నేను వేరే గ్రహం నుంచి రాలేదు! | Kamal Hassan Exclusive Interview about Uthama Villain | Sakshi
Sakshi News home page

నేను వేరే గ్రహం నుంచి రాలేదు!

Published Thu, Mar 19 2015 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

నేను వేరే గ్రహం నుంచి రాలేదు!

నేను వేరే గ్రహం నుంచి రాలేదు!

 భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమలహాసన్ అంటే అతిశయోక్తి కాదు. ఒకే సినిమాలో దశావతారాల్లో కనిపించి, ఆ అవతారాలన్నింటికీ ఆహార్యంపరంగా, నటన పరంగా వ్యత్యాసం చూపించగల సత్తా ఉన్న నటుడు. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’లో సినీ నటుడిగా, థెయ్యమ్ కళాకారుడిగా ఒదిగిపోయారు. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి. కల్యాణ్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో కమలహాసన్,రమేశ్ అరవింద్, సి. కల్యాణ్, కుమార్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలహాసన్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 ఏ సినిమా చేయడానికైనా ఓ కారణం ఉంటుంది. మీరీ ‘ఉత్తమ విలన్’ చేయడానికి ప్రధాన కారణం?
 ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఎక్కువమందికి సినిమా చూపించాలి. భారీ వసూళ్లు రాబట్టాలి (నవ్వుతూ). అదే కారణం. అంతే కానీ, సమాజం కోసమే సినిమా చేశా అంటే ఓవర్‌గా ఉంటుంది. అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. డబ్బే ప్రధానం అనుకుంటే ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు. నీలి చిత్రాలు తీసి, ఇంటర్నెట్‌లో పెడితే చాలు సొమ్ము చేసుకోవచ్చు. కానీ, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా యాక్షన్ మూవీస్, లవ్‌స్టోరీస్, కామెడీ మూవీస్ తీసేవాళ్లు ఉంటారు.. అలాగే, ‘ఇదే రైట్ సినిమా..’ అంటూ వాళ్ల ఆలోచనా విధానానికి తగ్గ సినిమాలు చేసేవాళ్లు కొందరు ఉంటారు. నేనీ స్కూల్‌కి చెందినవాణ్ణి. బాలచందర్‌గారు, కె. విశ్వనాథ్‌గారు, దాసరిగార్లది ఈ స్కూలే. వాళ్ల శైలికి తగ్గ సినిమాలు తీసి, ఒప్పించారు.
 
 ‘ఉత్తమ విలన్’ రైట్ సినిమా అనిపించింది.. చేశా. అంటే, ‘నేను తీసిందే సినిమా’ అంటారా? ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకపోతే రిస్క్ కాదా?
 రిస్క్ లేని విషయం ఏదైనా ఉంటే చెప్పండి. నిత్యజీవితంలో మనం చేసే అన్ని పనుల్లోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సినిమా కూడా అంతే. మనసుకి నచ్చింది చేయాలి. ఇతరులకు నచ్చేవి చేయాలని మనకు నచ్చనిది చేస్తే, ‘సరైన సినిమా’ వచ్చే అవకాశం లేదు. అసలు ఫలానా సినిమా చేస్తే ‘రిస్క్’ అని ఎలా లెక్కలు వేయగలుగుతాం? ఇప్పుడు ‘అడవి రాముడు’ తీస్తే ఆడుతుందని గ్యారంటీ ఉందా? అలాగే  ‘మరో చరిత్ర’ను ఇప్పుడు ఇష్టపడతారని బల్ల గుద్ది చెప్పగలరా? సో.. ‘ఇది రిస్క్... చేయొద్దు’ అని చెప్పే పండితుల మాటలను పట్టించుకోను.
 
 సో.. సినిమా సినిమాకీ ఏదో మార్పు ఉండాలనుకుంటారన్నమాట..?
 అవును. ఎందుకంటే, మార్పు అనేది ‘శాశ్వతం’ అని నమ్ముతాను. ఇవాళ్ల ఉన్నది రేపు మారిపోవచ్చు.. మూడో రోజు వేరే మార్పు వచ్చేస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టే శాశ్వతం అన్నాను. సినిమా సినిమాకీ వీలైనంత మార్పు చూపించడానికి ట్రై చేస్తా. దానికోసం ఎంతైనా కష్టపడతా. కొంతమంది వాదన మరో విధంగా ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే.. ఈ మాత్రం దానికి ఒళ్లు హూనం చేసుకోవడం ఎందుకు అనుకుంటారు. నేనలా అనుకోను.
 
 మరి.. ఓ సినిమా తీసేటప్పుడు మీరు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోరా?
 ఎందుకు పెట్టుకోను? అసలు నేనెవర్ని? నేను వేరే గ్రహం నుంచి వచ్చినవాణ్ణి కాదు కదా? ప్రేక్షకులు కూడా వేరే గ్రహం నుంచి ఊడిపడలేదుగా. మనందరం ఒకే గ్రహానికి చెందినవాళ్లమే. నేను కూడా ప్రేక్షకుణ్ణే కదా. ఒక ప్రేక్షకుడిగా నేను ‘మరోచరిత్ర’ చేశా. అది నా సాటి ప్రేక్షకులకు నచ్చింది. నేనే సినిమా చేసినా ప్రేక్షకుణ్ణి అనుకునే చేస్తా.
 
 మార్పు శాశ్వతం అన్నారు.. మార్పుల మీద మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల పాత్రలు చేశారు.. అలుపు రావడంలేదా?
 అది రానంతవరకూ నేను అదృష్టవంతుణ్ణి. అలుపు, సంతృప్తి.. ఈ రెండూ కళాకారులకు రాకూడదు. వచ్చిన క్షణం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నట్లే. నేను చేస్తున్న ‘మార్పు’ నేను చేసే సినిమాలు, పాత్రలకు సంబంధించినది. అసలు జీవితాన్ని విశ్లేషించుకుంటే, ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. సాంకేతికపరమైన మార్పు గురించి నేను మాట్లాడటంలేదు. జన్యుపరంగా వచ్చిన మార్పు గురించి చెబుతున్నా. ఒకప్పుడు మనం కోతులం. ఇప్పుడు మనుషులయ్యాం. గుహలో నివసించిన మనిషి  తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. తన బొమ్మను తానే కెమేరాలో బంధించే స్థాయికి ఎదిగాడు. తెరపై బొమ్మలాట (సినిమా) చూపిస్తున్నాడు. ఇదంతా మార్పు ఫలితం. ప్రపంచం ఇంకా మారుతుంది.
 
 సంతృప్తి లభిస్తే కెరీర్ అంతే అంటున్నారు.. కానీ, ఏ పనిచేసినా ఎంతో కొంత సంతృప్తి లభించాలనుకుంటాం కదా.. మరి ‘ఉత్తమ విలన్’ ద్వారా లభించిన సంతృప్తి గురించి?

 ఈ సినిమా ద్వారా నాకో సంతృప్తి మిగిలింది. అదేంటంటే.. నా గురువుగారు, నేను తండ్రిలా భావించే బాలచందర్‌గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయే ముందు నా సినిమాలో చూపించాను. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆయన కాంబినేషన్లో ఫొటోలు దిగాను. నేను మా అమ్మమ్మ, నానమ్మలను ‘మీ నాన్నగారు ఎలా ఉండేవారు?.. ఫొటో చూపించండి’ అని నా చిన్నప్పుడు అడిగేవాణ్ణి. అప్పుడు వాళ్లు, ‘అప్పట్లో ఫొటోలు తీయాలని తెలియలేదు’ అనేవాళ్లు. నా గురువు, మా నాన్న బాలచందర్‌గారి గురించి ఎవరైనా అడిగితే.. నాకలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు ఫొటోలు కూడా ఉన్నాయి.
 
 కొన్ని సినిమాలను తీసుకుంటే, ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం కోసమే హీరోకి ‘వెరైటీ గెటప్స్’ వేసి, పోస్టర్స్ విడుదల చేస్తుంటారు. కట్ చేస్తే.. ఆ గెటప్ ఏ పాటలోనో, ఒక్క సీన్‌లోనే వస్తుంది. మరి.. ‘ఉత్తమ విలన్’లోని మీ థెయ్యమ్ కళాకారుడి గెటప్ గురించి?
 సినిమాలో ఇది ఇలా వచ్చి అలా వెళ్లిపోయే గెటప్ కాదు. ఈ గెటప్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక, మీరన్నట్లు కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గెటప్స్ వేసి ఉండొచ్చు. అందులో తప్పేం ఉంది? అది కూడా కష్టమేనండి. ఎవరు సినిమా చేసినా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికే కదా.
 
 విలన్ అంటేనే ‘చెడ్డవాడు’. మరి.. ‘ఉత్తమ విలన్’ ఏంటి?
 మీ దృష్టి కోణంలో చూస్తే, కొంతమంది మీకు విలన్‌లా అనిపించొచ్చు. వాళ్లు నా దృష్టికి మంచివాళ్లుగా అనిపించొచ్చు. ఈ విలన్ అందరికీ మంచివాడిలానే అనిపిస్తాడు.
 
 అంటే.. అందరి ప్రేమా పొందే విలన్ అన్నమాట?
 అవును. ఇప్పుడు మీ అభిమాన హీరో ఉన్నాడనుకోండి.. అతను బాగా యాక్ట్ చేస్తే ‘చంపేశాడ్రా’ అంటారు. ప్రేమగా అనే మాట అది. ఈ విలన్‌ని కూడా ప్రేక్షకులు బాగా ప్రేమించి. ‘ఉత్తమ విలన్’ అని పొగుడుతారు.
 
 థెయ్యమ్ కళాకారుడి గెటప్ కోసం నాలుగైదు గంటలు మేకప్ వేసుకునేవారట.. ఇన్నేసి గంటలు మేకప్ డిమాండ్ చేసే పాత్రలు మీరు చాలానే చేస్తుంటారు?
 (నవ్వుతూ).. అన్ని గంటలు మేకప్ వేసుకోవాలనే లక్ష్యంతో నేనా పాత్రలు చేయడంలేదు. ఏ పాత్ర ఎంత మేకప్ డిమాండ్ చేస్తే.. అంత వేసుకుంటాను. ఏదైనా సరే కథానుగుణంగానే చేస్తా.
 
 ఎనిమిదో శతాబ్దం.. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందిన కథతో ‘ఉత్తమ విలన్’ తీసినట్లున్నారు. పునర్జన్మల నేపథ్యమేమో అనిపిస్తోంది.. అసలు మీరు పునర్జన్మలను నమ్ముతారా?
 అస్సలు నమ్మకం లేదు. అందుకే, నేను నమ్మనిదాన్ని నేను తీయను. ఈ చిత్రకథ ఎలా ఉంటుందో తెరపై చూస్తేనే బాగుంటుంది.
 
 ఒకసారి మీ చిన్ననాటి విశేషాలు తెలుసుకోవాలనుంది.. నాలుగైదేళ్ల వయసులో చేసిన సినిమాలు మీకు గుర్తున్నాయా?
 మీరు ‘ఉత్తమ విలన్’ గురించి భవిష్యత్తులో ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతాను. కానీ, చిన్నప్పుడు చేసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు పెద్దగా లేవు. ఎందుకంటే, అప్పుడు ఆడుతూ పాడుతూ చేసేవాణ్ణి. ఏవీయం స్టూడియోలో షూటింగ్ అనుకోండి.. ఆ స్టూడియోకి వెళ్లేవాణ్ణి. వెళ్లడం వెళ్లడమే మిగతా పిల్లలతో ఆడుకోవడం మొదలు పెట్టేవాణ్ణి. నాకోసం చెక్కతో బొమ్మ కత్తులు చేసిచ్చేవాళ్లు. వాటితో ఆడుకునేవాణ్ణి. మధ్య మధ్యలో సీన్ చేయడానికి పిలిచేవారు. అప్పుడు వెళ్లి అలా చేసి, ఇలా వచ్చి మళ్లీ ఆడుకునేవాణ్ణి (నవ్వుతూ).
 
 ఫైనల్‌గా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ ఏడాది ’ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’.. ఇలా మూడు చిత్రాల ద్వారా తెరపై కనిపించనున్నారు?
 నాలుగో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నానండీ. దీనికి బాలచందర్‌గారే ఆదర్శం. 1975లో ఆయన్నుంచి ఐదు సినిమాలొచ్చాయి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు ఆయనే నిర్వర్తించారు. అదెంత గొప్ప విషయం. పైగా అన్నీ హిట్సే. ఒకప్పుడు నేను కూడా చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఈ మధ్య కాస్త తగ్గింది. అందుకే, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచా.
 
 50 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇంత పెద్ద స్టార్ అయ్యారు! అదే ఇప్పుడు పరిచయం అయ్యుంటే ఇదే స్థాయికి చేరుకునేవారా? అసలీ తరంలో ఈ స్థాయి స్టార్‌డమ్ సాధ్యమేనా?
 బాలచందర్‌లాంటి వ్యక్తి ఉంటే సాధ్యమే. ఆయన లేకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. కానీ, సినిమాల్లోనే ఉండేవాణ్ణి. కాకపోతే ఏ అసిస్టెంట్ డెరైక్టర్‌గానో, డాన్సర్‌గానో, ఫైనాన్షియర్‌గానో, డిస్ట్రిబ్యూటర్‌గానో ఉండేవాణ్ణి. ఒకవేళ ఇవేమీ చేయడం రాకపోతే సినిమా థియేటర్‌లో సినిమా ప్రేక్షకుడిగా సినిమాలు చూస్తుండేవాణ్ణి. నాకీ కళ అంటే అంత ఇష్టం. సినిమా మినహా నాకు వేరే ఏమీ తెలియదు.
 డి.జి. భవాని
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement