కోలీవుడ్‌లో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నటి ఆండ్రియా(Andrea Jeremiah) ఓకే చెప్పేస్తుంది. కానీ, మొదట తనకు నచ్చాలి. తనకు నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని, గీత రచయిత కూడా.. సంగీత పరిజ్ఞానం కలిగిన ఆండ్రియా బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ఈమె పాడిన పలు పాటలు సింగీతప్రియులను అలరించాయి. కాగా తాజాగా ఆండ్రియా ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేలా, కీర్తించే విధంగా ఒక ఆంథమ్‌ను రాసి పాడారు.
ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులు 2025 టీమ్ కోసం బ్రింగ్ ఇట్ హోమ్ పేరుతో రూపొందించిన ఆంగ్ల ఆంథం ఇది. క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా మంచి రిథమ్, మెలోడీ, ఎమోషన్‌తో కూడిన హైఎనర్జిటిక్‌గా రూపొందిన ఈ పాటను ఆండ్రియా, నజీఫ్ మహ్మద్ కలిసి రాశారు. దీనికి నకుల్ అభయంకర్ సంగీతాన్ని అందించారు. ఆంగ్ల పదాలతో కూడిన ఈ పాటలో తరికిట్ తరికిట తరికిట థోమ్ అనే ఇండియన్ బాణీ హుక్‌తో ధక్‌ధక్ ఉయ్ 'బ్రింగ్ ఇట్ హోమ్' ఆనే పల్లవితో సాగే గీతం క్రికెట్ క్రీడాకారుల హృదయ స్పందనను తెలియజేసేలా ఉంటుందన్నారు.
ఈ గీతం నవంబర్ 2న జరగనున్న ప్రపంచ మహిళా క్రికెట్ క్రీడ తుది పోరు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గీతం గురించి ఆండ్రియా తెలుపుతూ ఇది ఒక పాట మాత్రమే కాదని, పెద్దగా కలలు కనడంతోపాటు, కఠినంగా శ్రమించి విజయాన్ని ఇంటికి తీసుకొచ్చే ఒక మహిళ విజయం అని పేర్కొన్నారు.


