కమల్ కాపీ మాస్టరా? ఇన్‌స్పయిరింగ్ కింగా?
నటనలో మాత్రమే కాకుండా శారీరక భాషలో కూడా వైవిధ్యం చూపించగల దమ్మున్న నటుడు కమల్‌హాసన్. ఇంద్రుడు-చంద్రుడు, భారతీయుడు, భామనే సత్యభామనేలాంటి కొన్ని చిత్రాల్లో రూపురేఖలను సైతం మార్చుకుని ఆశ్చర్యపరిచారు. అందుకే కమల్ సినిమాలను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లల్లో ఓ హాలీవుడ్ దర్శకుడు, నటుడు కూడా ఉన్నారు. కానీ, కమల్ ఎవర్ని ఆదర్శంగా తీసుకుంటారు? అనే ప్రశ్న వేస్తే.. ‘హాలీవుడ్ మూవీస్’ అని చెప్పొచ్చు. దాన్ని ఆదర్శం అంటారా... కాపీ అంటారా అనేది మీకే వదిలేస్తున్నాం. ఇక, గెటప్, స్టోరీ పరంగా కమల్ అనుకరించిన చిత్రాల గురించి తెలుసుకుందాం...
కేరళ ఆర్ట్ ‘తెయ్యమ్’ ఆదర్శంగా...
‘ఉత్తమ విలన్’... ప్రస్తుతం కమల్ నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తెయ్యమ్ అనే కేరళ కళకి దగ్గరగా ఉందీ లుక్. ఎరిక్ లఫ్ఫోర్‌గ్యు అనే ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఇండియా వచ్చినప్పుడు తెయ్యమ్ ఆర్ట్ లుక్‌ని తన కెమెరాలో కాప్చర్ చేశారు. మరి.. ఆ ఫొటో ఆధారంగానా లేక కేరళ కళ తెలుసుకుని, దాన్నుంచి కమల్ ఈ లుక్‌ని అనుకరించారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా లుక్ మాత్రం బ్రహ్మాండం.
‘మిషన్ ఇంపాజిబుల్’ని అనుకరించారా...
ఇక ‘ఉత్తమ విలన్’కి ముందు కమల్ చేసిన ‘విశ్వరూపం’ విషయానికొద్దాం. ఈ చిత్రం సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. ‘విశ్వరూపం’లో కమల్ కనిపించిన గెటప్స్‌లో ‘వాజిమ్ అహ్మద్ కాశ్మీరీ’ ఒకటి. ‘మిషన్ ఇంపాజిబుల్’లో టామ్ క్రూజ్ లుక్‌కి దగ్గరగా ఈ గెటప్ ఉన్న విషయాన్ని కాదనలేం.
‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ ఆధారంగా..
కమల్‌హాసన్, మాధవన్ కాంబినేషన్‌లో రూపొందిన ‘అన్బే శివమ్’ (తెలుగులో ‘సత్యమే శివమ్’) విషయానికొస్తే.. ఈ కథలో ‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ అనే హాలీవుడ్ మూవీ ఛాయలు కనిపిస్తాయి. అలాగే, కమల్, మాధవన్ ఓ బల్ల మీద కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం అయితే అచ్చంగా ఆ సినిమాలో లీడ్ కేరక్టర్స్ మాట్లాడుకునే సీన్‌లానే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇప్పటివరకు కమల్ చేసిన గెటప్స్‌లో హాలీవుడ్‌ని అనుకరించినవి చాలానే ఉంటాయి.
‘షీ -డెవిల్’ సినిమానే ‘సతీ లీలావతి’?
ఇక, సినిమాలపరంగా చెప్పుకుంటే, ‘సతీ లీలావతి’ని తీసుకుందాం. కమల్, రమేష్ అరవింద్, కల్పన, కోవై సరళ, హీరా కాంబినేషన్‌లో రూపొందిన వినోదాత్మక చిత్రం ఇది. హాలీవుడ్‌లో మెరిల్ స్ట్రీప్, రోజ్ అన్నే బార్, ఎడ్ బెగ్లీ, లిడా హంట్, సిల్వియా మైల్స్ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ‘షీ-డెవిల్’ చిత్రం స్టోరీలైన్‌కి దగ్గరగా ఉంటుంది. హాలీవుడ్ చిత్రం విమర్శకుల నుంచి విమర్శలను అందుకుంటే, ఇక్కడ మాత్రం ‘సతీ లీలావతి’ని బాగానే ఆదరించారు. ఇదే హిందీలో ‘బీవీ నం. 1’గా, కన్నడంలో ‘రామా షామా భామా’గా పునర్నిర్మితమైంది. కన్నడ వెర్షన్‌లోనూ కమల్, రమేష్ అరవింద్ నటించారు.
అక్కడ ‘మిసెస్ డౌట్ ఫైర్... ఇక్కడ ‘భామనే సత్యభామనే’!
హాలీవుడ్ చిత్రం ‘మిసెస్ డౌట్‌ఫైర్’ చిత్రమే ‘భామనే సత్యభామనే’. ‘మిసెస్ డౌట్‌ఫైర్’ని ‘అలియాస్ ‘మేడమ్ డౌట్‌ఫైర్’ అనే నవల ఆధారంగా రూపొందించారు. ఆ చిత్రంలో రాబిన్ విలియమ్స్ యువకుడిగా, బామ్మగా చేస్తే ఇక్కడ ఆ పాత్రల్లో కమల్ ఒదిగిపోయారు. అయితే హాలీవుడ్ బామ్మ మోడ్రన్ డ్రెస్సులేసుకుంటే, కమల్ మాత్రం చక్కగా ఆరుగజాల చీర కట్టుకుని నటించారు. సో.. రాబిన్‌కన్నా కమల్ కష్టమే ఎక్కువ. ముడేసుకున్న జుత్తు చుట్టూ పువ్వులు, నుదుట రూపాయి కాసంత బొట్టు, చేతులకు గాజులు.. అసలు సిసలైన స్త్రీగా కనిపించారు కమల్. ఆ పాత్రకు సంబంధించిన మేకప్‌కి ఎక్కువ సమయం పట్టేది. తన ఆకారంలో ఆడతనాన్ని కమల్ అద్భుతంగా ప్రదర్శించిన తీరం అందర్నీ ఆకట్టుకుంది.
‘నైన్ టూ ఫైవ్’ ఆదర్శంగా ‘ఆడవాళ్లకు మాత్రమే’!
మహిళా కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఓ బాస్ కథతో రూపొందిన చిత్రం ‘నైన్ టూ ఫైవ్’. అతగాడికి ముగ్గురు ముద్దుగుమ్మలు ఎలా బుద్ధి చెప్పారనే కథాంశంతో సినిమా వినోదంగా సాగుతుంది. కమల్ నిర్మించి, అతిథి పాత్ర పోషించిన ‘మగళిర్ మట్టుమ్’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) సినిమా ఈ ‘నైన్ టూ ఫైవ్’ని ఆదర్శంగా తీసుకుని రూపొందించినట్లుగా ఉంటుంది.
ఈ విధంగా చరిత్రను తవ్వితే ఇంకొన్ని సినిమాలు వెలుగు చూస్తాయి. ‘ఫలానా సినిమా మాకు ఇన్‌స్పిరేషన్’ అంటూ కొంతమంది సినిమాలు తీసి, చెడగొట్టినవాళ్లున్నారు. కానీ, కమల్ మాత్రం ఆదర్శంగా తీసుకున్నా, కాపీ కొట్టినా ‘భేష్’ అనిపించేలానే చేశారు. మాతృక ‘ఫ్లేవర్’ చెడిపోకుండా చేయడం అనేది ఒక కళే. కమల్ సకలా కళావల్లభుడు కాబట్టి.. ఆ కళలో కూడా తన నైపుణ్యం బాగానే చూపించారు.
- డి.జి. భవాని