నేను బాలచందర్ నీడను..
నన్ను, రజనీకాంత్‌ను దివంగత దర్శకుడు కే.బాలచందర్ కనుగొన్నారని అంటున్నారని.. కానీ.. అంటూ విశ్వనాయకుడు కమల్‌హాసన్ ఉత్తమవిలన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తన గురువు గురించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన ఉత్తమ విలన్ చిత్రాన్ని తన స్నేహితుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లింగు స్వామి తన తిరుపతి బ్రదర్స్ పతకాంపై భారీ ఎత్తున నిర్మించారు. దీనిని హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నది. ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండియ్రా, పార్వతీలు హీరోయిన్లుగా నటించారు. దిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్‌లో అంగరంగవైభవంగా జరిగింది.
నటుడు పార్దీబన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, తానను, రజనీకాంత్‌ను దివంగత ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్ పరిచయం చేశారని అంటున్నారని, నిజం చెప్పాలంటే, బాలచందర్ లేకున్నా రజనీకాంత్ మొరట్టు కాలై లాంటి ఏదో చిత్రంతో నటుడయ్యే వాడన్నారు. అయితే, బాలచందర్ లేకుంటే తాను నటుడయ్యే వాడ్ని కాదన్నారు. బాలచ ందర్‌కు తనకు మధ్య ప్రేమాను బంధం చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిందన్నారు. ఆయన తనకు మహా గురువు అని పేర్కొన్నారు.
ఈచిత్రంలో బాలచందర్ నటించేందుకు అంగీకరించడం ఘనంగా భావించినట్టు తెలిపారు. ఆయన ఈ వేదికపై ఉంటారని భావించానని, అలా కాకుంటే ఇంకొన్ని ప్రత్యేకతలు ఆయన గురించి చేసి ఉండే వాడినని అన్నారు. తాను బాలచందర్‌లో సగం అని అందరూ అంటున్నారని, అయితే, దానిని నేను గర్వంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నటు తెలిపారు. తాను బాలచందర్ నీడను అని, ఆయన కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని కమల్ పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియోను కమల్ ఆవిష్కరించగా, ఆయన కుమార్తె శ్రుతిహాసన్ అందుకున్నారు.