అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చు ఏడు నెలల నిరీక్షణ ఫలించింది. ఇన్ని రోజులూ తాళాలేసిన థియేటర్స్‌ని తెరవబోతున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ బ్రేక్ ముగిసింది. ప్రొజెక్టర్ల దుమ్ము దులపబోతున్నారు. పాప్ కార్న్ ఎప్పటిలానే పొంగబోతోంది. నిశ్శబ్దంగా మారిన సినిమా హాళ్లలో సందడి మొదలవ్వనుంది. సినిమాను సినిమాలా చూసే అసలైన మజా మళ్లీ రానుంది. కొంత గ్యాప్ తర్వాత తెరపై బొమ్మొచ్చె వేళయింది. సినీ ప్రేమికుల పండగ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారో చూద్దాం...
కరోనా వైరస్..
లాక్‌డౌన్ వల్ల చాలా సినిమాలు చిత్రీకరణ ఆగిపోయాయి. కానీ లాక్‌డౌన్‌లోనే రామ్‌గోపాల్ వర్మ పలు సినిమాలను చిత్రీకరించారు. అందులో ‘కరోనా వైరస్’ ఒకటి. లాక్‌డౌన్ వల్ల ఇంట్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే అని ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ.
లాక్‌డౌన్ 5లో భాగంగా థియేటర్స్ రీఓపెన్ చేయటం ఆనందమే. కానీ, దీనికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి థియేటర్ యాజమాన్యాలు కరెంట్ బిల్లులు కట్టని కారణంగా అందరి పవర్ ఫ్యూజ్‌లు తీసుకుని వెళ్లారు సంబంధిత అధికారులు. అలాగే థియేటర్లు నడవాలంటే కంటెంట్ కావాలి. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎవ్వరి దగ్గరా కంటెంట్ లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కంటెంట్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని డబ్బులు ఇచ్చి కొనరు. కేంద్రప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. గతంలో ఉన్న ఖర్చులకంటే ఇప్పుడు థియేటర్లకు శానిటైజేషన్ రూపంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా అరికట్టాలి? అసలు జనాలు వస్తారా, రారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ థియేటర్లు ఆరంభించాకే సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి.
– డి.సురేశ్‌కుమార్, సాయి సినీచిత్ర (వెస్ట్‌గోదావరి డిస్ట్రిబ్యూటర్)
థియేటర్లు ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నాం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాలిడే. తర్వాత శని, ఆదివారం కావటంతో సోమవారం గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకటిస్తుందనుకుంటున్నాం. మా థియేటర్‌ను పూర్తి స్థాయిలో రెడీ చేయటానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని షోలకు థియేటర్‌ను ఎలా శానిటైజ్ చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం.
– అరుణ్, శ్రీరాములు థియేటర్, హైదరాబాద్
బుధవారం సెంట్రల్ గవర్నమెంట్ వారు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పగానే గురువారం మా స్టాఫ్ అందరినీ పనుల్లోకి రమ్మని చెప్పాం. థియేటర్‌లో సీటు సీటుకి మధ్య గ్యాప్‌కోసం థర్మాకోల్ షీట్‌ను అమరుస్తున్నాం. ప్రతి షోకి శానిటైజేషన్ చేయటానికి మా స్టాఫ్‌కి తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం సినిమాలను కొనే పరిస్థితుల్లో లేం. మా డిస్ట్రిబ్యూటర్స్ ఏ సినిమా ఇచ్చి ఆడించమంటే ఆ సినిమా ఆడిస్తాం.
– కుమార్, దేవి 70 ఎం.ఎం థియేటర్ మేనేజర్, హైదరాబాద్
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షోకు శానిటేజైషన్ చేయటం వల్ల నెలకు దాదాపు 40 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు అదనంగా పెరుగుతుంది. అలాగే థియేటర్‌కి వచ్చి టికెట్ తీసుకునే ప్రేక్షకుల నుంచి డబ్బును తీసుకోవడానికి కూడా సెపరేట్‌గా శానిటైజ్ చేయటానికి కొత్త మిషన్లను తీసుకోవాలనుకుంటున్నాం.
– శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment