Ramesh Aravind
-
'మా సినిమాలో ఎవరినీ కించపరచలేదు'
చెన్నై: కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్' సినిమాలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని దర్శకుడు రమేశ్ అరవింద్ తెలిపారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 'దర్శకుడిగా చెబుతున్నా. ఉత్తమ విలన్ సినిమాలో ఎవరి మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు, మాటలు లేవు. ఇది ఒక సూపర్ స్టార్ భావాలకు సంబంధించిన సినిమా. ఇందులో ఆయన ప్రయాణం, భావోద్వేగాల గురించి చూపించాం. పాటల్లోనూ ఏ మతానికి వ్యతిరేకంగా చూపించలేదు' అని రమేష్ అరవింద్ తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. సెన్సార్ బోర్డు తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని, సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని అన్నారు. మే 1న విడుదలకానున్న ఉత్తమ విలన్ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. -
హీరో, విలనూ నేనే
ఉత్తమ విలన్ చిత్రంలో నాయకుడిని, ప్రతి నాయకుడిని నేనేనన్నారు విశ్వనాయకుడు కమలహాసన్. ఈయన ద్విపాత్రాభినయంతో అబ్బురపరచే పాత్రలు అందించనున్న ఈ బ్రహ్మాండ సృష్టికి నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ లింగుస్వామి, చంద్రబోస్. కమలహాసన్ చిరకాల మిత్రుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్, దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కె.విశ్వనాథ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రి, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ తదితర ఐదుగురు నాయికలు నటించారు. ఇంకా నాజర్, భాస్కర్, జయరాం తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర హీరో కమల హాసన్ మంగళవారం ఉదయం స్థానిక ఆళ్వార్‌పేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మరపురాని చిత్రం ఉత్తమవిలన్ కమల్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఉత్తమ విలన్ తన సినీ కెరీర్లో మరపురాని చిత్రం. కథ గురించి చెప్పాలంటే ఇది రెండు కాల ఘట్టాలకు చెందిన కళాకారుల ఇతివృత్తం. ఈ రెండింటికి వారథి తన గురువు కె.బాలచందర్. ఆయన ఈ చిత్రంలో మార్గదర్శి అనే పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయాలన్న నిర్ణయాన్ని బాలచందర్ ముందుంచినప్పుడు ఆలోచించడానికి కొంచెం సమయం తీసుకుని ఓకే చెప్పారు. ఒక మృత్యుంజయుడు, కళాకారుడి గర్వాన్ని ఉత్తమ విలన్లో చూడవచ్చు. ప్రతి నటుడు ఏదో ఒక సన్నివేశంలో తనను చూసుకునే చిత్రం ఇది. హింసకు, అసభ్యతకు చిత్రంలో తావుండదు. హింసాత్మక సంఘటనలు ఉండరాదన్నది నా భావన కాదు. అయితే అలాంటి సన్నివేశాలకు ఉత్తమ విలన్లా అవసరం ఉండ దు. సరదాగా నవ్వుకునే హాస్యం మాత్రం ఉంటుంది. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఆయనది మనస్తాపం ఉన్న ఒక కళాకారుడి పాత్ర. డ్యూయెట్లు పాడితేనే నాయికలా? చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి మీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ వంటి ఐదుగురు కథానాయికలు. వీరిలో మీకు జోడీ ఎవరని అడుగుతున్నారు. హీరోలతో డ్యూయెట్లు పాడితేనే హీరోయిన్లా? ఉత్తమ విలన్ చిత్రంలో ఈ ఐదుగురు నాయికలు విభిన్న పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. బాలచందర్ ఏమి ఊహించారో తెలియదు ఉత్తమ విలన్ చిత్రం కోసం కె.బాలచందర్‌ను పదిరోజులు కాల్షీట్స్ కోరాం. అయితే నా సన్నివేశాల చిత్రీకరణ త్వరగా పూర్తి చేయి. త్వరగా డబ్బింగ్ ముగించు అనేవారు. ఆయనెందుకలా అన్నారో, ఏమి ఊహించారో తెలియదు. అలాగే ఈ చిత్రాన్ని తెరపై చూడాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఉత్తమవిలన్ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్కార్ రవిచంద్రన్‌తో మనస్పర్థలు లేవు స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం-2 ముందు గా విడుదల కావలసింది. ఆ చిత్రం విడుదల హక్కులు ఆస్కార్ రవిచంద్రన్ చేతులో వున్నాయి. ఆయన విడుదల చేయడానికి ఎందుకు ఆల్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయన చెప్పే కారణాలు నమ్మశక్యంగా లేవు. ఆస్కార్ రవిచంద్రన్‌తో నా కెలాంటి మనస్పర్థలు లేవు. నా చిత్రాల్లో తొలుత ఉత్తమవిలన్, ఆ తరువాత పాపనాశం చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. ఆ తరువాత విశ్వరూపం-2 ఉంటుంది. అప్పటికీ అది విడుదల కాకపోతే నేను నటించిన మరో చిత్రం వస్తుంది. సినిమా నిర్మాతకు వ్యాపారం సినిమా అనేది నటుడికి, దర్శకుడికి కళ. నిర్మాతకు మాత్రం అది వ్యాపారం. పెట్టుబడులు పెట్టి అప్పు చేసి చిత్రాలు తీస్తారు. అలాంటి చిత్రాలు కొనుగోలు చేసిన వారు నష్టాలంటూ డబ్బు చెల్లించమనడం సరైన పద్ధతి కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసి సగంలోనే నచ్చలేదంటూ టికెట్ డబ్బులు తిరిగిచ్చేయమంటే కుదురుతుందా? సినిమా కొన్నవాళ్లు ఉత్తమ విలన్ చిత్రం బాగుంటుందంటున్నారు కమల్. -
నేను వేరే గ్రహం నుంచి రాలేదు!
భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమలహాసన్ అంటే అతిశయోక్తి కాదు. ఒకే సినిమాలో దశావతారాల్లో కనిపించి, ఆ అవతారాలన్నింటికీ ఆహార్యంపరంగా, నటన పరంగా వ్యత్యాసం చూపించగల సత్తా ఉన్న నటుడు. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’లో సినీ నటుడిగా, థెయ్యమ్ కళాకారుడిగా ఒదిగిపోయారు. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి. కల్యాణ్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో కమలహాసన్,రమేశ్ అరవింద్, సి. కల్యాణ్, కుమార్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలహాసన్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఏ సినిమా చేయడానికైనా ఓ కారణం ఉంటుంది. మీరీ ‘ఉత్తమ విలన్’ చేయడానికి ప్రధాన కారణం? ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఎక్కువమందికి సినిమా చూపించాలి. భారీ వసూళ్లు రాబట్టాలి (నవ్వుతూ). అదే కారణం. అంతే కానీ, సమాజం కోసమే సినిమా చేశా అంటే ఓవర్‌గా ఉంటుంది. అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. డబ్బే ప్రధానం అనుకుంటే ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు. నీలి చిత్రాలు తీసి, ఇంటర్నెట్లో పెడితే చాలు సొమ్ము చేసుకోవచ్చు. కానీ, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా యాక్షన్ మూవీస్, లవ్‌స్టోరీస్, కామెడీ మూవీస్ తీసేవాళ్లు ఉంటారు.. అలాగే, ‘ఇదే రైట్ సినిమా..’ అంటూ వాళ్ల ఆలోచనా విధానానికి తగ్గ సినిమాలు చేసేవాళ్లు కొందరు ఉంటారు. నేనీ స్కూల్‌కి చెందినవాణ్ణి. బాలచందర్‌గారు, కె. విశ్వనాథ్‌గారు, దాసరిగార్లది ఈ స్కూలే. వాళ్ల శైలికి తగ్గ సినిమాలు తీసి, ఒప్పించారు. ‘ఉత్తమ విలన్’ రైట్ సినిమా అనిపించింది.. చేశా. అంటే, ‘నేను తీసిందే సినిమా’ అంటారా? ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకపోతే రిస్క్ కాదా? రిస్క్ లేని విషయం ఏదైనా ఉంటే చెప్పండి. నిత్యజీవితంలో మనం చేసే అన్ని పనుల్లోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సినిమా కూడా అంతే. మనసుకి నచ్చింది చేయాలి. ఇతరులకు నచ్చేవి చేయాలని మనకు నచ్చనిది చేస్తే, ‘సరైన సినిమా’ వచ్చే అవకాశం లేదు. అసలు ఫలానా సినిమా చేస్తే ‘రిస్క్’ అని ఎలా లెక్కలు వేయగలుగుతాం? ఇప్పుడు ‘అడవి రాముడు’ తీస్తే ఆడుతుందని గ్యారంటీ ఉందా? అలాగే ‘మరో చరిత్ర’ను ఇప్పుడు ఇష్టపడతారని బల్ల గుద్ది చెప్పగలరా? సో.. ‘ఇది రిస్క్... చేయొద్దు’ అని చెప్పే పండితుల మాటలను పట్టించుకోను. సో.. సినిమా సినిమాకీ ఏదో మార్పు ఉండాలనుకుంటారన్నమాట..? అవును. ఎందుకంటే, మార్పు అనేది ‘శాశ్వతం’ అని నమ్ముతాను. ఇవాళ్ల ఉన్నది రేపు మారిపోవచ్చు.. మూడో రోజు వేరే మార్పు వచ్చేస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టే శాశ్వతం అన్నాను. సినిమా సినిమాకీ వీలైనంత మార్పు చూపించడానికి ట్రై చేస్తా. దానికోసం ఎంతైనా కష్టపడతా. కొంతమంది వాదన మరో విధంగా ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే.. ఈ మాత్రం దానికి ఒళ్లు హూనం చేసుకోవడం ఎందుకు అనుకుంటారు. నేనలా అనుకోను. మరి.. ఓ సినిమా తీసేటప్పుడు మీరు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోను? అసలు నేనెవర్ని? నేను వేరే గ్రహం నుంచి వచ్చినవాణ్ణి కాదు కదా? ప్రేక్షకులు కూడా వేరే గ్రహం నుంచి ఊడిపడలేదుగా. మనందరం ఒకే గ్రహానికి చెందినవాళ్లమే. నేను కూడా ప్రేక్షకుణ్ణే కదా. ఒక ప్రేక్షకుడిగా నేను ‘మరోచరిత్ర’ చేశా. అది నా సాటి ప్రేక్షకులకు నచ్చింది. నేనే సినిమా చేసినా ప్రేక్షకుణ్ణి అనుకునే చేస్తా. మార్పు శాశ్వతం అన్నారు.. మార్పుల మీద మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల పాత్రలు చేశారు.. అలుపు రావడంలేదా? అది రానంతవరకూ నేను అదృష్టవంతుణ్ణి. అలుపు, సంతృప్తి.. ఈ రెండూ కళాకారులకు రాకూడదు. వచ్చిన క్షణం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నట్లే. నేను చేస్తున్న ‘మార్పు’ నేను చేసే సినిమాలు, పాత్రలకు సంబంధించినది. అసలు జీవితాన్ని విశ్లేషించుకుంటే, ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. సాంకేతికపరమైన మార్పు గురించి నేను మాట్లాడటంలేదు. జన్యుపరంగా వచ్చిన మార్పు గురించి చెబుతున్నా. ఒకప్పుడు మనం కోతులం. ఇప్పుడు మనుషులయ్యాం. గుహలో నివసించిన మనిషి తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. తన బొమ్మను తానే కెమేరాలో బంధించే స్థాయికి ఎదిగాడు. తెరపై బొమ్మలాట (సినిమా) చూపిస్తున్నాడు. ఇదంతా మార్పు ఫలితం. ప్రపంచం ఇంకా మారుతుంది. సంతృప్తి లభిస్తే కెరీర్ అంతే అంటున్నారు.. కానీ, ఏ పనిచేసినా ఎంతో కొంత సంతృప్తి లభించాలనుకుంటాం కదా.. మరి ‘ఉత్తమ విలన్’ ద్వారా లభించిన సంతృప్తి గురించి? ఈ సినిమా ద్వారా నాకో సంతృప్తి మిగిలింది. అదేంటంటే.. నా గురువుగారు, నేను తండ్రిలా భావించే బాలచందర్‌గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయే ముందు నా సినిమాలో చూపించాను. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆయన కాంబినేషన్లో ఫొటోలు దిగాను. నేను మా అమ్మమ్మ, నానమ్మలను ‘మీ నాన్నగారు ఎలా ఉండేవారు?.. ఫొటో చూపించండి’ అని నా చిన్నప్పుడు అడిగేవాణ్ణి. అప్పుడు వాళ్లు, ‘అప్పట్లో ఫొటోలు తీయాలని తెలియలేదు’ అనేవాళ్లు. నా గురువు, మా నాన్న బాలచందర్‌గారి గురించి ఎవరైనా అడిగితే.. నాకలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు ఫొటోలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలను తీసుకుంటే, ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం కోసమే హీరోకి ‘వెరైటీ గెటప్స్’ వేసి, పోస్టర్స్ విడుదల చేస్తుంటారు. కట్ చేస్తే.. ఆ గెటప్ ఏ పాటలోనో, ఒక్క సీన్లోనే వస్తుంది. మరి.. ‘ఉత్తమ విలన్’లోని మీ థెయ్యమ్ కళాకారుడి గెటప్ గురించి? సినిమాలో ఇది ఇలా వచ్చి అలా వెళ్లిపోయే గెటప్ కాదు. ఈ గెటప్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక, మీరన్నట్లు కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గెటప్స్ వేసి ఉండొచ్చు. అందులో తప్పేం ఉంది? అది కూడా కష్టమేనండి. ఎవరు సినిమా చేసినా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికే కదా. విలన్ అంటేనే ‘చెడ్డవాడు’. మరి.. ‘ఉత్తమ విలన్’ ఏంటి? మీ దృష్టి కోణంలో చూస్తే, కొంతమంది మీకు విలన్లా అనిపించొచ్చు. వాళ్లు నా దృష్టికి మంచివాళ్లుగా అనిపించొచ్చు. ఈ విలన్ అందరికీ మంచివాడిలానే అనిపిస్తాడు. అంటే.. అందరి ప్రేమా పొందే విలన్ అన్నమాట? అవును. ఇప్పుడు మీ అభిమాన హీరో ఉన్నాడనుకోండి.. అతను బాగా యాక్ట్ చేస్తే ‘చంపేశాడ్రా’ అంటారు. ప్రేమగా అనే మాట అది. ఈ విలన్ని కూడా ప్రేక్షకులు బాగా ప్రేమించి. ‘ఉత్తమ విలన్’ అని పొగుడుతారు. థెయ్యమ్ కళాకారుడి గెటప్ కోసం నాలుగైదు గంటలు మేకప్ వేసుకునేవారట.. ఇన్నేసి గంటలు మేకప్ డిమాండ్ చేసే పాత్రలు మీరు చాలానే చేస్తుంటారు? (నవ్వుతూ).. అన్ని గంటలు మేకప్ వేసుకోవాలనే లక్ష్యంతో నేనా పాత్రలు చేయడంలేదు. ఏ పాత్ర ఎంత మేకప్ డిమాండ్ చేస్తే.. అంత వేసుకుంటాను. ఏదైనా సరే కథానుగుణంగానే చేస్తా. ఎనిమిదో శతాబ్దం.. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందిన కథతో ‘ఉత్తమ విలన్’ తీసినట్లున్నారు. పునర్జన్మల నేపథ్యమేమో అనిపిస్తోంది.. అసలు మీరు పునర్జన్మలను నమ్ముతారా? అస్సలు నమ్మకం లేదు. అందుకే, నేను నమ్మనిదాన్ని నేను తీయను. ఈ చిత్రకథ ఎలా ఉంటుందో తెరపై చూస్తేనే బాగుంటుంది. ఒకసారి మీ చిన్ననాటి విశేషాలు తెలుసుకోవాలనుంది.. నాలుగైదేళ్ల వయసులో చేసిన సినిమాలు మీకు గుర్తున్నాయా? మీరు ‘ఉత్తమ విలన్’ గురించి భవిష్యత్తులో ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతాను. కానీ, చిన్నప్పుడు చేసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు పెద్దగా లేవు. ఎందుకంటే, అప్పుడు ఆడుతూ పాడుతూ చేసేవాణ్ణి. ఏవీయం స్టూడియోలో షూటింగ్ అనుకోండి.. ఆ స్టూడియోకి వెళ్లేవాణ్ణి. వెళ్లడం వెళ్లడమే మిగతా పిల్లలతో ఆడుకోవడం మొదలు పెట్టేవాణ్ణి. నాకోసం చెక్కతో బొమ్మ కత్తులు చేసిచ్చేవాళ్లు. వాటితో ఆడుకునేవాణ్ణి. మధ్య మధ్యలో సీన్ చేయడానికి పిలిచేవారు. అప్పుడు వెళ్లి అలా చేసి, ఇలా వచ్చి మళ్లీ ఆడుకునేవాణ్ణి (నవ్వుతూ). ఫైనల్‌గా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ ఏడాది ’ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’.. ఇలా మూడు చిత్రాల ద్వారా తెరపై కనిపించనున్నారు? నాలుగో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నానండీ. దీనికి బాలచందర్‌గారే ఆదర్శం. 1975లో ఆయన్నుంచి ఐదు సినిమాలొచ్చాయి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు ఆయనే నిర్వర్తించారు. అదెంత గొప్ప విషయం. పైగా అన్నీ హిట్సే. ఒకప్పుడు నేను కూడా చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఈ మధ్య కాస్త తగ్గింది. అందుకే, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచా. 50 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇంత పెద్ద స్టార్ అయ్యారు! అదే ఇప్పుడు పరిచయం అయ్యుంటే ఇదే స్థాయికి చేరుకునేవారా? అసలీ తరంలో ఈ స్థాయి స్టార్డమ్ సాధ్యమేనా? బాలచందర్‌లాంటి వ్యక్తి ఉంటే సాధ్యమే. ఆయన లేకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. కానీ, సినిమాల్లోనే ఉండేవాణ్ణి. కాకపోతే ఏ అసిస్టెంట్ డెరైక్టర్గానో, డాన్సర్గానో, ఫైనాన్షియర్గానో, డిస్ట్రిబ్యూటర్గానో ఉండేవాణ్ణి. ఒకవేళ ఇవేమీ చేయడం రాకపోతే సినిమా థియేటర్లో సినిమా ప్రేక్షకుడిగా సినిమాలు చూస్తుండేవాణ్ణి. నాకీ కళ అంటే అంత ఇష్టం. సినిమా మినహా నాకు వేరే ఏమీ తెలియదు. డి.జి. భవాని -
'సినిమా రచయితలంటే అంత చిన్నచూపా?'
భారతీయ సినిమా పరిశ్రమలో సినీ రచయితలను చిన్న చూపు చూస్తున్నారని ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు మొత్తం తామే చక్కబెట్టేయాలని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వస్తోందని అంటున్నారు. 'ఇక్కడ సమస్య ఏమిటంటే, ప్రతి ఒక్కళ్లూ ఇతరుల పనిలో వేలు పెడతామంటారు. దర్శకులు తాము దర్శకత్వం వహించి, రాసి, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం. సినిమాలోని ఇతర శాఖల్లో చాలా టాలెంట్ ఉంది. దాన్ని మనం వెలికితీసి, అందరితో ఆయా పనులు చేయించాలి. మన వద్ద మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసం వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను' అని రమేష్ అరవింద్ చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఉత్తమ విలన్ చిత్ర కథను కమల్ హాసన్ రాశారు. -
షూటింగ్లో కమలహాసన్‌కు గాయాలు
ప్రముఖ నటుడు కమలహాసన్ షూటింగ్లో ప్రమదం కారణంగా గాయాలకు గురయ్యారు. దీంతో ఉత్తమ విలన్ షూటింగ్ రద్దయిం ది. కమలహాసన్ తాజాగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమవిలన్ చిత్రా న్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం చిత్రంలో కమలహాసన్ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమా దం జరిగి ఆయన కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో షూటింగ్ రద్దు అయినట్లు దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. కమల్‌కు పూర్తిగా ఆర్యోగం చేకూరిన తరువాత ఉత్తమ విలన్ షూటింగ్ చేస్తామని ఆయన తెలిపారు. -
ఈ ఏడాదిలో కమల్ చిత్రాలు మూడు
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఆ తరువాత ఏడాది దాటి నా కొత్త చిత్రం ఏదీ ఇంత వరకు తెరపైకి రాలేదు. అయితే ఆయన ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు రానున్న ఈ ఆరు నెల ల్లోనే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం తరువాత కమల్ దానికి సీక్వెల్‌గా విశ్వరూపం-2 చిత్రం చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం రమేష్ అరవింద్ దర్శకత్వంలో దర్శక, నిర్మాత, లింగుసామి నిర్మిస్తున్న ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ట్లు కమల్ ఒక ఇంట ర్వ్యూలో తెలిపారు. ఆయన మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రం తమిళ రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటిం గ్ జూలైలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు జీతు జోసెఫ్ తెలి పారు. మలయాళంలో దృశ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన ఈయన తమిళ చిత్రానికి పని చేయనున్నారు. నటి గౌతమి హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాల తారాగణం, సాం కేతిక బృందం ఎంపిక జరుగుతోంది. చిత్రాన్ని జూలై రెండో వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా తమిళంలో పేరు నిర్ణయిం చని ఈ చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆరు నెలల్లో కమ ల్ నటించిన మూడు చిత్రాలు తెరపై రానున్నాయన్నమాట. ఇదే గనుక జరిగితే కమల్ హాసన్ నట జీవితంలో ఇది ఒక రికార్డ్‌నే అవుతుంది. -
మరుదనాయగమ్ ఎప్పటికైనా తీస్తా!
‘‘గత ఇరవయ్యేళ్లలో జరగనిది ఈ ఏడాది జరగనుంది. నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ 20 ఏళ్లల్లో ఇలా జరగలేదు’’ అని కమల్‌హాసన్ చెప్పారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. అలాగే, రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రం కూడా పూర్తి కావచ్చిందట. ఈ సినిమాల గురించే కమల్ ఈ విధంగా పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక తన పాఠకులకు కమల్‌ను ప్రశ్నించే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఓ పాఠకుడు ‘మరుదనాయగమ్’ని మధ్యలో ఆపేశారు.. మళ్లీ మొదలుపెడతారా? అని అడిగాడు... దానికి కమల్ సమాధానం చెబుతూ -‘‘అది నాక్కూడా తెలియదు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాల్సిన సినిమా. నాకు తెలిసి లోకల్ నిర్మాతల నుంచి భారీ బడ్జెట్ పొందే అవకాశం లేదు. ఎందుకంటే, ఇది లోకల్ మూవీ కాదు. తమిళ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించాల్సిన సినిమా. ఈ చిత్రాన్ని ఆపేయలేదు. ఎప్పుడు ఆరంభమైనా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అన్నారు. ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో ప్రారంభించారు కమల్. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధంతరంగా ఆపేశారు. మరి.. ‘మరుదనాయగమ్’ మళ్లీ ఎప్పుడు షూటింగ్ పట్టాలెక్కుతాడో వేచి చూడాల్సిందే. -
ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు!
పాత్ర కోసం శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడరు కమల్‌హాసన్. అందుకు మంచి ఉదాహరణ ‘విచిత్ర సోదరులు’. అందులో ‘అప్పూ’ పాత్ర కోసం కాళ్లు వెనక్కి మడిచి, మోకాళ్లకు బూట్లు తొడుక్కుని నటించారు కమల్. భారతీయుడు, భామనే సత్యభామనే, దశావతారం.. ఇలా విభిన్న అవతారాల్లో కమల్ కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ అవతారాలకు సంబంధించిన మేకప్ కోసం ఆయన గంటలు గంటలు వెచ్చించారు. తాజాగా, ‘ఉత్తమ విలన్’ చిత్రంలోని పాత్ర కోసం మేకప్‌కి ఐదు గంటలు కేటాయించనున్నారు కమల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఫొటోషూట్ చేశారు. ఈ చిత్రంలో కమల్ ఓ వెరైటీ లుక్‌లో కనిపిస్తారట. ఈ లుక్‌తోనే ఫొటోషూట్ జరిగిందని సమాచారం. ఈ లుక్ కోసమే కమల్ దాదాపు ఐదు గంటలు మేకప్‌కి కేటాయించారట. రెండు రోజుల పాటు ఈ ఫొటోషూట్ జరిగిందని, గెటప్‌కి సంబంధించి కమల్‌కి గౌతమి కొన్ని టిప్స్ ఇచ్చారని వినికిడి. -
కమల్‌తో ముద్దుకు సై
మహానటుడు కమల్‌హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది. డేట్స్ సర్దుబాటు చేయలేకే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నానని కాజల్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే... ఉన్నట్లుండి డైరీ ఖాళీ అయ్యిందో ఏమో... కమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాజల్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవే లేదని సమాచారం. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ పాత్రలే చేసిన కమల్ని కాస్తంత కొత్తగా రొమాంటిక్ యాంగిల్లో చూపించాలని తమిళ రచయిత క్రేజీ మోహన్ ఓ అద్భుతమైన కథను ఈ సినిమాకోసం తయారు చేశారట. కథ రీత్యా ఇందులో అధర చుంబనాలు కూడా ఉన్నాయని సమాచారం. వాటికి కూడా కాజల్ ‘సై’ అనేశారట. మరి రేపు దక్షిణాదిన ఈ సినిమా ఎన్ని సంచల నాలకు కేంద్రబిందువు కానుందో వేచిచూడాలి.