‘సాక్షి’ పత్రిక ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించి, మంగళవారం ప్రచురించిన పూరీ జగన్నాథ్ వాదన (‘లోఫర్ కాదు’)కు స్పందిస్తూ, ‘ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు’ లేఖ రూపంలో ఆయనకు ఒక వివరణనిచ్చారు. అది...
‘‘పూరీ జగన్ గారూ!
మీ ఆఫీసులో మిమ్మల్ని మేము కలిసింది ఒకే ఒక్కసారి. అదీ - ‘లోఫర్’ సినిమా రిలీజ్‌కు ముందు! కానీ, మీరు మాత్రం మా నష్టాల్ని భర్తీ చేసుకోవడానికి, మీతో 5 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావించినట్లు ఆరోపించారు. సార్! సినిమా రిలీజ్‌కు ముందే అది ఫ్లాప్ అవుతుందనీ, నష్టాలు వస్తాయనీ మాకు ఎలా తెలుసు?
మీరు మా మీద కేసులు పెట్టారు. ఈ ఏప్రిల్ 14న మేము మీ దగ్గరకు వచ్చామంటూ పోలీసులు చేస్తున్న వాదనకు ఒక్క సాక్ష్యమైనా చూపించాల్సిందిగా కోరుతున్నాం. మీ ఇల్లంతా పూర్తిగా సి.సి. టీవీ కెమేరాలుంటాయి. గేటు దగ్గర గన్‌మ్యాన్ ఉంటాడు. మీ ఇంటికి రావడం అంత సులభం కాదు. గడచిన 4 నెలల్లో ఈ వ్యవహారంపై మేము మీకు పంపిన ఒక్క ఎస్సెమ్మెస్ కానీ, చేసిన ఫోన్ కాల్ కానీ, వాట్సప్ కానీ చూపించండి.
డబ్బంతా చెల్లించాం!
ఇక, మేము కేవలం రూ. 3.5 కోట్లే చెల్లించామనడం శుద్ధ అబద్ధం. మేము డబ్బంతా చెల్లించాం (‘లోఫర్’ చిత్ర నిర్మాత సి. కల్యాణ్‌కు చెందిన ‘శ్రీశుభశ్వేతా ఫిల్మ్స్’కు రూ.7.02 కోట్ల మేర మొత్తాన్ని అభిషేక్‌కు చెందిన ‘శ్రీఅభిషేక్ పిక్చర్’ సంస్థ బ్యాంకు ద్వారా చెల్లించినట్లు ఒక లెడ్జర్ పత్రం కూడా వాట్సప్‌లో సాక్ష్యంగా పెట్టారు). పైగా మేమెప్పుడూ వసూళ్ళ వివరాల్ని తిమ్మిని బమ్మిని చేయలేదు. నిజానికి, మేము రిలీజ్ చేసే సినిమాలకు ప్రతి రాత్రీ ట్విట్టర్‌లో వసూళ్ళ వివరాలను పెట్టే సంస్థ మాది ఒక్కటే! సినిమాల పంపిణీకి మాకు వచ్చే కమిషన్ కేవలం 20 శాతమే.
మీ కొత్త సినిమా రిలీజ్‌లను మేము ఆపుచేస్తామని భావించి, మమ్మల్ని బెదిరించడం కోసం మీరు మా మీద తప్పుడు కేసు పెట్టారనే విషయం ప్రపంచానికి తెలియాలి. ఈ వ్యవహారంలో మేము పోలీస్ కమిషనర్‌నీ, డి.జి.పినీ, రాష్ట్ర హోమ్ మంత్రినీ, అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రినీ మా పిటిషన్‌తో కలుస్తాం. మా మీద మీరు పెట్టిన తప్పుడు కేసులకు ప్రతిగా మేము పరువునష్టం దావా వేయనున్నాం.
- కాలి సుధీర్, అభిషేక్, ముత్యాల రామ్‌దాస్ (డిస్ట్రిబ్యూటర్లు)’’
పరువునష్టం దావా వేస్తాం!
Published Tue, Apr 19 2016 11:51 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM
Advertisement
Advertisement