అని కమల్ అన్నారు.
తమిళనాడులోని కొత్తు సంప్రదాయానికి సంబంధించిన తెయ్యం డాన్సు ఫ్యుజన్ ఈ సినిమాలో ఉంటుందని, దానికి తగ్గట్లుగా ముఖానికి పెయింటింగ్ వేసుకోవడం అంత సులభం కాదని ఆయన చెప్పారు. ఇదేమీ మాస్కు కాదని, మొత్తం ముఖం మీద దాన్ని పెయింట్ చేయడానికి నాలుగు గంటలు పట్టిందని అన్నారు. ఇది అనేక తరాలుగా వస్తున్న సంప్రదాయమని ఆయన తెలిపారు. కామెడీ సినిమా చేయడానికి కూడా సిద్ధపడే ఓ సూపర్స్టార్ జీవితాన్ని తన సినిమా ప్రతిబింబిస్తుందని చెప్పారు.