
నా ఇబ్బంది నాన్నకూ తెలుసు
శ్రుతీహాసన్ చాలా దిగాలుగా ఉంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజేతులారా... కావాలని వదులుకుంది తను. అందుకే ఈ బాధ. ఇంతకూ శ్రుతి వదులుకున్న ఆ అవకాశం ఏంటి? అనుకుంటున్నారా! ఏ నాన్నకైతే ఈ ముద్దుగుమ్మ కూతురో... అదే నాన్నకు తెరపై కూడా కూతురిగా నటించే భాగ్యం దక్కడం నిజంగా అదృష్టమే కదా. అలాంటి అదృష్టాన్ని వదులుకుంది శ్రుతి. అందుకే.. తెగ బాధ పడిపోతోంది. వివరాల్లోకెళితే.. కమల్‌హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఉత్తమ విలన్’.
కథ రీత్యా ఈ చిత్రంలో కమల్‌కి ఓ కూతురు ఉంటుంది. ఆ పాత్ర చాలా కీలకమైనది. అందుకే... ఆ పాత్రను వేరే ఎవరితోనే చేయించడం కంటే... కమల్ సొంత కుమార్తె శ్రుతీహాసన్‌తో చేయిస్తే బావుంటుంది కదా! అనుకున్నాడట ఆ చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్. అనుకున్నదే తడవుగా... శ్రుతి ముందు ఈ ప్రపోజల్‌ని పెట్టాడట. డేట్లు సర్దుబాటు చేయలేనంత బిజీగా ఉంది శ్రుతి. అందుకే... అంతటి గొప్ప అవకాశాన్నీ వదిలేసుకుంది. ఇదిలావుంటే... శ్రుతి, కమల్ ఇద్దరు తెరను పంచుకోబోతున్నారన్న వార్త ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో గుప్పుమంది.
తండ్రీకూతుళ్లను ఒకేసారి తెరపై చూడబోతున్నామని తెలిసి కమల్ అభిమానులే కాక, ప్రతి ఒక్కరూ ఆనందం వెలిబుచ్చారు. ఇంతలోనే ఈ సినిమాలో శ్రుతి నటించడం లేదనే వార్త వారందరినీ నిరాశకు లోను చేసింది. చివరకు ఆ పాత్ర పార్వతీ మీనన్‌ని వరించిందని తెలిసింది. ‘‘నాన్నకు కూతురిగా నటించే అదృష్టం చేయిదాకా వచ్చి జారిపోయింది. బాధగా ఉన్నా వదులుకోక తప్పని పరిస్థితి. నా ఇబ్బంది నాన్నకు కూడా తెలుసు. అందుకే... దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అయితే... భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో నటిస్తా’’ అని చెప్పింది శ్రుతి.