మనుషులతో వాస్తవం నిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. కళ్లకు కట్టిన గంతలు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందోనని భయం. చేదు నిజంలో కంటె, తియ్యని అబద్ధంలో జీవించడమే మనిషికి ఆనందం. అయితే ఒక చేదు నిజాన్ని విని గుండె ఆగినంత పనైంది ఆ తల్లికి! అయినప్పటికీ కుమారుడిని అర్థం చేసుకుంది. భర్తతో పోరాడింది. కొడుకుకు, భర్తకు మధ్య నలిగిపోయింది. ఈ థీమ్‌తో ఒక సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు క్వీర్ సినిమాలు (హోమో సెక్సువల్) తీయడంతో సిద్ధహస్తుడైన శ్రీధర్ రంగాయన్. ఆ చిత్రం పేరు ‘ఈవెనింగ్ షాడోస్’. జనవరి 10న మెట్రో నగరాల్లోని పరిమిత థియేటర్‌లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
అబ్బాయి ఊరి నుంచి రాగానే వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయికి విషయం చెప్పారు. అయితే ఆ అబ్బాయి.. ‘‘అమ్మా! ఎందుకో నాకు అమ్మాయిల మీద మనసు పోవట్లేదు’ అన్నాడు. తల్లి షాకయ్యింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ‘ఈవెనింగ్ షాడోస్’ చిత్రంలోని సీన్ ఇది. ముంబైకి చెందిన ఒక యువకుడు కర్ణాటకలోని తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని చూడటానికి తనకు మనస్కరించడం లేదని, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తాను ‘గే’ అని తల్లికి చెప్పుకుంటాడు. ఆవిడకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ యువకుడి పేరు కార్తిక్ (దేవాంశ్ దోషి). మోనా అంబేగాన్‌కర్ కార్తిక్ తల్లిగా నటించారు. అనంత్ మహదేవన్, అర్పిత్ చౌదరీ, యామినీ సింగ్, అభయ్ కులకర్ణి, వీణా నాయర్, దిశా ఠాకూర్ ఇందులో నటించారు. 2018, జనవరి 11న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించి, అవార్డులు అందుకున్నారు. చాలామంది గేలను కలిసి, వారి జీవితాల గురించి స్వయంగా తెలుసుకున్న అనుభవంతో ఈ చిత్రం తీశారు రంగయాన్. బెంగళూరు ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇబ్బందిపడడం గమనించారు రంగాయన్. ముఖ్యంగా మగవారు ఇబ్బంది పడటం ఆయనకు కనిపించింది. కొందరు హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడటం వలన చిత్రం గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు రంగాయన్.
ఈ కథను రంగాయన్ 2009లో రాయడం ప్రారంభించారు. సినిమా తీయడానికి తగినంత డబ్బు దొరకడంలో ఆలస్యం జరగడంతో, ఏడు సంవత్సరాల తరవాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. బాలారిష్టాలు దాటుకుని 2016లో చిత్ర నిర్మాణం ఊపందుకుంది. తియ్యడం వరకు బాగానే ఉంది కానీ, విడుదల చేయడం ఇబ్బందికరంగా మారింది. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అందువల్ల ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. 200 థియేటర్లలో శుక్రవారం నాడు విడుదల చేసే పద్ధతి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. అన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎవ్వరూ వెళ్లి చూడరు. తక్కువ స్క్రీన్లు ఉన్నచోట విడుదల చేసి, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వస్తుందో చూడాలనుకుంటున్నారు రంగాయన్.
– జయంతి
కూర్చోనివ్వని సినిమా
Published Sun, Jan 20 2019 1:29 AM | Last Updated on Sun, Jan 20 2019 1:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment