హీరో, విలనూ నేనే
ఉత్తమ విలన్ చిత్రంలో నాయకుడిని, ప్రతి నాయకుడిని నేనేనన్నారు విశ్వనాయకుడు కమలహాసన్. ఈయన ద్విపాత్రాభినయంతో అబ్బురపరచే పాత్రలు అందించనున్న ఈ బ్రహ్మాండ సృష్టికి నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ లింగుస్వామి, చంద్రబోస్. కమలహాసన్ చిరకాల మిత్రుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్, దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కె.విశ్వనాథ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రి, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ తదితర ఐదుగురు నాయికలు నటించారు. ఇంకా నాజర్, భాస్కర్, జయరాం తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర హీరో కమల హాసన్ మంగళవారం ఉదయం స్థానిక ఆళ్వార్‌పేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మరపురాని చిత్రం ఉత్తమవిలన్
కమల్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఉత్తమ విలన్ తన సినీ కెరీర్‌లో మరపురాని చిత్రం. కథ గురించి చెప్పాలంటే ఇది రెండు కాల ఘట్టాలకు చెందిన కళాకారుల ఇతివృత్తం. ఈ రెండింటికి వారథి తన గురువు కె.బాలచందర్. ఆయన ఈ చిత్రంలో మార్గదర్శి అనే పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయాలన్న నిర్ణయాన్ని బాలచందర్ ముందుంచినప్పుడు ఆలోచించడానికి కొంచెం సమయం తీసుకుని ఓకే చెప్పారు. ఒక మృత్యుంజయుడు, కళాకారుడి గర్వాన్ని ఉత్తమ విలన్‌లో చూడవచ్చు. ప్రతి నటుడు ఏదో ఒక సన్నివేశంలో తనను చూసుకునే చిత్రం ఇది. హింసకు, అసభ్యతకు చిత్రంలో తావుండదు. హింసాత్మక సంఘటనలు ఉండరాదన్నది నా భావన కాదు. అయితే అలాంటి సన్నివేశాలకు ఉత్తమ విలన్‌లా అవసరం ఉండ దు. సరదాగా నవ్వుకునే హాస్యం మాత్రం ఉంటుంది. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఆయనది మనస్తాపం ఉన్న ఒక కళాకారుడి పాత్ర.
డ్యూయెట్లు పాడితేనే నాయికలా?
చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి మీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ వంటి ఐదుగురు కథానాయికలు. వీరిలో మీకు జోడీ ఎవరని అడుగుతున్నారు. హీరోలతో డ్యూయెట్లు పాడితేనే హీరోయిన్లా? ఉత్తమ విలన్ చిత్రంలో ఈ ఐదుగురు నాయికలు విభిన్న పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు.
బాలచందర్ ఏమి ఊహించారో తెలియదు
ఉత్తమ విలన్ చిత్రం కోసం కె.బాలచందర్‌ను పదిరోజులు కాల్‌షీట్స్ కోరాం. అయితే నా సన్నివేశాల చిత్రీకరణ త్వరగా పూర్తి చేయి. త్వరగా డబ్బింగ్ ముగించు అనేవారు. ఆయనెందుకలా అన్నారో, ఏమి ఊహించారో తెలియదు. అలాగే ఈ చిత్రాన్ని తెరపై చూడాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఉత్తమవిలన్ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆస్కార్ రవిచంద్రన్‌తో మనస్పర్థలు లేవు
స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం-2 ముందు గా విడుదల కావలసింది. ఆ చిత్రం విడుదల హక్కులు ఆస్కార్ రవిచంద్రన్ చేతులో వున్నాయి. ఆయన విడుదల చేయడానికి ఎందుకు ఆల్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయన చెప్పే కారణాలు నమ్మశక్యంగా లేవు. ఆస్కార్ రవిచంద్రన్‌తో నా కెలాంటి మనస్పర్థలు లేవు. నా చిత్రాల్లో తొలుత ఉత్తమవిలన్, ఆ తరువాత పాపనాశం చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. ఆ తరువాత విశ్వరూపం-2 ఉంటుంది. అప్పటికీ అది విడుదల కాకపోతే నేను నటించిన మరో చిత్రం వస్తుంది.
సినిమా నిర్మాతకు వ్యాపారం
సినిమా అనేది నటుడికి, దర్శకుడికి కళ. నిర్మాతకు మాత్రం అది వ్యాపారం. పెట్టుబడులు పెట్టి అప్పు చేసి చిత్రాలు తీస్తారు. అలాంటి చిత్రాలు కొనుగోలు చేసిన వారు నష్టాలంటూ డబ్బు చెల్లించమనడం సరైన పద్ధతి కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసి సగంలోనే నచ్చలేదంటూ టికెట్ డబ్బులు తిరిగిచ్చేయమంటే కుదురుతుందా? సినిమా కొన్నవాళ్లు ఉత్తమ విలన్ చిత్రం బాగుంటుందంటున్నారు కమల్.