'సినిమా రచయితలంటే అంత చిన్నచూపా?'
భారతీయ సినిమా పరిశ్రమలో సినీ రచయితలను చిన్న చూపు చూస్తున్నారని ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు మొత్తం తామే చక్కబెట్టేయాలని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వస్తోందని అంటున్నారు. 'ఇక్కడ సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్కళ్లూ ఇతరుల పనిలో వేలు పెడతామంటారు. దర్శకులు తాము దర్శకత్వం వహించి, రాసి, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం.
సినిమాలోని ఇతర శాఖల్లో చాలా టాలెంట్ ఉంది. దాన్ని మనం వెలికితీసి, అందరితో ఆయా పనులు చేయించాలి. మన వద్ద మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసం వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను' అని రమేష్ అరవింద్ చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఉత్తమ విలన్ చిత్ర కథను కమల్ హాసన్ రాశారు.