‘ఉత్తమ విలన్’కు బ్రేక్ | Uttama Villain release further delayed | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ విలన్’కు బ్రేక్

Published Sat, May 2 2015 2:37 AM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

‘ఉత్తమ విలన్’కు బ్రేక్ - Sakshi

‘ఉత్తమ విలన్’కు బ్రేక్

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉలగనాయకన్ కమలహాసన్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఉత్తమవిలన్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెన్సార్ సర్టిఫికెట్ తదితర అన్ని హంగులు పూర్తిచేసుకుని శుక్రవారం (మే1న) రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు పూర్తిచేశారు.

వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీ పబ్లిసిటీ ఇచ్చారు. విదేశాల్లో సైతం సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. మూడురోజుల వరకు అన్నిషోలు ఫుల్ అయ్యా యి. శుక్రవారం ఉదయం 7 గంటలకే ప్రత్యేక షో ద్వారా అభిమానులను అలరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధం కాగా పెద్ద సంఖ్యలో కమల్ ఫ్యాన్స్ తరలివచ్చారు.

మేడే సందర్భంగా సెలవు కావడంతో సాధారణ ప్రజానీకం సైతం థియేటర్ల ముందు క్యూకట్టారు. అయితే ఇంతలో సినిమా విడుదల రద్దయినట్లు థియేటర్ల ముందు అకస్మాత్తుగా బోర్డు ప్రత్యక్షమైంది. ఉదయం 6 గంటల నుంచే థియేటర్ల ముందు పడిగాపులు కాసిన అభిమానులు ఈ పరిణామంతో ఖిన్నులైనారు. అడ్వాన్సు బుకింగ్ చేసుకున్న కమల్ అభిమానులు థియేటర్ల ముందు ఆందోళన జరిపారు. వేలాచ్చేరి ఫినిక్స్‌మాల్ లోని మొత్తం 9 థియేటర్లు ఉత్తమ విలన్ ప్రదర్శనకు సిద్ధంకాగా నాలుగు గంటలపాటూ ఎదురుచూసిన కమల్ అభిమానులు సినిమా వేస్తారా... వెయ్యరా అంటూ యాజమాన్యంతో వాదనకు దిగారు.

పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఇదే టికెట్టుపై శనివారం రాత్రి 7 గంటల షోకు సినిమాను చూడవచ్చని యాజమాన్యం నచ్చచెప్పడంతో అభిమానులు వెనుదిరిగారు. ఉత్తమవిలన్ చిత్రం విదేశాల్లో విడుదలై సమీక్షలు సైతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
హైకోర్టులో ఫైనాన్షియర్ పిటిషన్:  తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించకుండా సినిమా విడుదల చేసేందుకు వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ  చెన్నై వలసరవాక్కంకు చెందిన తంగరాజ్ మద్రాసు హైకోర్టులో గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. అందులో...తంగం సినిమాస్ అనే కంపెనీలో తాను భాగస్వామిగా ఉన్నానని, తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా సంస్థ ఎగ్జిక్యుటీవ్ డెరైక్టర్‌గా ఎన్ లింగుస్వామి, డెరైక్టర్‌గా సుభాష్ చంద్రబోస్ వ్యవహరిస్తున్నారని తెలిపారు.  

కమల్‌హాసన్ కథానాయకునిగా ఉత్తమవిలన్ చిత్ర నిర్మాణం కోసం వీరిద్దరూ తన వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాదికి 12 శాతం వడ్డిని సినిమా రిలీజుకు ముందు చెల్లించాలని, సినిమా కాపీహక్కులు, చెంగల్పట్టు ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకు అందజేయాలని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి భిన్నంగా సినిమా హక్కులు వేరే సంస్థకు కట్టబెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి తనవద్ద అప్పుగా తీసుకున్న రూ.2 కోట్లను వడ్డీ రూపేణా రూ.22 లక్షలను చెల్లించేవరకు ఉత్తమ విలన్ సినిమా మే 1వ తేదీన విడుదల చేయకుండా స్టే మంజూరు చేయాలని ఆ పిటిషన్‌లో కోర్టును కోరారు.

ఈ పిటిషన్ గత నెల 24వ తేదీన న్యాయమూర్తి కే రవిచంద్రబాబు ముందు విచారణకు రాగా, సినిమా రిలీజుకు ముందు పిటిషన్‌దారునికి అప్పు సొమ్ము చెల్లిస్తామని లింగుస్వామి తరపు న్యాయవాది తెలిపాడు. 29వ తేదీన మరోసారి పిటిషన్‌దారుడు కోర్టుకు హాజరై లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ తనకు చెక్కు రూపేణా ఇచ్చారని అభ్యంతరం లేవనెత్తాడు. ఇరుపక్షాల అభ్యర్థనమేరకు ఈ కేసును లోక్‌అదాలత్‌కు బదలాయిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
 
నిర్మాత లింగుస్వామి ఈ చిత్రం కోసం పలువురు ఫైనాన్షియర్ల వద్ద రూ.20 కోట్ల వరకు అప్పుతీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పు చెల్లించకుండా సినిమాను రిలీజ్ చేయరాదని ఫైనాన్షియర్లు పట్టుపట్టినట్లు సమాచారం. అప్పు ఇచ్చి న వారితో నిర్మాతల మండలి అధ్యక్షులు కలైపులి థాను శుక్రవారం చర్చలు ప్రారంభించారు. ఇరుపక్షాల మధ్య ఒక అంగీకారంతో త్వరలో ఉత్తమ విలన్ విడుదల చేస్తారని చెబుతున్నారు.
 
వివాదాల విలన్: ఉత్తమ విలన్ చిత్రం ఆది నుంచి వివాదాల మయమైంది. ఈ సినిమాలో కమల్ విచిత్ర వేషధారణ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ఫొటోలు సహా ప్రచురితమైనాయి. పుదియ తమిళగం కట్చి అధ్యక్షులు కృష్ణస్వామి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హిందూ దేవుళ్లను చిత్రంలో కించపరిచారంటూ కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కమల్ ఫొటోలను తగులబెట్టి ఆందోళన నిర్వహించారు.  అయితే వీటన్నింటినీ అధిగమించి ఉత్తమ విలన్ విడుదలకు సిద్ధమైనా అప్పు వ్యవహారంతో బ్రేక్ పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement