
ఎవరైతే నాకేంటి!
వృత్తిపరంగా, వ్యక్తిగతంగాగాని నటి ఆండ్రియా పోకడే వేరు. తన ఇష్టానుసారం నడుచుకునే ఆమె మనస్తత్వమే వేరు. ఎవరేమనుకుంటే నా కేంటి అన్నట్లుగా ఉంటుందామె ప్రవర్తన. ఉత్తమవిలన్ చిత్ర యూనిట్ ఆండ్రియా నుంచి అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చివరికి కమలహాసన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. అసలా కథేంటో చూద్దామా? కమలహాసన్ నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఇందులో పూజాకుమార్, ఆండ్రియా ప్రధాన హీరోయిన్లు. చిత్రం పలు ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు శుక్రవారం తెరపైకి రానుంది.
చిత్ర ప్రచారంలో కమలహాసన్ ముఖమే అధికంగా కనిపిస్తోంది. మరీ అయితే నటి పూజాకుమార్ ఫొటో అక్కడక్కడా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఆ చిత్రంలో మరో హీరోయిన్ అయిన ఆండ్రియాకు సహజంగానే మండింది. సరే సమయం వచ్చినప్పుడు ఆ ఆగ్రహ మంటల్ని బయటకు వెళ్లకక్కుదాం అని కాచుకూర్చున్నారు. అలాంటి సమయం రానే వచ్చింది. ఉత్తమవిలన్ చిత్ర విడుదల దగ్గరపడడంతో చిత్ర యూనిట్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆ విధంగా నటి ఆండ్రియాను ఆహ్వానించారు. ఆమె నుంచి చిత్ర యూనిట్‌కు నేను రాను పొమ్మనే సమాధానమే వచ్చింది. ఎంతగా ప్రయత్నించినా ఆండ్రియాససేమిరా అనడంతో చిత్ర వర్గాలు కమలహాసన్‌తో చెబుతామన్నారు. కమల్‌తోనే కాదు ఎవరితోనైనా చెప్పుకోండి అంటూ ఆండ్రియా ఖరాఖండిగా చెప్పారు. దీంతో చేసేదిలేక చిత్రవర్గాలు కమల్‌కు ఆండ్రియాపై ఫిర్యాదు చేయక తప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన కమల్ ఆండ్రియాకు నచ్చ చెప్పారని కోలీవుడ్ టాక్.