Uthama Villain
-
కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ
కమలహాసన్‌తో నటుడు ధనుష్ భార్య ఐశ్వర్యా ఢీ కొంటున్నారు. సాధారణంగా ఒక భారీ చిత్రం విడుదలవుతుందంటే చిన్న చిత్రాలను ఆ సమయంలో విడుదల చేయడానికి ఆలోచిస్తారు. అయితే గత శుక్రవారం మణిరత్నం చిత్రం ఓ కాదల్ కణ్మణి, లారెన్స్ చిత్రం కాంచన -2 చిత్రాలు ఒకేరోజు తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయబాటలో పయనిస్తున్నాయి. తాజగా విశ్వనాయకుడు కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రం ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వం వహించిన వై రాజా వై చిత్రాలు ఒకే రోజు తెరపైకి రానున్నాయి. ఉత్తమవిలన్: విశ్వరూపం వంటి విజ యవంతమైన చిత్రం తరువాత కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ మేనె ల ఒకటో తారీఖున విడుదల కానుంది. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రి య, ఊర్వశి, పార్వతినాయర్, పార్వతి మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నటుడు రమేష్ అరవింద్ దర్శకుడు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో ఆయ న సోదరుడు సుభాష్ చంద్రబోస్ నిర్మిం చిన భారీ చిత్రం ఉత్తమవిలన్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 18వ శతాబ్దం ప్రస్తుత కాలానికి చెందిన సంఘటనలతో కూడిన నాటక, సినీ కళాకారుల ఇతివృత్తంగా రూపొం దించిన చిత్రం ఉత్తమవిలన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వై రాజా వై : 3 వంటి సంచలన ప్రేమ కథా చిత్రాల ద్వారా దర్శకురాలిగా పరి చయమైన ఐశ్వర్యా ధనుష్ ఆ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్న అందులోని వై దిస్ కొలవెరి పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా బహుళ ప్రచారం పొందిన చిత్రం 3. తరువాత ఐశ్వర్య ధనుష్ తెరకెక్కించిన చిత్రం వై రాజా వై. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తమవిలన్ విడుదలవుతున్న రోజునే విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాల మధ్య పోటీ తెలియాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే. -
కష్టాల్లో కమల్
-
హీరో, విలనూ నేనే
ఉత్తమ విలన్ చిత్రంలో నాయకుడిని, ప్రతి నాయకుడిని నేనేనన్నారు విశ్వనాయకుడు కమలహాసన్. ఈయన ద్విపాత్రాభినయంతో అబ్బురపరచే పాత్రలు అందించనున్న ఈ బ్రహ్మాండ సృష్టికి నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ లింగుస్వామి, చంద్రబోస్. కమలహాసన్ చిరకాల మిత్రుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్, దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కె.విశ్వనాథ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రి, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ తదితర ఐదుగురు నాయికలు నటించారు. ఇంకా నాజర్, భాస్కర్, జయరాం తదితరులు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర హీరో కమల హాసన్ మంగళవారం ఉదయం స్థానిక ఆళ్వార్‌పేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మరపురాని చిత్రం ఉత్తమవిలన్ కమల్ చిత్ర వివరాలు వెల్లడిస్తూ ఉత్తమ విలన్ తన సినీ కెరీర్లో మరపురాని చిత్రం. కథ గురించి చెప్పాలంటే ఇది రెండు కాల ఘట్టాలకు చెందిన కళాకారుల ఇతివృత్తం. ఈ రెండింటికి వారథి తన గురువు కె.బాలచందర్. ఆయన ఈ చిత్రంలో మార్గదర్శి అనే పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయాలన్న నిర్ణయాన్ని బాలచందర్ ముందుంచినప్పుడు ఆలోచించడానికి కొంచెం సమయం తీసుకుని ఓకే చెప్పారు. ఒక మృత్యుంజయుడు, కళాకారుడి గర్వాన్ని ఉత్తమ విలన్లో చూడవచ్చు. ప్రతి నటుడు ఏదో ఒక సన్నివేశంలో తనను చూసుకునే చిత్రం ఇది. హింసకు, అసభ్యతకు చిత్రంలో తావుండదు. హింసాత్మక సంఘటనలు ఉండరాదన్నది నా భావన కాదు. అయితే అలాంటి సన్నివేశాలకు ఉత్తమ విలన్లా అవసరం ఉండ దు. సరదాగా నవ్వుకునే హాస్యం మాత్రం ఉంటుంది. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఆయనది మనస్తాపం ఉన్న ఒక కళాకారుడి పాత్ర. డ్యూయెట్లు పాడితేనే నాయికలా? చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి మీనన్, ఊర్వశి, పార్వతి నాయర్ వంటి ఐదుగురు కథానాయికలు. వీరిలో మీకు జోడీ ఎవరని అడుగుతున్నారు. హీరోలతో డ్యూయెట్లు పాడితేనే హీరోయిన్లా? ఉత్తమ విలన్ చిత్రంలో ఈ ఐదుగురు నాయికలు విభిన్న పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. జిబ్రాన్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. బాలచందర్ ఏమి ఊహించారో తెలియదు ఉత్తమ విలన్ చిత్రం కోసం కె.బాలచందర్‌ను పదిరోజులు కాల్షీట్స్ కోరాం. అయితే నా సన్నివేశాల చిత్రీకరణ త్వరగా పూర్తి చేయి. త్వరగా డబ్బింగ్ ముగించు అనేవారు. ఆయనెందుకలా అన్నారో, ఏమి ఊహించారో తెలియదు. అలాగే ఈ చిత్రాన్ని తెరపై చూడాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఉత్తమవిలన్ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆస్కార్ రవిచంద్రన్‌తో మనస్పర్థలు లేవు స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం-2 ముందు గా విడుదల కావలసింది. ఆ చిత్రం విడుదల హక్కులు ఆస్కార్ రవిచంద్రన్ చేతులో వున్నాయి. ఆయన విడుదల చేయడానికి ఎందుకు ఆల్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఆయన చెప్పే కారణాలు నమ్మశక్యంగా లేవు. ఆస్కార్ రవిచంద్రన్‌తో నా కెలాంటి మనస్పర్థలు లేవు. నా చిత్రాల్లో తొలుత ఉత్తమవిలన్, ఆ తరువాత పాపనాశం చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. ఆ తరువాత విశ్వరూపం-2 ఉంటుంది. అప్పటికీ అది విడుదల కాకపోతే నేను నటించిన మరో చిత్రం వస్తుంది. సినిమా నిర్మాతకు వ్యాపారం సినిమా అనేది నటుడికి, దర్శకుడికి కళ. నిర్మాతకు మాత్రం అది వ్యాపారం. పెట్టుబడులు పెట్టి అప్పు చేసి చిత్రాలు తీస్తారు. అలాంటి చిత్రాలు కొనుగోలు చేసిన వారు నష్టాలంటూ డబ్బు చెల్లించమనడం సరైన పద్ధతి కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసి సగంలోనే నచ్చలేదంటూ టికెట్ డబ్బులు తిరిగిచ్చేయమంటే కుదురుతుందా? సినిమా కొన్నవాళ్లు ఉత్తమ విలన్ చిత్రం బాగుంటుందంటున్నారు కమల్. -
నేను వేరే గ్రహం నుంచి రాలేదు!
భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమలహాసన్ అంటే అతిశయోక్తి కాదు. ఒకే సినిమాలో దశావతారాల్లో కనిపించి, ఆ అవతారాలన్నింటికీ ఆహార్యంపరంగా, నటన పరంగా వ్యత్యాసం చూపించగల సత్తా ఉన్న నటుడు. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’లో సినీ నటుడిగా, థెయ్యమ్ కళాకారుడిగా ఒదిగిపోయారు. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి. కల్యాణ్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో కమలహాసన్,రమేశ్ అరవింద్, సి. కల్యాణ్, కుమార్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలహాసన్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఏ సినిమా చేయడానికైనా ఓ కారణం ఉంటుంది. మీరీ ‘ఉత్తమ విలన్’ చేయడానికి ప్రధాన కారణం? ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. ఎక్కువమందికి సినిమా చూపించాలి. భారీ వసూళ్లు రాబట్టాలి (నవ్వుతూ). అదే కారణం. అంతే కానీ, సమాజం కోసమే సినిమా చేశా అంటే ఓవర్‌గా ఉంటుంది. అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. డబ్బే ప్రధానం అనుకుంటే ఎలాంటి సినిమాలైనా చేయొచ్చు. నీలి చిత్రాలు తీసి, ఇంటర్నెట్లో పెడితే చాలు సొమ్ము చేసుకోవచ్చు. కానీ, సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా యాక్షన్ మూవీస్, లవ్‌స్టోరీస్, కామెడీ మూవీస్ తీసేవాళ్లు ఉంటారు.. అలాగే, ‘ఇదే రైట్ సినిమా..’ అంటూ వాళ్ల ఆలోచనా విధానానికి తగ్గ సినిమాలు చేసేవాళ్లు కొందరు ఉంటారు. నేనీ స్కూల్‌కి చెందినవాణ్ణి. బాలచందర్‌గారు, కె. విశ్వనాథ్‌గారు, దాసరిగార్లది ఈ స్కూలే. వాళ్ల శైలికి తగ్గ సినిమాలు తీసి, ఒప్పించారు. ‘ఉత్తమ విలన్’ రైట్ సినిమా అనిపించింది.. చేశా. అంటే, ‘నేను తీసిందే సినిమా’ అంటారా? ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకపోతే రిస్క్ కాదా? రిస్క్ లేని విషయం ఏదైనా ఉంటే చెప్పండి. నిత్యజీవితంలో మనం చేసే అన్ని పనుల్లోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. సినిమా కూడా అంతే. మనసుకి నచ్చింది చేయాలి. ఇతరులకు నచ్చేవి చేయాలని మనకు నచ్చనిది చేస్తే, ‘సరైన సినిమా’ వచ్చే అవకాశం లేదు. అసలు ఫలానా సినిమా చేస్తే ‘రిస్క్’ అని ఎలా లెక్కలు వేయగలుగుతాం? ఇప్పుడు ‘అడవి రాముడు’ తీస్తే ఆడుతుందని గ్యారంటీ ఉందా? అలాగే ‘మరో చరిత్ర’ను ఇప్పుడు ఇష్టపడతారని బల్ల గుద్ది చెప్పగలరా? సో.. ‘ఇది రిస్క్... చేయొద్దు’ అని చెప్పే పండితుల మాటలను పట్టించుకోను. సో.. సినిమా సినిమాకీ ఏదో మార్పు ఉండాలనుకుంటారన్నమాట..? అవును. ఎందుకంటే, మార్పు అనేది ‘శాశ్వతం’ అని నమ్ముతాను. ఇవాళ్ల ఉన్నది రేపు మారిపోవచ్చు.. మూడో రోజు వేరే మార్పు వచ్చేస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టే శాశ్వతం అన్నాను. సినిమా సినిమాకీ వీలైనంత మార్పు చూపించడానికి ట్రై చేస్తా. దానికోసం ఎంతైనా కష్టపడతా. కొంతమంది వాదన మరో విధంగా ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే.. ఈ మాత్రం దానికి ఒళ్లు హూనం చేసుకోవడం ఎందుకు అనుకుంటారు. నేనలా అనుకోను. మరి.. ఓ సినిమా తీసేటప్పుడు మీరు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోను? అసలు నేనెవర్ని? నేను వేరే గ్రహం నుంచి వచ్చినవాణ్ణి కాదు కదా? ప్రేక్షకులు కూడా వేరే గ్రహం నుంచి ఊడిపడలేదుగా. మనందరం ఒకే గ్రహానికి చెందినవాళ్లమే. నేను కూడా ప్రేక్షకుణ్ణే కదా. ఒక ప్రేక్షకుడిగా నేను ‘మరోచరిత్ర’ చేశా. అది నా సాటి ప్రేక్షకులకు నచ్చింది. నేనే సినిమా చేసినా ప్రేక్షకుణ్ణి అనుకునే చేస్తా. మార్పు శాశ్వతం అన్నారు.. మార్పుల మీద మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల పాత్రలు చేశారు.. అలుపు రావడంలేదా? అది రానంతవరకూ నేను అదృష్టవంతుణ్ణి. అలుపు, సంతృప్తి.. ఈ రెండూ కళాకారులకు రాకూడదు. వచ్చిన క్షణం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నట్లే. నేను చేస్తున్న ‘మార్పు’ నేను చేసే సినిమాలు, పాత్రలకు సంబంధించినది. అసలు జీవితాన్ని విశ్లేషించుకుంటే, ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. సాంకేతికపరమైన మార్పు గురించి నేను మాట్లాడటంలేదు. జన్యుపరంగా వచ్చిన మార్పు గురించి చెబుతున్నా. ఒకప్పుడు మనం కోతులం. ఇప్పుడు మనుషులయ్యాం. గుహలో నివసించిన మనిషి తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. తన బొమ్మను తానే కెమేరాలో బంధించే స్థాయికి ఎదిగాడు. తెరపై బొమ్మలాట (సినిమా) చూపిస్తున్నాడు. ఇదంతా మార్పు ఫలితం. ప్రపంచం ఇంకా మారుతుంది. సంతృప్తి లభిస్తే కెరీర్ అంతే అంటున్నారు.. కానీ, ఏ పనిచేసినా ఎంతో కొంత సంతృప్తి లభించాలనుకుంటాం కదా.. మరి ‘ఉత్తమ విలన్’ ద్వారా లభించిన సంతృప్తి గురించి? ఈ సినిమా ద్వారా నాకో సంతృప్తి మిగిలింది. అదేంటంటే.. నా గురువుగారు, నేను తండ్రిలా భావించే బాలచందర్‌గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయే ముందు నా సినిమాలో చూపించాను. