బిగ్‌ బాస్‌ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి | With Bigg Boss Issue Unknown Person Attack To Vanitha Vijayakumar | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌ ముఖంపై పిడిగుద్దులు

Published Sun, Nov 26 2023 11:52 AM | Last Updated on Mon, Nov 27 2023 4:06 PM

With Bigg Boss Issue Unknown Person  Attack To  Vanitha Vijayakumar - Sakshi

సౌత్‌ ఇండియా సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ తరుచూ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. 'దేవి' సినిమాతో ఆమె తెలుగు వాళ్లకు పరిచయం అయింది. అలా పలు సినిమాల్లో ఆమె నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు జోవిక బిగ్‌ బాస్‌-7 తమిళ్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. దీంతో జోవిక ట్రోలింగ్‌కు గురి అవుతూ రావడంతో వనిత విజయ్‌కుమార్‌ వాటిని తిప్పి కొడుతుంది. ఇలా ఆమె చుట్టూ కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో వనిత విజయ్‌కుమార్‌పై దాడి జరిగింది.

ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. నిన్న రాత్రి ఆమె ఎదుర్కొన్న సంఘటనను తెలిపింది.  బిగ్ బాస్ స్టార్ అభిమాని అంటూ ఓ వ్యక్తి తనను కొట్టాడని, తన ముఖం నుంచి రక్తం కూడా వచ్చిందని  వనితా విజయకుమార్ ఫోటోతో సహా ఇలా వెల్లడించింది.

'నాపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అతనెవరో దేవుడికి మాత్రమే తెలుసు. ఈ దాడికి పాల్పడింది బిగ్ బాస్ స్టార్ ప్రదీప్ ఆంటోనీ అభిమాని అని తెలుస్తోంది. అతన్ని విచారిస్తే అన్నీ విషయాలు బయటకొస్తాయి. రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్‌ ముగిసిన తర్వాత రివ్యూ చెప్పి నేను డిన్నర్ కోసం బయటకు వచ్చాను. తర్వాత మా అక్క సౌమ్య ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారును తీయడానికి వస్తుండగా చీకట్లోంచి ఓ వ్యక్తి వచ్చాడు. అప్పుడు అతను నాకు రెడ్ కార్డ్ గుర్తుందా..? అంటూ కొట్టాడు. రెడ్‌ కార్డ్‌ వివాదంలో మీ సపోర్ట్ కూడా ఉంది ఉంటూ పారిపోయాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది.

నా ముఖం నుంచి రక్తం వచ్చినప్పుడు, నేను అరుస్తూ ఏడ్చాను. అప్పుడు అర్ధరాత్రి ఒంటిగంట అయింది. కాబట్టి నా చుట్టూ ఎవరూ లేరు. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అక్క చెప్పింది. కానీ నేను వారిని అంతగా నమ్మను అందుకే ప్రస్తుతానికి నేను ఫిర్యాదు చేయలేదు. కానీ పోలీసుల వద్దకు తప్పకుండా వెళ్తాను.  ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకుని  అనంతరం ఇంటికి వెళ్లాను. నాపై ఎవరు దాడి చేశారో గుర్తించలేకపోయాను. పిచ్చివాడిలా అతని నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది. నేను ప్రస్తుతం ఆ గాయం నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను.. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఎందుకంటే నాకు శారీరకంగా బాగా లేదు. ఈ స్థితిలో తెర ముందుకు రావడం సాధ్యం కాదు.' అని వనిత చెబుతోంది.

కూతురు జోవిక వల్లే ఈ గొడవ జరిగిందా..?
తరువాత, వనిత తన ముఖంపై గాయాన్ని కూడా చూపించింది. ‘‘నేను ఎదుర్కొన్న క్రూరమైన దాడి ఇది. ధైర్యంగా ఈ పోస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ తమిళ్ కేవలం గేమ్ షో మాత్రమే. ఇలాంటి దాడి సరికాదు.' అని ఆమె చెప్పింది. కమల్ హాసన్ హాస్ట్‌గా ఉన్న తమిళ బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఈ షోలో వనిత కూతురు జోవిక కూడా పోటీ పడుతోంది. అదే షోలో తమిళ్‌ నటుడు ప్రదీప్‌ ఆంటోనీ అనే కంటెస్టెంట్‌ ఉన్నాడు.

ఆయనపై తోటి కంటెస్టెంట్లతో పాటు జోవిక కూడా గతంలో విమర్శలు చేసింది. ఆయన ఎప్పుడూ వాష్‌ రూమ్‌ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రతలేదని జోవిక ఆరోపించింది. దీంతో ఆంటోనీ ప్రదీప్‌కు కమల్‌ కూడా రెడ్‌ కార్డ్‌ జారీ చేశాడు. అప్పుడు ఆయన బిగ్‌ బాస్‌ మధ్యలోనే హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు. ఈ గొడవ వల్లే వనిత విజయ్‌కుమార్‌పై ప్రదీప్‌ అభిమానులు దాడి చేశారని తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ మాదిరే చూడాలి కానీ ఇలా దాడులు చేయడం వరకు వెళ్లడం ఏంటని నెటిజన్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement