జీఎస్టీ తగ్గించకుంటే వైదొలగుతా
► ఫిలిం ఛాంబర్ సమావేశంలో కమల్
జీఎస్టీ పన్ను తగ్గించకుంటే తాను సినిమా నుంచి వైదొలగుతానని విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. వివరాల్లో కెళితే..కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న జీఎస్టీ పన్ను విధానం సినిమా పరిశ్రమపై పెనుభారం మోపనుంది. ఇతర రంగాల మాదిరిగానే సినిమాలకు 28 శాతం పన్నుభారం పడనుంది. దీనిని సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ జీఎస్టీ పన్ను విషయంలో పునఃపరిశీలన చేయాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి స్థానిక అన్నాసాలైలోని ఫిలిం ఛాంబర్‌లో సమావేశాన్ని నిర్వహిం చింది. ఈ సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు ఎల్.సురేష్‌తో పాటు నటు డు కమలహాసన్, రవి కొటార్కర, అభిరామి రామనాథన్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమలహాసన్ మాట్లాడుతూ సినిమా అన్నది జూదం కాదన్నారు. అది ఒక కళ అని సినిమా టికెట్‌పై విధించనున్న 28 శాతం జీఎస్టీ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ పన్ను వలన సినిమా బాధింపునకు గురవుతుందన్నారు. అందువలన ఈ పన్ను విధానాన్ని కనీసం 12 నుంచి 18 శాతం వరకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో భారతీయ చిత్రాలకు 28 శాతం జీఎస్టీ పన్ను విధించడం సబబు కాదన్నారు. ఒక వేళ ఈ పన్ను విధానాన్ని హిందీ చిత్ర పరిశ్రమ ఆమోదించినా తాము మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సినిమాకు 28 జీఎస్టీ పన్ను విధానంపై పునరాలోచించాలని లేని ఎడల తాను సినిమా నుంచి వైదొలుగుతానని కమలహాసన్ ఆవేశంగా అన్నారు. కాగా జీఎస్టీ పన్ను తగ్గించాలని కోరుతూ త్వరలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లిని కలవనున్నట్లు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎల్.సురేష్ వెల్లడించారు.