శృతి అనుభవం చాలదు
శృతి హాసన్ అనుభవం చాలదంటున్నారు ఆమె తండ్రి ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్. ఆయన ఏ సందర్భంలో ఎందుకలా అన్నారో చూద్దాం. కమల్ విశ్వరూపం-2 చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం ఆయన ఉత్తమ విలన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్నేహితుడు, నటుడు అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుసామి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో ఆయన కూతురు శృతి హాసన్ నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడామె చిత్రం నుంచి వైదొలగారు.
దీని గురించి కమల్ తెలుపుతూ ఉత్తమ విలన్ చిత్రంలో శృతి హాసన్‌ను నటింపజేయాలనుకున్న మాట వాస్తమేనన్నారు. అయితే ఆమె కాల్‌షీట్స్ లభించలేదని తెలిపారు. ఇది ఒకందుకు మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత త్వరగా తామిద్దరం కలిసి నటించే అవకాశం లే దని, అయితే ఒక వేళ తామిద్దరం కలిసి నటిస్తే ఆ చిత్రంపై అనూహ్య అంచనాలు ఏర్పడతాయన్నారు. అదే విధంగా శృతి నటనలో మరింత అనుభవం పొందిన తరువాతే తనతో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నానన్నారు. ఉత్తమ విలన్ చిత్రంలో శృతి తన కూతురిగా నటించాల్సి ఉందని ఇప్పుడా పాత్రలో నూతన నటి నటిస్తున్నారని కమల్ తెలిపారు.