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆయన కాంబినేషన్లో ఫొటోలు దిగాను. నేను మా అమ్మమ్మ, నానమ్మలను ‘మీ నాన్నగారు ఎలా ఉండేవారు?.. ఫొటో చూపించండి’ అని నా చిన్నప్పుడు అడిగేవాణ్ణి. అప్పుడు వాళ్లు, ‘అప్పట్లో ఫొటోలు తీయాలని తెలియలేదు’ అనేవాళ్లు. నా గురువు, మా నాన్న బాలచందర్‌గారి గురించి ఎవరైనా అడిగితే.. నాకలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు ఫొటోలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలను తీసుకుంటే, ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం కోసమే హీరోకి ‘వెరైటీ గెటప్స్’ వేసి, పోస్టర్స్ విడుదల చేస్తుంటారు. కట్ చేస్తే.. ఆ గెటప్ ఏ పాటలోనో, ఒక్క సీన్లోనే వస్తుంది. మరి.. ‘ఉత్తమ విలన్’లోని మీ థెయ్యమ్ కళాకారుడి గెటప్ గురించి? సినిమాలో ఇది ఇలా వచ్చి అలా వెళ్లిపోయే గెటప్ కాదు. ఈ గెటప్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక, మీరన్నట్లు కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గెటప్స్ వేసి ఉండొచ్చు. అందులో తప్పేం ఉంది? అది కూడా కష్టమేనండి. ఎవరు సినిమా చేసినా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికే కదా. విలన్ అంటేనే ‘చెడ్డవాడు’. మరి.. ‘ఉత్తమ విలన్’ ఏంటి? మీ దృష్టి కోణంలో చూస్తే, కొంతమంది మీకు విలన్లా అనిపించొచ్చు. వాళ్లు నా దృష్టికి మంచివాళ్లుగా అనిపించొచ్చు. ఈ విలన్ అందరికీ మంచివాడిలానే అనిపిస్తాడు. అంటే.. అందరి ప్రేమా పొందే విలన్ అన్నమాట? అవును. ఇప్పుడు మీ అభిమాన హీరో ఉన్నాడనుకోండి.. అతను బాగా యాక్ట్ చేస్తే ‘చంపేశాడ్రా’ అంటారు. ప్రేమగా అనే మాట అది. ఈ విలన్ని కూడా ప్రేక్షకులు బాగా ప్రేమించి. ‘ఉత్తమ విలన్’ అని పొగుడుతారు. థెయ్యమ్ కళాకారుడి గెటప్ కోసం నాలుగైదు గంటలు మేకప్ వేసుకునేవారట.. ఇన్నేసి గంటలు మేకప్ డిమాండ్ చేసే పాత్రలు మీరు చాలానే చేస్తుంటారు? (నవ్వుతూ).. అన్ని గంటలు మేకప్ వేసుకోవాలనే లక్ష్యంతో నేనా పాత్రలు చేయడంలేదు. ఏ పాత్ర ఎంత మేకప్ డిమాండ్ చేస్తే.. అంత వేసుకుంటాను. ఏదైనా సరే కథానుగుణంగానే చేస్తా. ఎనిమిదో శతాబ్దం.. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందిన కథతో ‘ఉత్తమ విలన్’ తీసినట్లున్నారు. పునర్జన్మల నేపథ్యమేమో అనిపిస్తోంది.. అసలు మీరు పునర్జన్మలను నమ్ముతారా? అస్సలు నమ్మకం లేదు. అందుకే, నేను నమ్మనిదాన్ని నేను తీయను. ఈ చిత్రకథ ఎలా ఉంటుందో తెరపై చూస్తేనే బాగుంటుంది. ఒకసారి మీ చిన్ననాటి విశేషాలు తెలుసుకోవాలనుంది.. నాలుగైదేళ్ల వయసులో చేసిన సినిమాలు మీకు గుర్తున్నాయా? మీరు ‘ఉత్తమ విలన్’ గురించి భవిష్యత్తులో ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతాను. కానీ, చిన్నప్పుడు చేసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలు పెద్దగా లేవు. ఎందుకంటే, అప్పుడు ఆడుతూ పాడుతూ చేసేవాణ్ణి. ఏవీయం స్టూడియోలో షూటింగ్ అనుకోండి.. ఆ స్టూడియోకి వెళ్లేవాణ్ణి. వెళ్లడం వెళ్లడమే మిగతా పిల్లలతో ఆడుకోవడం మొదలు పెట్టేవాణ్ణి. నాకోసం చెక్కతో బొమ్మ కత్తులు చేసిచ్చేవాళ్లు. వాటితో ఆడుకునేవాణ్ణి. మధ్య మధ్యలో సీన్ చేయడానికి పిలిచేవారు. అప్పుడు వెళ్లి అలా చేసి, ఇలా వచ్చి మళ్లీ ఆడుకునేవాణ్ణి (నవ్వుతూ). ఫైనల్‌గా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ ఏడాది ’ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’.. ఇలా మూడు చిత్రాల ద్వారా తెరపై కనిపించనున్నారు? నాలుగో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నానండీ. దీనికి బాలచందర్‌గారే ఆదర్శం. 1975లో ఆయన్నుంచి ఐదు సినిమాలొచ్చాయి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు ఆయనే నిర్వర్తించారు. అదెంత గొప్ప విషయం. పైగా అన్నీ హిట్సే. ఒకప్పుడు నేను కూడా చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఈ మధ్య కాస్త తగ్గింది. అందుకే, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచా. 50 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇంత పెద్ద స్టార్ అయ్యారు! అదే ఇప్పుడు పరిచయం అయ్యుంటే ఇదే స్థాయికి చేరుకునేవారా? అసలీ తరంలో ఈ స్థాయి స్టార్డమ్ సాధ్యమేనా? బాలచందర్‌లాంటి వ్యక్తి ఉంటే సాధ్యమే. ఆయన లేకపోతే నేనీ స్థాయికి వచ్చేవాణ్ణి కాదు. కానీ, సినిమాల్లోనే ఉండేవాణ్ణి. కాకపోతే ఏ అసిస్టెంట్ డెరైక్టర్గానో, డాన్సర్గానో, ఫైనాన్షియర్గానో, డిస్ట్రిబ్యూటర్గానో ఉండేవాణ్ణి. ఒకవేళ ఇవేమీ చేయడం రాకపోతే సినిమా థియేటర్లో సినిమా ప్రేక్షకుడిగా సినిమాలు చూస్తుండేవాణ్ణి. నాకీ కళ అంటే అంత ఇష్టం. సినిమా మినహా నాకు వేరే ఏమీ తెలియదు. డి.జి. భవాని -
ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్...
