ఇదే నా గురువుకు అంజలి
తమిళసినిమా: ‘‘కె.బాలచందర్ నాకు నేర్పిన వృత్తితోనే ఆయనకు అంజలి ఘటిస్తున్నాను.’’అని ప్రముఖ నటుడు కమలహాసన్ పేర్కొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, కమలహాసన్ గురు శిష్యుల బంధం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి గురువు తనువు చాలిస్తే సినీ ప్రపంచమే కన్నీరుమున్నీరైంది. కానీ గురువు ఆఖరి చూపు కూడా కమలహాసన్‌కు దక్కలేదు. కారణం కమల్ ఆ సమయంలో అమెరికాలో ఉండటమే. బాలచందర్ మరణవార్త విని కమలహాసన్ చెన్నైకి బయల్దేరారు. ఆయన వచ్చిన తరువాత అంత్యక్రియలు అంటూ ప్రచారం జరిగింది. కానీ కమలహాసన్ అంత్యక్రియలకు రాలేకపోయూరు.
కారణాన్ని కమల్ వివరిస్తూ ఒక వీడియోను పంపారు. అందులో ఆయన పేర్కొంటూ తమిళ చిత్ర పరిశ్రమలో అపారదాతృత్వ గుణం కలిగినవారు కె.బాలచందర్. 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో వందల మంది కళాకారులను పరిచయం చేశారు. వారిలో నేనూ ఒకరిని. ఆయన నా ఒత్తిడి మేరకు భాగం పంచుకున్న ఉత్తమ విలన్ చిత్రం నా జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో విషయాల్లో నేను బాలచందర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఆయన ఆఖరి చూపు కూడా దక్కలేదు. కానీ ఆయన నాకు నేర్పిన వృత్తిలోనే నిమగ్నమై ఉన్నాను. ఇదే నేను నా గురువుకు ఘటించే అంజలిగా భావిస్తున్నాను అని కమలహాసన్ పేర్కొన్నారు.