తమిళ సినిమా: డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ అరుళ్‌పతికే పట్టం కట్టారు. తమిళనిర్మాతల మండలి ఎన్నికలు, ఆర్‌కే.నగర్ ఉప ఎన్నికల తరువాత అంత సంచలనాన్ని కలిగించిన ఎన్నికలు డిస్ట్రిబ్యూటర్ల సంఘానివే. ఆదివారం స్థానిక చింతాద్రిపేటలోని మీరాసాహెబ్ వీధిలోని ఆ సంఘం కార్యలయంలో జరిగిన ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న టీఏ.అరుళ్‌పతి జట్టు మళ్లీ పోటీ చేయగా వారికి వ్యతిరేకంగా నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా జట్టు, నిర్మాత దేవరాజ్‌లు అధ్యక్షపదవికి పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఉపకార్యదర్శి పదవి మినహా అన్ని పదవులను అరుళ్‌పతి జట్టే కైవసం చేసుకుంది.
ఫలితాలివే..
మొత్తం సంఘంలో 527 సభ్యులుండగా 469 ఓట్లు పోలయ్యాయి. కాగా అధ్యక్షపదవికి పోటీ చేసిన అరుళ్‌పతి 248 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన కేఈ.జ్ఞానవేల్‌రాజాకు 194 ఓట్లు, దేవరాజ్ 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కాగా జ్ఞానవేల్‌రాజా జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీరామ్ 202 ఓట్లతో గెలుపుపొందారు. ఆయనపై పోటీ చేసిన రాజ్‌గోపాలన్ 173, ఎన్.చంద్రన్56 ఓట్లకే పరిమితం అయ్యారు.
కార్యదర్శి పదవికి పోటీ చేసిన మెట్రో జయ 169 ఓట్లతో గెలుపోందారు. ఆయనతో పోటీ పడిన నేశమణి 142 ఓట్లు, కలైపులి జీ.శేఖర్ 140 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీనివాసన్ 216 ఓట్లతో ఆయనతో పోటీ పడ్డ కే.రాజన్ 199 ఓట్లు, ఆర్.సంపత్ 30 ఓట్లతో ఓటమిని చవిచూశారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన బాబురావ్ 201ఓట్లతో గెలుపోందగా, ఆయన్ను ఢీకొన్న సిద్ధిక్ 142 ఓట్లతో, జీ.మోహన్‌రావ్ 54 ఓట్లతోనే సరిపట్టుకుని ఓటమిపాలయ్యారు. మరోసారి సంఘం అధ్యక్ష పదవిని చేపట్టిన అరుళ్‌మణిని నిర్మాత కలైపులి ఎస్.థాను, ఎస్‌వీ.శేఖర్ తదితర సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment