దండాలు జగ్గన్నదొరా!
‘ఆ బ్రహ్మ కాదు కదా
అతడి అమ్మ దేవుడి వల్ల కూడా కాని పనిరా.
ఏంచేయాలన్నా...
దొర దొరతనం చేయాలా
దొర మగతనం చేయాలా’
‘దొరతనం’ గురించి జగ్గన్న దొరకు చాలా క్లారిటీ ఉంది. అంతే కాదు...తనకు ఎలాంటి వాడు నచ్చుతాడో అనేదాని గురించి కూడా పరమ క్లారిటీ ఉంది. ఒకరి చెంప చెళ్లుమనిపిస్తాడు. సదరు ఆ చెంపదెబ్బతిన్నవాడు ‘అమ్మో’ అని బాధగా ముఖం పెట్టవద్దు. చాలా సంతోషంగా కనిపించాలి. ‘నేను చెంపదెబ్బ కొడితే...మల్లెపువ్వు రుద్దుకున్నట్లు కమ్మగా ఉంది దొర అనేవాడు నాకు కావాలి.నేను చెప్పిన చోట వేలి ముద్రలు వేసే కుక్క కావాలి కాని...నా కాలి జాడ వెదికే తోడేళ్లు కాదు’ అంటాడు జగ్గన్న దొర.
‘ఎర్రమందారం’ సినిమాలో కన్నడ నటుడు దేవరాజ్‌ను చూస్తే...అచ్చం దొరను చూసినట్లే ఉంటుంది. ‘గ్రామీణ విలన్’గా నూటికి నూరుపాళ్లు సరిపోయే దేవరాజ్ ‘20వ శతాబ్దం’ ‘బంగారు బుల్లోడు’ ‘సమరసింహారెడ్డి’ ‘యజ్ఞం’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.హెచ్‌ఎంటీలో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన దేవరాజ్ ‘త్రిశూల’ అనే కన్నడ సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఏ ఆర్టిస్ట్‌కైనా మొదటి సినిమా హిట్ అయితే కెరీర్ ఊపందుకుంటుంది.
హిట్ కావడం మాటేమిటోగానీ దేవరాజ్ నటించిన మూడు సినిమాలు విడుదల కూడా కాలేదు. ఆ సమయంలోనే ‘ఇంద్రజిత్’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వచ్చింది. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేయడం ప్రారంభించారు. కొన్ని పాత్రలకు అవార్డులు కూడా వచ్చాయి. ‘వీరప్పన్’ అనే సినిమాలో చేసిన నెగెటివ్ రోల్‌కు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది.
‘ఆవేశ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన తరువాత హీరోగా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా అని హీరోగా మాత్రమే చేస్తానని భీష్మించుకొని కూర్చోలేదు.విలన్ అయినా, హీరో అయినా పాత్రలో సత్తా ఉంటే చేసుకుంటూ వెళ్లేవాడు. దీనికి కారణం...హీరోగా మాత్రమే చేస్తే...ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హీరో భవిష్యత్ అనేది సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్టిస్ట్‌గా ఎదగాలనుకునే వ్యక్తికి ఇది అడ్డు అనుకున్నారు దేవరాజ్. అందుకే కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా విలన్‌గా కూడా చేశారు.
సినిమాల్లోకి రాక ముందు దేవరాజ్ స్టేజీ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధుడు.‘నాటకాలు’ అనే బలమైన పునాది ఆయనకు ఉండడం వల్ల ‘పోలీస్ ఆఫీసర్’ రోల్ నుంచి ‘డాన్’ వరకు...రఫ్ అండ్ టఫ్ లుక్స్ నుంచి శాడిస్ట్ వరకు...ఏ పాత్ర అయినా అవలీలగా పోషించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవరాజ్.