ప్రముఖ నటుడు, దర్శక - నిర్మాత కమలహాసన్ ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం-2’, మలయాళ హిట్ ‘దృశ్యం’కు తమిళ రీమేకైన ‘పాపనాశం’ చిత్రాలు మూడింటి షూటింగ్‌నూ ముగించిన ఈ అలుపెరుగని నటుడు ముందుగా ‘ఉత్తమ విలన్’గా పలకరించనున్నారు. ఒకపక్క ఏప్రిల్‌లో ఆ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోపక్క కొత్త చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు - కమల్. స్వీయ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించడానికి లొకేషన్లను వెతుక్కుంటూ ఇటీవలే ఆయన మారిషస్‌కు కూడా వెళ్ళివచ్చారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్ అది. ‘ఉత్తమ విలన్’ రిలీజవగానే, ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలవు తుంది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌కు ప్రీ-ప్రొడక్షన్ పని జరుగుతోంది’’ అని కమలహాసన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, మరోపక్క ఓ పూర్తి నిడివి హిందీ సినిమా కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారట! అయితే, అది పూర్తిగా రాజకీయ కథాంశమని భోగట్టా. నిర్మాతలు వీరేందర్ అరోరా, అర్జున్ కె. కపూర్లతో కలసి ఆయన ఆ సినిమా నిర్మిస్తారని కోడంబాకమ్ కబురు. మరి వీటి మధ్య ఆమిర్‌ఖాన్ ‘పీకే’ తమిళ రీమేక్‌కు కమల్ ఎలా డేట్లు సర్దుతారన్నది ఆసక్తికరం. ఏమైనా, ‘ఉత్తమ విలన్’ తమిళ పాటలను ఇటీవల డిజిటల్ డౌన్లోడ్ రూపంలో ఆధునికంగా విడుదల చేసి, అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ‘ఉలగ నాయకన్’ (లోకనాయకుడు) కొత్త స్క్రిప్టులనూ అంతే ఆమళ్ళీ మ్యాజిక్? దునిక శైలిలో తీర్చిదిద్దుతారని వేరే చెప్పాలా? -
నేను బాలచందర్ నీడను..
నన్ను, రజనీకాంత్‌ను దివంగత దర్శకుడు కే.బాలచందర్ కనుగొన్నారని అంటున్నారని.. కానీ.. అంటూ విశ్వనాయకుడు కమల్‌హాసన్ ఉత్తమవిలన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తన గురువు గురించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన ఉత్తమ విలన్ చిత్రాన్ని తన స్నేహితుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లింగు స్వామి తన తిరుపతి బ్రదర్స్ పతకాంపై భారీ ఎత్తున నిర్మించారు. దీనిని హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నది. ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండియ్రా, పార్వతీలు హీరోయిన్లుగా నటించారు. దిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో అంగరంగవైభవంగా జరిగింది. నటుడు పార్దీబన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, తానను, రజనీకాంత్‌ను దివంగత ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్ పరిచయం చేశారని అంటున్నారని, నిజం చెప్పాలంటే, బాలచందర్ లేకున్నా రజనీకాంత్ మొరట్టు కాలై లాంటి ఏదో చిత్రంతో నటుడయ్యే వాడన్నారు. అయితే, బాలచందర్ లేకుంటే తాను నటుడయ్యే వాడ్ని కాదన్నారు. బాలచ ందర్కు తనకు మధ్య ప్రేమాను బంధం చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిందన్నారు. ఆయన తనకు మహా గురువు అని పేర్కొన్నారు. ఈచిత్రంలో బాలచందర్ నటించేందుకు అంగీకరించడం ఘనంగా భావించినట్టు తెలిపారు. ఆయన ఈ వేదికపై ఉంటారని భావించానని, అలా కాకుంటే ఇంకొన్ని ప్రత్యేకతలు ఆయన గురించి చేసి ఉండే వాడినని అన్నారు. తాను బాలచందర్‌లో సగం అని అందరూ అంటున్నారని, అయితే, దానిని నేను గర్వంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నటు తెలిపారు. తాను బాలచందర్ నీడను అని, ఆయన కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని కమల్ పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియోను కమల్ ఆవిష్కరించగా, ఆయన కుమార్తె శ్రుతిహాసన్ అందుకున్నారు. -
ఉత్తమ విలన్లకు సత్కారం!
