పోలవరం స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయం రూ.5,338.9 కోట్లు
కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదన
దీనిపై సీడబ్ల్యూసీ సందేహాలను నివృత్తి చేసిన అధికారులు
వ్యయం ఆమోదంపై సీడబ్ల్యూసీ కసరత్తు కొలిక్కి
అనంతరం భూసేకరణ, పనులు ప్రారంభం
జలాశయం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలు నిర్మించాలంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వడానికి రూ.5,338.9 కోట్లు వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారవర్గాలు తేల్చాయి. జలాశయం పనులు పూర్తయ్యేలోగా కాలువలతోపాటు స్ట్రిబ్యూటరీలను కూడా పూర్తి చేసి సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
దీని ప్రకారం కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఆ మేరకు నిధులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలు మార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ ప్రక్రియను పూర్తి చేసి, స్ట్రిబ్యూటరీలకు భూసేకరణ చేసి, పనులకు టెండర్లు పిలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలను పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే జలాశయం పనులు కొలిక్కి..
గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టులో విధ్వంసానికి కారణమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది.
కుడి కాలువలో మిగిలిన పనులతో పాటు ఎడమ కాలువలలో కీలకమైన నిర్మాణాలు, జలాశయంతో కాలువల అనుసంధానం పనులు పూర్తి చేసింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేలి్చ, ప్రాజెక్టును పూర్తి చేసే విధానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది.
ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని, సమాంతరంగా కొత్తది నిర్మించాలని చెప్పింది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వరదల్లోనూ డయాఫ్రం వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్‌ఎఫ్ డ్యాంను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
» పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు
» కుడి కాలువ పొడవు 178.812 కిలోమీటర్లు..
» ఎడమ కాలువ పొడవు 212.32 కిలోమీటర్లు..
» పూర్తయిన కుడికాలువ పనులు
» 100 శాతం ప్రాజెక్టు ద్వారా వినియోగించుకొనే జలాలు 322 టీఎంసీలు
» ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు
» పూర్తయిన ఎడమ కాలువ పనులు 73.07 శాతం
Comments
Please login to add a commentAdd a comment