ఉత్తమ విలన్‌లో నేనున్నానా?
ఉత్తమ విలన్ చిత్రంలో నేనున్నానా అని ప్రశ్నిస్తున్నారు అందాల తార త్రిష. ఆరంభానికి ముందే అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ఉత్తమ విలన్. ఇందుకు కారణాలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర హీరో పద్మభూషణ్ కమల్‌హాసన్ కావడమే ఇంత క్రేజ్‌కు ప్రధాన కారణం. తదుపరి టైటిల్ కమల్‌హాసన్ నటించే చిత్రానికి ఉత్తమ విలన్ పేరును నిర్ణయించడంతో మరింత కుతూహలం పెరిగింది. మూడో అంశం ఇది ఒక సీనియర్ సూపర్ స్టార్ ఇతివృత్తం అనే ప్రచారం వెలుగులోకి రావడం. నాలుగో విషయం ఈ చిత్రానికి కమల్‌హాసనే కథ, కథనం సిద్ధం చేయడం. ఆయన స్నేహితుడు కన్నడ నటుడు రమేష్ అరవింద్ మెగా ఫోన్ పట్టనుండటం.
ఇక మరో ఆసక్తికర మైన అంశం ఈ చిత్రంలో ముగ్గురు క్రేజీ భామలు కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష నటించనున్నారన్న ప్రచారం జరగడం. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటికే కమల్ సరసన నటించనున్నట్లు ప్రకటించారు. తమన్నా కూడా ఓకే అయినట్లు సమాచారం. కానీ చెన్నై చిన్నది త్రిష మాత్రం ఉత్తమ విలన్ చిత్రంలో నేనున్నానా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణం ఈ చిత్ర విషయమై ఈ ముద్దుగుమ్మనెవరూ ఇప్పటి వరకు సంప్రదించలేదట. అయినా కమల్ సరసన ఇప్పటికే మన్మధన్ అన్బు చిత్రంలో జతకట్టిన త్రిషకు మరోసారి అవకాశం వస్తే నటించడం సంతోషమేనంటున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత లింగుసామి నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం. ఇంతకూ ఈ చిత్రంలో త్రిష ఉన్నట్ట్టా? లేనట్టా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.