దక్షిణాది తెరపై ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్న నటులు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో కొంతమందికి సత్కారం జరగనుంది. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్’ పేరుతో ఓ సినిమా తయారవుతోంది. ఇప్పటికే షూటింగ్, వగైరా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు. టైటిల్ ‘ఉత్తమ విలన్’ కాబట్టి, కొంతమంది ప్రతినాయకులను ఈ వేదికపై సత్కరించాలని కమల్ భావిస్తున్నారు. -
రిస్క్‌లోనే కిక్!
సవాళ్లను ఎదుర్కోవడం కమలహాసన్‌కి చాలా ఇష్టం. అందుకే సాదా సీదా పాత్రలు చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి కనబర్చరు. మరి... రిస్క్‌లోనే కిక్ ఉందనుకుంటారో ఏమో కానీ.. కథాంశం, గెటప్.. అన్నీ దాదాపు రిస్క్‌తో కూడుకున్నవిగానే ఉంటాయి. అందుకు ఉదాహరణగా.. ‘విచిత్ర సోదరులు’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు ఉన్నాయి. తాజాగా, ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కమల్ గెటప్ గురించి చెప్పాలి. ఇందులో కమల్ ద్విపాత్రల్లో కనిపిస్తారు. వాటిలో తెయ్యమ్ కళాకారుడి పాత్ర ఒకటి. తెయ్యమ్ అంటే కేరళకు చెందిన కళ. ఈ చిత్రం ప్రారంభం సమయంలోనే తెయ్యమ్ కళాకారుడి గెటప్‌ని విడుదల చేశారు. ఆ గెటప్ కోసం కమల్ దాదాపు మూడు, నాలుగు గంటలు మేకప్‌కే కేటాయించారు. ఆరు పదుల వయసులోనూ ఇంతటి క్లిష్టమైన పాత్రలు చేస్తున్నారంటే కమల్‌కి సినిమాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు.. ముఖ్యంగా కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి, 1న పాటలను విడుదల చేసి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇదే నా గురువుకు అంజలి
తమిళసినిమా: ‘‘కె.బాలచందర్ నాకు నేర్పిన వృత్తితోనే ఆయనకు అంజలి ఘటిస్తున్నాను.’’అని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కమలహాసన్ గురు శిష్యుల బంధం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి గురువు తనువు చాలిస్తే సినీ ప్రపంచమే కన్నీరుమున్నీరైంది. కానీ గురువు ఆఖరి చూపు కూడా కమలహాసన్‌కు దక్కలేదు. కారణం కమల్ ఆ సమయంలో అమెరికాలో ఉండటమే. బాలచందర్ మరణవార్త విని కమలహాసన్ చెన్నైకి బయల్దేరారు. ఆయన వచ్చిన తరువాత అంత్యక్రియలు అంటూ ప్రచారం జరిగింది. కానీ కమలహాసన్ అంత్యక్రియలకు రాలేకపోయూరు. కారణాన్ని కమల్ వివరిస్తూ ఒక వీడియోను పంపారు. అందులో ఆయన పేర్కొంటూ తమిళ చిత్ర పరిశ్రమలో అపారదాతృత్వ గుణం కలిగినవారు కె.బాలచందర్. 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో వందల మంది కళాకారులను పరిచయం చేశారు. వారిలో నేనూ ఒకరిని. ఆయన నా ఒత్తిడి మేరకు భాగం పంచుకున్న ఉత్తమ విలన్ చిత్రం నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో విషయాల్లో నేను బాలచందర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఆయన ఆఖరి చూపు కూడా దక్కలేదు. కానీ ఆయన నాకు నేర్పిన వృత్తిలోనే నిమగ్నమై ఉన్నాను. ఇదే నేను నా గురువుకు ఘటించే అంజలిగా భావిస్తున్నాను అని కమలహాసన్ పేర్కొన్నారు. -
నా ఇబ్బంది నాన్నకూ తెలుసు
శ్రుతీహాసన్ చాలా దిగాలుగా ఉంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజేతులారా... కావాలని వదులుకుంది తను. అందుకే ఈ బాధ. ఇంతకూ శ్రుతి వదులుకున్న ఆ అవకాశం ఏంటి? అనుకుంటున్నారా! ఏ నాన్నకైతే ఈ ముద్దుగుమ్మ కూతురో... అదే నాన్నకు తెరపై కూడా కూతురిగా నటించే భాగ్యం దక్కడం నిజంగా అదృష్టమే కదా. అలాంటి అదృష్టాన్ని వదులుకుంది శ్రుతి. అందుకే.. తెగ బాధ పడిపోతోంది. వివరాల్లోకెళితే.. కమల్‌హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఉత్తమ విలన్’. కథ రీత్యా ఈ చిత్రంలో కమల్‌కి ఓ కూతురు ఉంటుంది. ఆ పాత్ర చాలా కీలకమైనది. అందుకే... ఆ పాత్రను వేరే ఎవరితోనే చేయించడం కంటే... కమల్ సొంత కుమార్తె శ్రుతీహాసన్‌తో చేయిస్తే బావుంటుంది కదా! అనుకున్నాడట ఆ చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్. అనుకున్నదే తడవుగా... శ్రుతి ముందు ఈ ప్రపోజల్‌ని పెట్టాడట. డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీగా ఉంది శ్రుతి. అందుకే... అంతటి గొప్ప అవకాశాన్నీ వదిలేసుకుంది. ఇదిలావుంటే... శ్రుతి, కమల్ ఇద్దరు తెరను పంచుకోబోతున్నారన్న వార్త ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో గుప్పుమంది. తండ్రీకూతుళ్లను ఒకేసారి తెరపై చూడబోతున్నామని తెలిసి కమల్ అభిమానులే కాక, ప్రతి ఒక్కరూ ఆనందం వెలిబుచ్చారు. ఇంతలోనే ఈ సినిమాలో శ్రుతి నటించడం లేదనే వార్త వారందరినీ నిరాశకు లోను చేసింది. చివరకు ఆ పాత్ర పార్వతీ మీనన్‌ని వరించిందని తెలిసింది. ‘‘నాన్నకు కూతురిగా నటించే అదృష్టం చేయిదాకా వచ్చి జారిపోయింది. బాధగా ఉన్నా వదులుకోక తప్పని పరిస్థితి. నా ఇబ్బంది నాన్నకు కూడా తెలుసు. అందుకే... దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అయితే... భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో నటిస్తా’’ అని చెప్పింది శ్రుతి. -
కేరళ బ్యూటీకి కమల్ సరసన నటించే ఛాన్స్
సినిమా రంగం చిత్రమైనది. కొన్ని సందర్భాలలో కొందరికి అవకాశాలు ఎలా వస్తాయో కూడా అర్ధం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్‌కు వచ్చే అవకాశాలు చాలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. అందం - అభినయం - అదృష్టం...మీద ఆధారపడి అవకాశాలు వస్తాయని చాలా మంది చెబుతుంటారు. కొన్ని చెప్పలేని అంశాల వల్ల కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆఫర్లు రావు. మరికొంత మందికి మాత్రం అనుకోకుండా అదృష్టం తలుపుతడుతూ ఉంటుంది. అదృష్టవంతుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాటంతట అవే అవకాశాలు వస్తూ ఉంటాయి. కేరళ బ్యూటీ పార్వతీ మీనన్‌కు ఇప్పుడు అలాంటి అదృష్టమే పట్టింది. ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పార్వతీ మీనన్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియదు. తమిళ, కన్నడ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు అది. అంతే కాకుండా తను నటించిన సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సుందరాంగి కోలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. విశ్వనాయకుడు కమల్ హాసన్ కంట్లో పడింది. అంతే ఆమె పంటపండింది. కమల్ మనసు దోచేసింది. వెంటనే ఆమెకు తన సరసన నటించే అవకాశం ఇచ్చేశాడు. కమల్‌కు కొత్తవారిని ప్రోత్సహించే అలవాటు ఉంది. ఈ బ్యూటీని చూశాడు. పిచ్చపిచ్చగా నచ్చేసింది. అంతే పార్వతికి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. కమల్ నటిస్తోన్న 'ఉత్తమవిలన్' మూవీలో ఓ ముఖ్య పాత్రను పార్వతి పోషిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ఉత్తమ విలన్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్ మూవీ అంటే అది తప్పక తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ మన తెలుగు దర్శకుల కంట్లో కూడా పడి అవకాశాలు కొట్టేస్తుందేమో చూడాలి. -
ఉత్తమ విలన్లో ద్విపాత్రాభినయం
పద్మశ్రీ కమలహాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. నటనలో ఎన్నో కోణాలను ఆవిష్కరించిన నట దిగ్గజం ఆయన. వైవిధ్యానికి కొండంత నిర్వచనం కమల్. అలాంటి నటదీశుడు తాజాగా ఉత్తమ విలన్ అవతారమెత్తుతున్నారు. దర్శక, నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న అత్యంత వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రం ఉత్తమవిలన్. ఈ ఉత్తమ విలన్లో మరో హీరో పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ కళాపిపాసి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి తన స్నేహితుడు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, కథనం బాధ్యతలను కమలహాసన్ తన భుజస్కంధాలపై మోస్తున్నారు. హీరోయిన్లుగా ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి మీనన్ అంటూ ముగ్గురు భామలు కమల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. విశేషాలేమిటంటే రెండు కాల ఘట్టాల్లో జరిగే కథ. ఎనిమిదో శతాబ్దంలో రంగస్థల నటుడిగా మనోరంజన్ ఒక పాత్రలో కమల్ నటిస్తున్నారు. 21వ శతాబ్దంలో సూపర్‌స్టార్‌గా మరో పాత్రలోనూ ఆయనే జీవిస్తున్నారు. ఈ పాత్రకు గురువుగా నిజజీవితంలో గురువు అయిన కె.బాలచందర్ పోషిస్తున్నారు. మనోరంజన్ భార్యగా నటి ఊర్వశి, ఆమె తండ్రిగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్ నటించడం విశేషం. కమలహాసన్‌కు కె.బాలచందర్ అంటే ఎంత గురుతర భావమో కె.విశ్వనాథ్ అంటే కూడా అంత గౌరవం. వీరిద్దరితో ఆయన ఒక చిత్రంలో నటించడం ప్రత్యేకం. ఈ చిత్రంలో మానసిక ఆరోగ్యంతో బాధపడే యువతిగా నటి పూజాకుమార్ నటిస్తుండగా 21వ శతాబ్దపు కమల్ రహస్య ప్రేమికురాలిగా నటి ఆండ్రియూ నటిస్తున్నారు. ఎనిమిదో శతాబ్దపు సర్వాధికారి పాత్రలో నాజర్, జెగప్ జక్రియా అనే మరో పాత్రలో జయరాం ఆయన దత్త పుత్రిక పాత్రలో పార్వతి మీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
కమల్ కాపీ మాస్టరా? ఇన్స్పయిరింగ్ కింగా?
నటనలో మాత్రమే కాకుండా శారీరక భాషలో కూడా వైవిధ్యం చూపించగల దమ్మున్న నటుడు కమల్‌హాసన్. ఇంద్రుడు-చంద్రుడు, భారతీయుడు, భామనే సత్యభామనేలాంటి కొన్ని చిత్రాల్లో రూపురేఖలను సైతం మార్చుకుని ఆశ్చర్యపరిచారు. అందుకే కమల్ సినిమాలను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లల్లో ఓ హాలీవుడ్ దర్శకుడు, నటుడు కూడా ఉన్నారు. కానీ, కమల్ ఎవర్ని ఆదర్శంగా తీసుకుంటారు? అనే ప్రశ్న వేస్తే.. ‘హాలీవుడ్ మూవీస్’ అని చెప్పొచ్చు. దాన్ని ఆదర్శం అంటారా... కాపీ అంటారా అనేది మీకే వదిలేస్తున్నాం. ఇక, గెటప్, స్టోరీ పరంగా కమల్ అనుకరించిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కేరళ ఆర్ట్ ‘తెయ్యమ్’ ఆదర్శంగా... ‘ఉత్తమ విలన్’... ప్రస్తుతం కమల్ నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తెయ్యమ్ అనే కేరళ కళకి దగ్గరగా ఉందీ లుక్. ఎరిక్ లఫ్ఫోర్గ్యు అనే ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఇండియా వచ్చినప్పుడు తెయ్యమ్ ఆర్ట్ లుక్‌ని తన కెమెరాలో కాప్చర్ చేశారు. మరి.. ఆ ఫొటో ఆధారంగానా లేక కేరళ కళ తెలుసుకుని, దాన్నుంచి కమల్ ఈ లుక్‌ని అనుకరించారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా లుక్ మాత్రం బ్రహ్మాండం. ‘మిషన్ ఇంపాజిబుల్’ని అనుకరించారా... ఇక ‘ఉత్తమ విలన్’కి ముందు కమల్ చేసిన ‘విశ్వరూపం’ విషయానికొద్దాం. ఈ చిత్రం సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. ‘విశ్వరూపం’లో కమల్ కనిపించిన గెటప్స్‌లో ‘వాజిమ్ అహ్మద్ కాశ్మీరీ’ ఒకటి. ‘మిషన్ ఇంపాజిబుల్’లో టామ్ క్రూజ్ లుక్‌కి దగ్గరగా ఈ గెటప్ ఉన్న విషయాన్ని కాదనలేం. ‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ ఆధారంగా.. కమల్‌హాసన్, మాధవన్ కాంబినేషన్లో రూపొందిన ‘అన్బే శివమ్’ (తెలుగులో ‘సత్యమే శివమ్’) విషయానికొస్తే.. ఈ కథలో ‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ అనే హాలీవుడ్ మూవీ ఛాయలు కనిపిస్తాయి. అలాగే, కమల్, మాధవన్ ఓ బల్ల మీద కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం అయితే అచ్చంగా ఆ సినిమాలో లీడ్ కేరక్టర్స్ మాట్లాడుకునే సీన్‌లానే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇప్పటివరకు కమల్ చేసిన గెటప్స్‌లో హాలీవుడ్‌ని అనుకరించినవి చాలానే ఉంటాయి. ‘షీ -డెవిల్’ సినిమానే ‘సతీ లీలావతి’? ఇక, సినిమాలపరంగా చెప్పుకుంటే, ‘సతీ లీలావతి’ని తీసుకుందాం. కమల్, రమేష్ అరవింద్, కల్పన, కోవై సరళ, హీరా కాంబినేషన్లో రూపొందిన వినోదాత్మక చిత్రం ఇది. హాలీవుడ్లో మెరిల్ స్ట్రీప్, రోజ్ అన్నే బార్, ఎడ్ బెగ్లీ, లిడా హంట్, సిల్వియా మైల్స్ తదితరుల కాంబినేషన్లో రూపొందిన ‘షీ-డెవిల్’ చిత్రం స్టోరీలైన్‌కి దగ్గరగా ఉంటుంది. హాలీవుడ్ చిత్రం విమర్శకుల నుంచి విమర్శలను అందుకుంటే, ఇక్కడ మాత్రం ‘సతీ లీలావతి’ని బాగానే ఆదరించారు. ఇదే హిందీలో ‘బీవీ నం. 1’గా, కన్నడంలో ‘రామా షామా భామా’గా పునర్నిర్మితమైంది. కన్నడ వెర్షన్లోనూ కమల్, రమేష్ అరవింద్ నటించారు. అక్కడ ‘మిసెస్ డౌట్ ఫైర్... ఇక్కడ ‘భామనే సత్యభామనే’! హాలీవుడ్ చిత్రం ‘మిసెస్ డౌట్ఫైర్’ చిత్రమే ‘భామనే సత్యభామనే’. ‘మిసెస్ డౌట్ఫైర్’ని ‘అలియాస్ ‘మేడమ్ డౌట్ఫైర్’ అనే నవల ఆధారంగా రూపొందించారు. ఆ చిత్రంలో రాబిన్ విలియమ్స్ యువకుడిగా, బామ్మగా చేస్తే ఇక్కడ ఆ పాత్రల్లో కమల్ ఒదిగిపోయారు. అయితే హాలీవుడ్ బామ్మ మోడ్రన్ డ్రెస్సులేసుకుంటే, కమల్ మాత్రం చక్కగా ఆరుగజాల చీర కట్టుకుని నటించారు. సో.. రాబిన్కన్నా కమల్ కష్టమే ఎక్కువ. ముడేసుకున్న జుత్తు చుట్టూ పువ్వులు, నుదుట రూపాయి కాసంత బొట్టు, చేతులకు గాజులు.. అసలు సిసలైన స్త్రీగా కనిపించారు కమల్. ఆ పాత్రకు సంబంధించిన మేకప్‌కి ఎక్కువ సమయం పట్టేది. తన ఆకారంలో ఆడతనాన్ని కమల్ అద్భుతంగా ప్రదర్శించిన తీరం అందర్నీ ఆకట్టుకుంది. ‘నైన్ టూ ఫైవ్’ ఆదర్శంగా ‘ఆడవాళ్లకు మాత్రమే’! మహిళా కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఓ బాస్ కథతో రూపొందిన చిత్రం ‘నైన్ టూ ఫైవ్’. అతగాడికి ముగ్గురు ముద్దుగుమ్మలు ఎలా బుద్ధి చెప్పారనే కథాంశంతో సినిమా వినోదంగా సాగుతుంది. కమల్ నిర్మించి, అతిథి పాత్ర పోషించిన ‘మగళిర్ మట్టుమ్’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) సినిమా ఈ ‘నైన్ టూ ఫైవ్’ని ఆదర్శంగా తీసుకుని రూపొందించినట్లుగా ఉంటుంది. ఈ విధంగా చరిత్రను తవ్వితే ఇంకొన్ని సినిమాలు వెలుగు చూస్తాయి. ‘ఫలానా సినిమా మాకు ఇన్స్పిరేషన్’ అంటూ కొంతమంది సినిమాలు తీసి, చెడగొట్టినవాళ్లున్నారు. కానీ, కమల్ మాత్రం ఆదర్శంగా తీసుకున్నా, కాపీ కొట్టినా ‘భేష్’ అనిపించేలానే చేశారు. మాతృక ‘ఫ్లేవర్’ చెడిపోకుండా చేయడం అనేది ఒక కళే. కమల్ సకలా కళావల్లభుడు కాబట్టి.. ఆ కళలో కూడా తన నైపుణ్యం బాగానే చూపించారు. - డి.జి. భవాని -
హాట్ టాఫిక్‌గా ఉత్తమ విలన్ ఫస్ట్ లుక్
-
ఉత్తమ విలన్ మేకప్‌కి ఐదు గంటలు!
పాత్ర కోసం శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడరు కమల్‌హాసన్. అందుకు మంచి ఉదాహరణ ‘విచిత్ర సోదరులు’. అందులో ‘అప్పూ’ పాత్ర కోసం కాళ్లు వెనక్కి మడిచి, మోకాళ్లకు బూట్లు తొడుక్కుని నటించారు కమల్. భారతీయుడు, భామనే సత్యభామనే, దశావతారం.. ఇలా విభిన్న అవతారాల్లో కమల్ కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ అవతారాలకు సంబంధించిన మేకప్ కోసం ఆయన గంటలు గంటలు వెచ్చించారు. తాజాగా, ‘ఉత్తమ విలన్’ చిత్రంలోని పాత్ర కోసం మేకప్‌కి ఐదు గంటలు కేటాయించనున్నారు కమల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఫొటోషూట్ చేశారు. ఈ చిత్రంలో కమల్ ఓ వెరైటీ లుక్‌లో కనిపిస్తారట. ఈ లుక్‌తోనే ఫొటోషూట్ జరిగిందని సమాచారం. ఈ లుక్ కోసమే కమల్ దాదాపు ఐదు గంటలు మేకప్‌కి కేటాయించారట. రెండు రోజుల పాటు ఈ ఫొటోషూట్ జరిగిందని, గెటప్‌కి సంబంధించి కమల్‌కి గౌతమి కొన్ని టిప్స్ ఇచ్చారని వినికిడి. -
ఉత్తమ విలన్లో నేనున్నానా?
ఉత్తమ విలన్ చిత్రంలో నేనున్నానా అని ప్రశ్నిస్తున్నారు అందాల తార త్రిష. ఆరంభానికి ముందే అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఇందుకు కారణాలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర హీరో పద్మభూషణ్ కమల్‌హాసన్ కావడమే ఇంత క్రేజ్‌కు ప్రధాన కారణం. తదుపరి టైటిల్ కమల్‌హాసన్ నటించే చిత్రానికి ఉత్తమ విలన్ పేరును నిర్ణయించడంతో మరింత కుతూహలం పెరిగింది. మూడో అంశం ఇది ఒక సీనియర్ సూపర్ స్టార్ ఇతివృత్తం అనే ప్రచారం వెలుగులోకి రావడం. నాలుగో విషయం ఈ చిత్రానికి కమల్‌హాసనే కథ, కథనం సిద్ధం చేయడం. ఆయన స్నేహితుడు కన్నడ నటుడు రమేష్ అరవింద్ మెగా ఫోన్ పట్టనుండటం. ఇక మరో ఆసక్తికర మైన అంశం ఈ చిత్రంలో ముగ్గురు క్రేజీ భామలు కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష నటించనున్నారన్న ప్రచారం జరగడం. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటికే కమల్ సరసన నటించనున్నట్లు ప్రకటించారు. తమన్నా కూడా ఓకే అయినట్లు సమాచారం. కానీ చెన్నై చిన్నది త్రిష మాత్రం ఉత్తమ విలన్ చిత్రంలో నేనున్నానా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణం ఈ చిత్ర విషయమై ఈ ముద్దుగుమ్మనెవరూ ఇప్పటి వరకు సంప్రదించలేదట. అయినా కమల్ సరసన ఇప్పటికే మన్మధన్ అన్బు చిత్రంలో జతకట్టిన త్రిషకు మరోసారి అవకాశం వస్తే నటించడం సంతోషమేనంటున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత లింగుసామి నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం. ఇంతకూ ఈ చిత్రంలో త్రిష ఉన్నట్ట్టా? లేనట్టా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఉత్తమ విలన్‌తో జోడీ?
కమల్‌హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో ‘ఉత్తమ విలన్’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ నెల 24న చెన్నయ్‌లో పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో కమల్ టైటిల్ రోల్ పోషించనున్నారు. ఆయన గురువు, ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇందులో కమల్ సరసన ముగ్గురు నాయికలు నటిస్తారని సమాచారం. ఈ పాత్రలకు త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలనుకుంటున్నారని చెన్నై టాక్. ఇటీవల ఈ ముగ్గురు భామలతో సంప్రతింపులు జరిపారని వినికిడి. కమల్‌తో త్రిష ‘మన్మథన్ అంబు’ అనే చిత్రంలో నటించింది. కాబట్టి, మరోసారి గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని ఊహించవచ్చు. కాజల్, తమన్నాకి కమల్‌తో ఇదే తొలి అవకాశం. అందుకని ఈ ఇద్దరు కూడా ఈ చిత్రంవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి.. ఉత్తమ విలన్‌కి ఈ ముగ్గురూ జోడీ అవుతారో లేదో వేచి చూడాల్సిందే. -
శృతి అనుభవం చాలదు
శృతి హాసన్ అనుభవం చాలదంటున్నారు ఆమె తండ్రి ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్. ఆయన ఏ సందర్భంలో ఎందుకలా అన్నారో చూద్దాం. కమల్ విశ్వరూపం-2 చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన ఉత్తమ విలన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్నేహితుడు, నటుడు అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుసామి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో ఆయన కూతురు శృతి హాసన్ నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడామె చిత్రం నుంచి వైదొలగారు. దీని గురించి కమల్ తెలుపుతూ ఉత్తమ విలన్ చిత్రంలో శృతి హాసన్‌ను నటింపజేయాలనుకున్న మాట వాస్తమేనన్నారు. అయితే ఆమె కాల్షీట్స్ లభించలేదని తెలిపారు. ఇది ఒకందుకు మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత త్వరగా తామిద్దరం కలిసి నటించే అవకాశం లే దని, అయితే ఒక వేళ తామిద్దరం కలిసి నటిస్తే ఆ చిత్రంపై అనూహ్య అంచనాలు ఏర్పడతాయన్నారు. అదే విధంగా శృతి నటనలో మరింత అనుభవం పొందిన తరువాతే తనతో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నానన్నారు. ఉత్తమ విలన్ చిత్రంలో శృతి తన కూతురిగా నటించాల్సి ఉందని ఇప్పుడా పాత్రలో నూతన నటి నటిస్తున్నారని కమల్ తెలిపారు.