![కమల్, రజని మళ్లీ కలిసి నటిస్తారా? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41412452218_625x300.jpg.webp?itok=1zDhSGkW)
కమల్, రజని మళ్లీ కలిసి నటిస్తారా?
శిష్యులెంత ఘనులైనా గురువు ముందు విద్యార్థులే. ప్రఖ్యాత నటులు కమలహాసన్, రజనీకాంత్ తమ గురువు, ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ను అంతగా గౌరవిస్తారు. ఆయనకు వీళ్లంటే వల్లమాలిన ప్రేమ. ఆరంభదశలో కమల్, రజనీలతో కె.బాలచందర్ పలు చిత్రాలను తెరకెక్కించారు. ఇళమై ఊంజలాడు గిరదు, నినైత్తాలే ఇనిక్కుం, మూండ్రు ముడిచ్చు లాంటి పలు చిత్రాల్లో కమలహాసన్, రజనీకాంత్ కలసి నటించారు. ఆ తరువాత వారికి ప్రత్యేక ఇమేజ్ రావడంతో విడివిడిగా నటించడం మొదలెట్టారు. ప్రస్తుతం కమల్, రజనీ తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటివారుగా ఎదిగారు.
అలాంటి శిష్యులతో కలిసి మళ్లీ చిత్రం చేయాలన్నది గురువు కె.బాలచందర్ కోరిక. ప్రస్తుతం ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారట. ఈ విషయాన్ని సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ తాను ఇటీవల తన గురువు కె.బాలచందర్‌ను కలిశానన్నారు. అప్పుడాయన మళ్లీ రజనీకాంత్, కమలహాసన్‌లతో ఒక చిత్రం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను నటించాలని బాలచందర్ అడిగినట్లు చెప్పారు. తన జీవితంలో మరచిపోలేని చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో నటించిన నినైతాలే ఇనిక్కుం అని జయప్రద పేర్కొన్నారు. అంతాబాగానే ఉంది. రెండు ధృవనక్షత్రాలు లాంటి కమల్, రజని మళ్లీ కలిసి నటిస్తారా? తమ గురువు ప్రయత్నం ఫలించేనా? అలాంటి అందమైన అనుభవం ప్రేక్షకులకు మళ్లీ కలిగే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిందే!